Share News

కరాచీలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి..

ABN , Publish Date - Jun 28 , 2026 | 07:46 AM

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరాచీలోని గులిస్థాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్స్ ప్రావిన్షియల్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న (శనివారం) రాత్రి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

కరాచీలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి..

కరాచీ: పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరాచీలోని గులిస్థాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్స్ ప్రావిన్షియల్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న (శనివారం) రాత్రి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనం రేంజర్స్ భవనాన్ని ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. అనంతరం ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో నలుగురు సింధ్ రేంజర్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.


అనంతరం మరో పేలుడు తర్వాత మొసామియత్ చౌరంగి, యూనివర్సిటీ రోడ్డులోని మెటియరాలజికల్ చౌరంగి ప్రాంతాల్లో భారీ కాల్పులు జరిగాయి. దీంతో భద్రతా బలగాలు మొత్తం ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని రాకపోకలను నిలిపివేశాయి. ఘటనాస్థలికి ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసు కమాండోలు, ఇతర ప్రత్యేక దళాలు చేరుకుని విస్తృతంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరగగా.. ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడికి తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) అనుబంధ ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్-అహ్రార్ (JuA) బాధ్యత వహించింది. తమ ఖులఫా-ఎ-రాషిదీన్ ఇస్తిష్హాది బ్రిగేడ్‌కు చెందిన ఆత్మాహుతి దళం ఈ దాడికి పాల్పడినట్లు ఆ సంస్థ ప్రకటించింది.


ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. మరోవైపు సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా స్పందించారు. పేలుళ్లు, కాల్పులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలికి వెంటనే చేరుకుని పరిస్థితిని సమీక్షించి, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆజ్ఞాపించారు. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో పోలీసు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా టీటీపీ, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలు వరుస దాడులతో దేశ భద్రతా వ్యవస్థకు సవాలు విసురుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

జపాన్‌లో మరోసారి భూప్రకంపనలు.. 6.1తీవ్రతతో భూకంపం..

ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.. పలు సైనిక కేంద్రాలు ధ్వంసం..

Updated Date - Jun 28 , 2026 | 07:50 AM