Share News

80 ఏళ్ల చిక్కుముడిని ‘ఏఐ’ విప్పింది!

ABN , Publish Date - Jun 28 , 2026 | 10:00 AM

టీవల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఓ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. ఓపెన్‌ ఏఐ రూపొందించిన ఓ రీజనింగ్‌ మోడల్‌... 80 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఓ గణిత సమస్యను పరిష్కరించింది.

80 ఏళ్ల చిక్కుముడిని ‘ఏఐ’ విప్పింది!
Artificial Intelligence

ఇటీవల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఓ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. ఓపెన్‌ ఏఐ రూపొందించిన ఓ రీజనింగ్‌ మోడల్‌... 80 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఓ గణిత సమస్యను పరిష్కరించింది. ప్రాథమిక రేఖాగణిత ఆకృతులను అధ్యయనం చేసే వివిక్త జ్యామితి (డిస్ర్కీట్‌ జామెట్రీ)లోని యూనిట్‌- దూరం సమస్య ఇది. ఏఐ అసిస్టెడ్‌ మ్యాథ్స్‌ ఆవిష్కరణల్లో దీన్నో మైలురాయిగా పరిశోధకులు చెప్తున్నారు.

ఇరవయ్యో శతాబ్దిలోని ప్రభావవంతమైన గణిత శాస్త్రవేత్తల్లో హంగేరియన్‌ పాల్‌ ఎర్డోస్‌ (1913- 1996) ఒకరు. తన జీవితకాలంలో 1500కు పైగా పరిశోధన పత్రాలను ప్రచురిం చారు. ప్రపంచవ్యాప్తంగా వందలమంది గణితవేత్తలతో కలిసి పనిచేయడం వల్ల ‘ఎర్డోస్‌ నంబర్‌’ అనే ప్రసిద్ధ భావన ఆయన పేరిట ఏర్పడింది.


‘ప్లేనర్‌ యూనిట్‌ డిస్టెన్స్‌’ అనే సమస్యను ఎర్డోస్‌ 1946లో ప్రతిపాదించారు. ఒక చదునైన ఉపరితలంపై బిందువులను (చుక్కలు) ఉం చాలి. సాధ్యమైనన్ని ఎక్కువ జతల మధ్య ఒకే దూరం ఉండేలా అమర్చాలన్నమాట. ఇలా ఒక సమతలంపై అనేక బిందువులను ఉంచితే- వాటిలో కచ్చితంగా ఒక యూనిట్‌ దూరంలో గరిష్ఠంగా ఎన్ని జంటలుంటాయి? ఇదే ఆ సమస్య.

వినడానికి సాధారణంగానే అనిపిస్తోంది కానీ... దీని జవాబు మాత్రం అత్యంత సంక్లిష్టం. దీనికి సరైన గణిత సమాధానం కనగొనడం గత ఎనిమిది దశాబ్దాలుగా గణితవేత్తలకు సవాలుగా మారింది.


ఒకదానికొకటి సమాన దూరంలో ఉండేలా వీలైనన్ని ఎక్కువ బిందువుల జతలను అమర్చడానికి ఒక క్రమబద్ధమైన (రెగ్యులర్‌) గ్రిడ్‌ను ఉపయోగించడం ఉత్తమమని ఎర్డోస్‌ భావించారు. ఇందులో బిందువులను వృత్తాలపై గరిష్ఠ సంఖ్యలో అమరేలా ఉంచుతారు. మరిన్ని బిందువులను జోడించినపుడు జతల సంఖ్య పెరుగుతుంది కానీ... ఆ పెరుగుదల స్వల్పం గానే ఉంటుందని ఎర్డోస్‌ ఊహించారు. ఈ ఊహను రుజువు చేయడం కానీ, తప్పని నిరూపించడం కానీ ఏ ఒక్కరూ చేయలేక పోయారు ఇంతకాలంగా!


