Share News

జెన్‌ జీ యాక్ససరీస్‌కీ ఓ లెక్కుంది!

ABN , Publish Date - Jun 28 , 2026 | 08:54 AM

కాలానికి తగినట్టు ఫ్యాషన్లు మారుతుంటాయి. నేటి జెన్‌ జీకి యాక్ససరీలంటే మహా సరదా.

జెన్‌ జీ యాక్ససరీస్‌కీ ఓ లెక్కుంది!
Gen Z accessories,

కాలానికి తగినట్టు ఫ్యాషన్లు మారుతుంటాయి. నేటి జెన్‌ జీకి యాక్ససరీలంటే మహా సరదా. వాళ్లు ధరించే దుస్తులే కాదు... ఫోన్‌ కేసులు, నీళ్ల బాటిల్స్‌ ఆఖరికి రబ్బరు బాండ్లు కూడా భిన్నంగా ఉంటాయి. ప్రతీ స్టయిల్‌లో వాళ్ల అభిరుచి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వారికి నచ్చేట్టు ఆయా ఉత్పత్తుల్లో కొత్తదనాన్ని తెస్తున్నారు ఉత్పత్తిదారులు. ప్రస్తుతం జెన్‌ జీ వినియోగిస్తున్న ట్రెండీ యాక్ససరీలను డీకోడ్‌ చేద్దాం...

అమ్మమ్మల కాలం... దట్టంగా నూనె రాసుకుని రిబ్బన్లతో రెండు జడలు అల్లుకుని, చేతిలో రెండు పుస్తకాలతో కాలేజీకి వెళ్లేవాళ్లు. అమ్మల కాలం... పోనీటెయిల్‌కి రబ్బరు బ్యాండ్‌ వేసుకుని, పుస్తకాలబ్యాగుతో, అంచెలంచెల టిఫిన్‌ బాక్స్‌తో కాలేజీకి వెళ్లేవాళ్లు. ప్రస్తుతం జెన్‌ జీ అమ్మాయిలు, రంగు రంగుల బ్యాగు, పెద్ద వాటర్‌ టంబ్లర్‌, రకరకాల అలంకరణల ఫోను, మణికట్టుకు వెల్వెట్‌ రబ్బరు బ్యాండ్‌తో కాలేజీకి వెళుతున్నారు. అబ్బాయిల స్టయిల్స్‌ కూడా మారిపోతున్నాయి.


బాటిలే ఓ ట్రోఫీ...

జెన్‌ జీ స్టయిల్‌లో కామన్‌గా కనపడేది పేద్ద వాటర్‌ టంబ్లర్‌. ఒకేసారి లీటర్‌ - లీటరున్నర నీళ్ల టంబ్లర్‌ని చేతిలో పట్టుకుని కనిపిస్తారు. హాల్‌ లోంచి బాల్కనీలోకి వచ్చినా, జిమ్‌కు వెళ్లినా, కాలేజీకి వెళ్లినా వాళ్లతో బాటు ఈ టంబ్లర్‌ ఉండాల్సిందే. ఏదో ఆటలో గెలుచుకున్న ట్రోఫీని మోస్తున్నంత సంబరంగా దాన్ని క్యారీ చేస్తుంటారు. మునుపెన్నడూ లేనంతగా ఇప్పటి యువత నీళ్లకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. అయితే, ఈ నీళ్ల బాటిల్‌ దగ్గరే ఉంది పెద్ద కథ. మామూలు స్టీల్‌, గాజు, ప్లాస్టిక్‌ బాటిలే అనుకోవడానికి లేదు.


book3.jpgపదార్థాలు అవే అయినా రకరకాల డిజైన్లు, ట్రెండీ బొమ్మల ప్రింట్లు, రంగులు... అదనంగా స్ట్రా కూడా దీనికి ఉంటుంది. ఎలుగుబంటి, పాండా లాంటి జంతువులు, పండ్లు, కూరగాయల అచ్చులతో భలే క్రేజీగా ఉంటాయి ఈ టంబ్లర్లు. కొన్నింటికి 3డీ స్టిక్కర్లు కూడా. చాలామంది తమ ఔట్‌ఫిట్‌కు మ్యాచ్‌ అయ్యే వాటినే ఎంచుకోవడం విశేషం. ఇక బ్రాండ్ల పిచ్చి ఉన్న వాళ్లు ఏకంగా స్టాన్లీ కంపెనీ కప్పులు, సిప్పర్లు వాడుతున్నారు. వీటి ధర వేలల్లోనే ఉంటుంది మరి. జాన్వీకపూర్‌, అనన్య పాండేలాంటి జెన్‌ జీ తారలు కూడా ఈ కప్పులతో కెమెరాలకు ఫోజులిస్తున్నారంటే వీటి క్రేజ్‌ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. అలా కాలేజీ పిల్లల నుంచి సినిమా తారల వరకూ ఈ టంబ్లర్ల చుట్టే తిరుగుతున్నారు.


