జపాన్‌లో మరోసారి భూప్రకంపనలు.. 6.1తీవ్రతతో భూకంపం..
ABN , Publish Date - Jun 28 , 2026 | 07:07 AM
ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు ప్రజలను జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇటీవల వెనుజువెలా, జపాన్, ఫిలిప్పీన్స్, నికరాగువా, అమెరికా దేశాల్లో భూకంపాలు వచ్చి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. తాజాగా ఆదివారం తెల్లవారుజామున జపాన్ ఈశాన్య ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
టోక్యో: ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇటీవల వెనుజువెలా, జపాన్, ఫిలిప్పీన్స్, నికరాగువా, అమెరికా దేశాల్లో భూకంపాలు వచ్చి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. నిన్న (శనివారం) పాకిస్థాన్, అప్ఘానిస్థాన్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత భారతదేశ రాజధాని ఢిల్లీని కూడా తాగాయి. తాజాగా ఈరోజు (ఆదివారం) తెల్లవారుజామున జపాన్ ఈశాన్య ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) తెలిపింది. అమోరి ప్రిపెక్చర్‌లోని హచినోహే ప్రాంతంలో భూకంపం వచ్చిందని వెల్లడించింది.
భూకంప కేంద్రం భూమికి సుమారు 40 కిలోమీటర్ల లోతులో ఉందని జేఎంఏ పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం ఈ భూకంపం ఉదయం 5.21 గంటలకు సంభవించిందని వెల్లడించింది. భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో వణికిపోయారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అధికారులు ఎటువంటి సునామీ హెచ్చరికలూ జారీ చేయలేదు. కాగా, జపాన్‌లో ఈనెల 25న మరో భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్‌లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ఇది నమోదైంది. దీని ప్రభావంతో అమోరి ప్రిఫెక్చర్‌లోని హషికామి పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో కంపించాయి.
ఈ భూకంప కేంద్రం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో భూమికి సుమారు 64 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, జపాన్‌లో వరుస భూకంపాలు స్థానికులు, ప్రభుత్వంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు వెనెజువెలాలో ఇటీవల సంభవించిన రెండు భారీ భూకంపాలకు 1,430 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 51 వేల మంది గల్లంతయ్యారు. మరో 300 మందిని అధికారులు సురక్షితంగా కాపాడారు.
ఈ వార్తలు కూడా చదవండి
అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో కంపించిన భూమి..