రంగంలోకి కృత్రిమ మేధ

పరిశోధకులు ఈ సమస్యను ఏఐ మోడల్‌కి ఇచ్చారు. ఒక చదరపు గ్రిడ్‌ (స్క్వేర్‌ గ్రిడ్‌) తరహా అమరికే ఉత్తమ పరిష్కారం కావొచ్చని గణితశాస్త్రజ్ఞులు ఇన్నేళ్లుగా భావిస్తూ వచ్చారు. కానీ ఓపెన్‌ ఏఐ మోడల్‌... బిందువుల జతలను అమర్చడానికి మరింత క్లిష్టమైన, పూర్తిగా కొత్త రకమైన విధానాన్ని కనుగొంది. దీనివల్ల ఆ జతల సంఖ్య వాస్తవానికి చాలా వేగంగా పెరుగుతుంది. పెరుగుదల స్వల్పమేనని ఇప్పటి వరకూ భావించిన ఎర్డోస్‌ ఊహ సరికాదంటూ ఏఐ నమూనా నిరూపించింది.


book4.2.jpgదీన్ని మరింత సులువుగా చెప్పాలంటే... ఒక పెద్ద అడవి. దానిలో వేలమంది గణిత శాస్త్ర వేత్తలు పరిష్కార మార్గం కోసం 80 సంవత్సరాల పాటు అన్వేషించారు. వారికి ఏమీ దొరకలేదు. కానీ ఏఐ కొత్త కోణంలో ఆలోచించి ఆ దారి కనుగొన్నదన్నమాట!

ఈ సమస్య పరిష్కారంలో మ్యాథ్స్‌ టూల్‌ను గానీ, సాఫ్ట్‌వేర్‌ను గానీ వాడలేదు. ఆసక్తికర మైన విషయం ఏమిటంటే... ఏఐ ప్రత్యేకంగా ఈ సమస్యను ఛేదించడానికి శిక్షణ పొందలేదు. సాధారణ రీజనింగ్‌ సామర్థ్యాలతోనే గణితం లోని వేర్వేరు శాఖలను అనుసంధానించి కొత్త మార్గం కొనుగొంది.


ప్రేరణనిచ్చే ఫలితం

‘ఈ ఫలితం గణిత శాస్త్రంలో గొప్ప ముందడుగు’ అంటూ హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన మెలానీ మాచెట్‌ ఉడ్‌ వ్యాఖ్యానిం చారు. అత్యంత పురాతనమైన, ప్రాథమికమైన బీజ గణితం, సంఖ్యా శాస్ర్తాల్లోని సాధనాలను ఉపయోగించి ఏఐ ఒక ప్రతి- ఉదాహరణ (కౌంటర్‌ ఎగ్జాంపుల్‌)ను రూపొందించింది. ‘ఈ రంగాలకు ఈ జామెట్రీ ప్రశ్నతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదనిపిస్తుంది. కానీ గణితశాస్త్రంలోని ఒక విభాగానికి చెందిన సాధనాలను అదే విభాగంలోని మరో రంగంలో ఎంత ఫలవంతంగా ఉపయోగించవచ్చో చూపిస్తుందీ ఫలితం. అవే సాధనాలను కొత్త మార్గాల్లో ఎలా ఉపయోగించవచ్చో ఆలోచించడానికి ఇది గణిత శాస్త్రజ్ఞులను ప్రేరేపిస్తుంది’ అంటున్నారామె.


  • స్వయంప్రతిపత్తితో కృత్రిమ మేధ సాధించిన ఫలితాల్లో ఇది మొదటిదని భావిస్తున్నారు. దీనిద్వారా విజ్ఞాన శాస్త్ర అవగాహనకు ఏఐ దోహదపడగలదని నిరూపించింది.

  • ఇంతకుముందు ఏఐ ప్రధానంగా.. తెలిసిన సమాచార అన్వేషణ, సంగ్రహణ, ఇప్పటికే ఉన్న పరిష్కారాల పునరుత్పత్తి మాత్రమే చేసేది. కానీ ఈసారి కొత్త గణిత ఆలోచనను సృష్టించింది.

  • ఏఐ కేవలం లెక్కలు చేసే యంత్రం కాదనీ, కొత్త సిద్ధాంతా లను కనుగొనగల పరిశోధన సహచరుడిగానూ మారగలదనీ ఈ విజయం రుజువు చేస్తోంది.

కృత్రిమ మేధ ప్రదర్శించిన ఇలాంటి లోతైన తర్క సామర్థ్యాలు.. భవిష్యత్తులో జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్‌, వైద్యం లాంటి రంగాల్లో కొత్త ఆవిష్క రణలను వేగవంతం చేయగలవని నిపుణులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఇవే..

బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 28 , 2026 | 10:26 AM