కవరుకూ కథ ఉంది...

పూసలు, రంగుల రిబ్బన్లు, యానిమీ బొమ్మలు, మెరిసే నక్షత్రాలు, హార్ట్‌, జంతువుల రబ్బరు బొమ్మలు...ఇవన్నీ ఏ బ్యాగుకో లేదా కీ చెయిన్‌కో వేలాడదీశారంటే ఓకే... ఈ రోజుల్లో మామూలే అని అనుకోవచ్చు. కానీ వీటన్నింటినీ జెన్‌ జీలు తమ ఫోన్‌కవర్‌కు వేలాడదీసుకుంటున్నారు. ఫోన్ల అలంకరణలో ఈ ధోరణి ఎంతో భిన్నమైనది. కొత్తది కూడా. వీటిని ఫోన్‌ కవర్‌ చార్మ్స్‌గా పిలుస్తున్నారు. ‘ఊప్స్‌’, ‘ఛిల్‌’, ‘లక్కీ’, ‘హ్యాపీ డే’, ‘మై ఫ్రెండ్‌’, ‘యు గాట్‌ దిస్‌’ లాంటి పదాలు, 1,2,3... లాంటి నెంబర్లు కూడా వీటిపై ఉండడం విశేషం. ఫోను కింద పడినా దెబ్బతినకుండా ఉండాలని సాధారణంగా కవర్లను వేస్తుంటాం. ఈ కవర్లు కూడా నిన్నటిదాకా సాధారణంగా ఉండేవి. ఇప్పుడు రకరకాలవి వచ్చేశాయి. చమ్కీలు, అద్దాలు, మెరుపులతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. వీటికి మళ్లీ చార్మ్‌లు జతచేస్తుంటారు. ప్రతీ ఫోన్‌ చూడముచ్చటగా అనిపించడమే గాకుండా, ప్రత్యేక కథను తెలుపుతున్నాయి. ఇలా యువత ఫోన్‌ చార్మ్‌ల ద్వారా తమ ఇష్టాలను చెప్పకనే చెబుతున్నారు.


book3.2.jpgఅల్లేస్తున్నారు...

జెన్‌ జీ తెచ్చిన సాంస్కృతిక మార్పుల్లో అల్లికలు... ముఖ్యంగా క్రోషెట్‌ అల్లిక పేర్కొనదగ్గది. ఒకప్పుడు క్రోషెట్‌ అనగానే అమ్మమ్మలకు సంబంధించింది అనుకునేవారు. ఇప్పుడు మాత్రం యువత స్వీయ వ్యక్తీకరణకు ఇదో సాధనంగా చూస్తున్నారు. తమ కోసమే కాదు... వివిధ సందర్భాలలో స్నేహితులకు, సన్నిహితులకు రంగురంగుల నూలు లేదా దారం పోగులతో అల్లిన బహుమతులు అందిస్తున్నారు. స్వహస్తాలతో చేసినవి కాబట్టి వాటిని అమూల్యమైనవని తెలియజేస్తున్నారు. జెన్‌ జీల బ్యాగులు, పౌచ్‌లు, టాప్‌లు, కుర్తీలు, స్వెట్టర్లు, టోపీలు, బొమ్మలు, మగ్గులు, పిన్నులు హెయిర్‌ బ్యాండ్లు, ఫోన్‌ కవర్లతో పాటు గృహాలంకరణకు అవసరమైనవన్నింటినీ అందంగా అల్లేస్తున్నారు. వాస్తవానికి కరోనా సమయంలో క్రోషెట్‌ పునరుజ్జీవం పొందింది. ఆ తరవాత జెన్‌ జీలు సుస్థిర అభివృద్ధి, పర్యావరణ హితంలో భాగంగా ఈ అల్లికను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఇప్పుడు క్రోషెట్‌తో జెన్‌ జీకి విడదీయరాని బంధం ఏర్పడింది.


గాలి మళ్లింది...

