తొలిసారి కథ వినకుండానే...
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:44 AM
చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అందాల రాశీఖన్నా... తాజాగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’తో జత కట్టింది. ఈసారి ఎలాగైనా మాస్‌కు దగ్గరవుతానని నమ్మకంగా ఉన్న ఈ బోల్డ్ బ్యూటీ పంచుకున్న ఆసక్తికర ముచ్చట్లివి...
చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అందాల రాశీఖన్నా... తాజాగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’తో జత కట్టింది. ఈసారి ఎలాగైనా మాస్‌కు దగ్గరవుతానని నమ్మకంగా ఉన్న ఈ బోల్డ్ బ్యూటీ పంచుకున్న ఆసక్తికర ముచ్చట్లివి...
థియేటర్‌లో చూస్తేనే మజా...
సినిమాలు థియేటర్‌లో చూడటమంటే నాకు చాలా ఇష్టం. అప్పుడే అసలైన మజా ఉంటుంది. ముఖ్యంగా ఒక నటిగా నాకు థియేటర్ అనుభవం ఇంకా ప్రత్యేకం. ప్రేక్షకులు ఏ సన్నివేశానికి ఎలా స్పందిస్తున్నారో తెలుస్తుంది. వారి రియాక్షన్ చూడడం ఒక నటిగా నాకు చాలా సంతృప్తినిస్తుంది. అందుకే అవకాశం దొరికితే థియేటర్‌కు వెళ్లటానికే ప్రయత్నిస్తా.
ఆధ్యాత్మికత అవసరమే...
చదువు, మార్కులు, కెరీర్ ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక విలువలు కూడా అంతే ముఖ్యమని నమ్ముతా. జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా మనసు గందరగోళంగా ఉన్నప్పుడు... ఆధ్యాత్మిక ఆలోచనలు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఆధ్యాత్మికత అంటే పూజలు చేయడమే కాదు... జీవితం గురించి లోతుగా అర్థం చేసుకోవడం. అందుకే ప్రతీ మనిషి జీవితంలో ఎంతో కొంత ఆధ్యాత్మిక అవగాహన ఉండాలనుకుంటా.
ఆయన నిజంగా పవర్‌ఫుల్...
ఓ రోజు దర్శకుడు హరీష్ శంకర్ నాకు ఫోన్ చేసి... ‘పవన్‌కల్యాణ్‌తో ఓ సినిమా ఉంది. మీరు చేస్తారా’ అని అడిగారు. దాంతో ఎగిరి గంతేసి, మరో ఆలోచన లేకుండా చేస్తానని చెప్పేశా. నా ఇన్నేళ్ల కెరీర్‌లో తొలిసారి కథ వినకుండా ఓకే చెప్పిన సినిమా ఇదే. ఎందుకంటే చిత్రసీమలోకి వచ్చినప్పటి నుంచి పవన్‌కల్యాణ్‌తో కలిసి పని చేయాలన్న కోరిక ఉండేది. ఇన్నాళ్లకు ఆ అవకాశం రాగానే ఆనందంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా. నిజానికి పవన్‌కల్యాణ్ పేరుకు తగ్గట్టే చాలా పవర్‌ఫుల్. ఆయనతో కలిసి పని చేశాకే తన వ్యక్తిత్వం ఎంత గొప్పదో బాగా అర్థమైంది.
స్ట్రీట్ ఫుడ్ ఇష్టం
నాకు స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్తే... స్థానికంగా దొరికే వంటకాలు ట్రై చేస్తా. వాటిల్లో ఆ ప్రదేశానికి సంబంధించిన ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అస్సలు మిస్సవ్వను. నేను వెజిటేరియన్ కాబట్టి ఏదైనా తినే ముందు అది వెజ్ ఐటమా? కాదా?? అని చెక్ చేస్తా. బయట ఫుడ్ కూడా హైజీన్‌గా ఉండాల్సిందే.
ఆ క్రమశిక్షణ వల్లే...
స్కూల్ డేస్ అంటే మనలో క్రమశిక్షణ, విలువలు, బాధ్యతను పెంచే ఒక ముఖ్యమైన దశ. నా చిన్నప్పుడు ‘సమయానికి లేవాలి, సమయానికి బడికెళ్లాలి, ప్రతీ పని క్రమపద్ధతిలో చేయాలి’ అని టీచర్లు, పేరెంట్స్ చెప్తే... ఎందుకింత కఠినంగా ఉంటారోనని అనుకునేదాన్ని. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ క్రమశిక్షణే నా జీవితాన్ని చక్కగా మలిచిందని అర్థమైంది. స్కూల్‌లో నేర్చుకున్న చిన్న చిన్న అలవాట్లు... జీవితంలో బాగా ఉపయోగపడ్డాయి. అప్పట్లో టీచర్లు చెప్పిన మాటలు, చేసిన మార్గనిర్దేశనం నా వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడంలో తోడ్పడ్డాయి.
నిజమైన స్నేహాలు అరుదు
సినీరంగం ఎంత గ్లామర్‌గా కనిపిస్తుందో, లోపల అంత ఒంటరితనం ఉంటుంది. ఇక్కడ సినిమా అయిపోగానే అందరూ ఎవరి దారి వారు చూసుకుంటారు.
నిజమైన స్నేహాలు ఏర్పడటం చాలా అరుదు. నిజానికి సినీ ప్రయాణం ఎవరికైనా తనను తాను అర్థం చేసుకోవడానికి, ఒంటరితనాన్ని తట్టుకుని మరింత బలంగా మారడానికి సహాయపడుతుంది. కేవలం నటన రాగానే సరిపోదు... ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల స్థిరమైన మనస్తత్వం ఉంటేనే ఈ ప్రయాణాన్ని కొనసాగించగలం.
పుస్తకాలు, సినిమాలతో కాలక్షేపం....
పుస్తకాలు మనల్ని కొత్త ఆలోచనల ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. మంచి సినిమాలు కూడా అంతే. ఒక మంచి సినిమా అనేక భావాలను మళ్లీమళ్లీ గుర్తు చేస్తుంది. దూరంగా, ఒంటరిగా ఉన్నా మనుషుల మధ్యనే ఉన్న అనుభూతిని కలిస్తుంది. అందుకే ఒంటరితనంలో నాకు తోడు పుస్తకాలు, సినిమాలే. వాటితోనే నా కాలక్షేపం.
ఈ వార్తలు కూడా చదవండి:
మరో 260 వందేభారత్ స్లీపర్ రైళ్ల తయారీ
ఆర్టీసీలో 198 పోస్టులకు 29న రాత పరీక్ష
Read Latest Telangana News and National News