ఆశలు సమాధి!
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:14 AM
వెనెజువెలాలో భూకంపంతో కుప్పకూలిన భవనాల శిథిలాల్లో చిక్కుకున్నవారు ప్రాణాలతో బయటపడటంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
వెనెజువెలాలో శిథిలాల కిందే వేలాది మంది
వారు ప్రాణాలతో బయటపడటం కష్టమేనంటున్న సహాయక బృందాలు
మరోసారి 4.7 తీవ్రతతో ప్రకంపనలు
కరాకస్/న్యూఢిల్లీ, జూన్ 27: వెనెజువెలాలో భూకంపంతో కుప్పకూలిన భవనాల శిథిలాల్లో చిక్కుకున్నవారు ప్రాణాలతో బయటపడటంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగానే సాగుతున్నా.. భారీ భవనాల శిథిలాలను తొలగించేందుకు అవసరమైన యంత్రాలు, పరికరాలు అందుబాటులో లేకపోవడం, సహాయక బృందాలు సరిపడా లేకపోవడం, స్వల్పస్థాయిలో ప్రకంపనలు వస్తుండటం ఇబ్బందిగా మారింది. విదేశాల నుంచి రెస్క్యూ బృందాలు వచ్చినా ఏమాత్రం సరిపోని పరిస్థితి నెలకొంది. మరోవైపు సమయం గడుస్తున్న కొద్దీ(ఇప్పటికే మూడు రోజులైంది) బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. భూకంపం అనంతరం శనివారం సాయంత్రం వరకు 1,430 మృతదేహాలను వెలికితీయగా, ఇంకా 51 వేల మంది ఆచూకీ లభించడం లేదని అధికారవర్గాలు వెల్లడించాయి. శిథిలాల కింద నుంచి సుమారు 300 మందిని ప్రాణాలతో కాపాడినట్టు తెలిపాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారు ఇంకా జీవించి ఉండటం కష్టమేనని సహాయక సిబ్బంది చెబుతున్నారు. వందలాది మంది తమవారి ఆచూకీ కోసం శిథిలాల వద్ద కన్నీళ్లతో ఎదురుచూస్తున్నారు.
మళ్లీ ప్రకంపనలతో ఆందోళన
వెనెజువెలాలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 4.7 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు వచ్చాయి. దానికి ముందు, తర్వాత కూడా స్వల్పస్థాయిలో ప్రకంపనలు కొనసాగాయి. దీనితో తొలి భూకంపంతో దెబ్బతిన్న ఇళ్లు, నిర్మాణాలు కూలిపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇల్లు, ఇంటితోపాటు సర్వస్వమూ కోల్పోయిన వేలాది మంది.. రాజధాని కరాకస్, తీరప్రాంత పట్టణం లా గువైరాలలో ఆరుబయట మైదానాల్లో, పార్కులు, చెట్ల కింద, కార్లలో, హైవేల పక్కన గడుపుతున్నారు.
ఆహారం, నీటి కోసం తంటాలు
భూకంపం ప్రభావానికి లోనైన లక్షలాది మంది ఆహారం, నీటి కోసం తంటాలు పడుతున్నారు. తీవ్రంగా ప్రభావితమైన లా గువైరా, కరాక్‌సలోని పలు ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయాయి. సహాయక కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. కరాకస్ శివార్లలోని కటియా లా మార్ ప్రాంతంలో బ్రెడ్, నీళ్లు పంపిణీ చేస్తున్న ట్రక్కును వందలాది మంది జనం చుట్టుముట్టి.. బ్రెడ్, నీళ్లు తీసుకెళ్లిపోయారు.
అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లో భూకంపాలు.. ఢిల్లీలోనూ ప్రకంపనలు
శనివారం అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లనూ భూకంపాలు వణికించాయి. ఉదయం 8.30 గంటల సమయంలో పాకిస్థాన్‌లోని బర్ఖాన్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఇక రాత్రి 7.10 గంటల సమయంలో అఫ్ఘానిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. అటు తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్‌తోపాటు ఇటు పాకిస్థాన్‌లో, ఢిల్లీ సహా ఉత్తరభారత దేశమంతటా ఆ ప్రకంపనల తీవ్రత కనిపించింది. ముఖ్యంగా పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం, ఇస్లామాబాద్, లాహోర్ నగరాల్లో జనం భయాందోళనతో బయటికి పరుగెత్తారు.