జెన్‌ జీ ఆలోచనల్లోకి గాలి చొచ్చుకుని వచ్చేసింది. ఎంతలా అంటే ప్రతీ ఒక్కరూ సొంతంగా ‘హ్యాండ్‌ ఫ్యాన్లు’ మోసుకుని తిరిగేలా. ఒకప్పుడు అన్నీ డిజిటల్‌ గ్యాడ్జెట్స్‌. ప్రస్తుతం అనలాగ్‌ వస్తువులు మళ్లీ కళ్ల ముందుకు వచ్చేశాయి. వైర్లు ఉన్న హెడ్‌ఫోన్స్‌, రీల్‌ ఉన్న కెమెరాలు, మడచి పెట్టే ఫోన్లు... ఇలా పాతవి సరికొత్తగా మళ్లీ వచ్చేశాయి. అలాంటి కమ్‌బ్యాక్‌ వస్తువుల్లో హ్యాండ్‌ ఫ్యాన్‌ ఒకటి. ప్యాకెట్‌ సైజ్‌ యుఎస్‌బీ పోర్టబుల్‌ ఫ్యాన్స్‌ ఈతరం యువతకి ‘ఎవ్రీ డే క్యారీ (ఈడీసీ) చేయాల్సిన వస్తువుల్లో ఒకటి. సోషల్‌మీడియాలో ఈ ఫ్యాన్లను ఉపయోగించడంపై రకరకాల రీల్స్‌ కనిపిస్తాయి.


book3.4.jpgఈ ఫ్యాన్లు చిన్నవి, బ్యాగుల్లో సులభంగా క్యారీ చేయగలిగేవి. అందుకే యువత తమతో పాటు మోసుకెళ్తోంది. ఆఫీసుల్లో డెస్క్‌ టాపుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. క్యాంటీన్లకు, కచేరీలకు, విహారాలకు ఎక్కడి వెళ్లినా తమతో పాటు వెంట తీసుకెళ్తున్నారు. వీటిల్లో చాలామటుకు రీఛార్జబుల్‌. ఇంకా అడ్వాన్స్‌డ్‌ స్థాయి మినీ ఫ్యాన్స్‌ కూడా వచ్చాయి. ఈ ఫ్యాన్లు అన్నీ వేసవిలో మాత్రమే కాదు, ప్రతీ కాలంలో తమతో పాటే క్యారీ చేస్తున్నారు. వాళ్ల అభిరుచికి తగినట్టు ఎన్నో రంగులు, సైజుల్లో ఇవి లభిస్తున్నాయి.


చేతికి ఉండాల్సిందే!

ఓ రబ్బరు బ్యాండ్‌ జడకే కదా ఉండాల్సింది. జెన్‌ జీ యువతులు రబ్బరు బ్యాండ్లనీ యాక్సెసరీలుగా చేసేశారు. అయితే వీళ్లు ధరించే వాటిని స్క్రంచీలుగా పిలుస్తున్నారు. లోపల సన్నని రబ్బరు బ్యాండ్‌ని పెట్టి పైనంతా సాటిన్‌, వెల్వెట్‌, ఉన్ని, కాటన్‌ తదితర బట్టలతో చుట్టేస్తారు. కాబట్టి మృదువుగా ఉండి, కురులపై ఒత్తిడి పడకుండా చేస్తాయి. చాలా రంగురంగుల్లో ఎంతో అందంగా, విభిన్నంగా ఇవి కనిపిస్తాయి. అందుకేనేమో యువతులు తమ మణికట్టుకు వేసేసుకుంటున్నారు స్టయిల్‌గా. ఒకటి అయితే ఓకే కానీ, రెండు మూడు కలిపేసి మణికట్టుకు పువ్వుల్ని మొలిపిస్తున్నారు.


book3.5.jpgఏ అబ్బాయి అయినా స్క్రంచీని మణికట్టుకు వేసుకుని కనిపించాడంటే, అతడికి గర్ల్‌ఫ్రెండ్‌ ఉందని భావించాలని ఈకాలంలో సాధారణంగా వినిపించే గుసగుసలు. ఇంకా టీనేజీ అమ్మాయిలు తమ అభిమానాన్ని తెలియజేయడానికి స్క్రంచీలను ఓ మార్గంలా కూడా భావిస్తున్నారు. స్నేహితులకు స్క్రంచీని బహుమతిగా అందిస్తూ... తమ మనసులోని భావాల్ని చెప్పకనే చెబుతున్నారు. అయితే ‘ఇది అన్నిసార్లూ ప్రేమ కావాల్సిన అవసరం లేదని, అభిమానం, ఆప్యాయత కూడా కావచ్చ’ని సైకాలజిస్టులు విశ్లేషిస్తున్నారు. జుట్టుకు వేసుకునేది ఒక బ్యాండే కానీ... మణికట్టుకు వేసుకునే స్క్రంచీ వెనక కథలు ఎన్నో. ఇలాంటి అనేక ఆధునిక యాక్ససరీస్‌లతో జెన్‌ జీ... వ్యక్తిగత స్టయిల్‌ స్టేట్‌మెంట్‌ ఇస్తూ హుషారుగా ముందుకు దూసుకెళ్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఇవే..

బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 28 , 2026 | 08:54 AM