Share News

మరో 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ

ABN , Publish Date - Mar 22 , 2026 | 06:13 AM

ప్రయాణికుల భద్రత, సౌకర్యం లక్ష్యంగా మరిన్ని అధునాతన ఫీచర్లతో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు తయారుచేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

మరో 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ

  • ప్రయాణికుల భద్రత కోసం అధునాతన ఫీచర్లు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల భద్రత, సౌకర్యం లక్ష్యంగా మరిన్ని అధునాతన ఫీచర్లతో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు తయారుచేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా నమూనాను (ప్రొటోటైప్‌) అభివృద్ధి చేసి, విస్తృత పరీక్షలు, ప్రయోగాలు నిర్వహించినట్లు తాజా నివేదికలో పేర్కొంది. 260 సెట్ల వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపింది. ఈ బాధ్యతను బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌), చైన్నెలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లకు అప్పగించింది. తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు హౌరా(బెంగాల్‌)- కామాఖ్య(అసోం) మార్గంలో జనవరిలో ప్రారంభం కాగా, వివిధ జోన్ల డిమాండ్‌ మేరకు దశలవారీగా మరికొన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రమాదాలను నివారించేందుకు కవచ్‌ వ్యవస్థ, యాంటీ క్లైంబర్లు అమరుస్తారు. కుదుపులు లేకుండా గంటకు 180 కి.మీ. వేగంతో ప్రయాణించేలా కోచ్‌లను డిజైన్‌ చేశారు. అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి కోచ్‌కు ఫైర్‌ బ్యారియర్‌ డోర్లు, ఎలక్ట్రికల్‌ క్యాబినెట్‌లు, టాయిలెట్లలో ఏరోసోల్‌ ఆధారిత అగ్నిని గుర్తించే/అణచివేసే వ్యవస్థలు ఉంటాయి. గాలిలోని 99ు హానికరమైన బ్యాక్టీరియాను నిర్వీర్యం చేసేందుకు యూవీ-సీ ల్యాంప్‌ ఆధారిత క్రిమిసంహారక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. కేంద్రీకృత నియంత్రణతో ఆటోమేటిక్‌ ప్లగ్‌ డోర్లు ఉంటాయి. అన్ని కోచ్‌లలో సీసీటీవీలు, అత్యవసర పరిస్థితుల్లో రైలు మేనేజర్‌/లోకో పైలట్‌తో ప్రయాణికులు సంభాషించేందుకు ఎమర్జెన్సీ టాక్‌-బ్యాక్‌ యూనిట్‌ ఏర్పాటు బెర్త్‌లపైకి సులభంగా ఎక్కడానికి అనువైన నిచ్చెనలు ఉంటాయి.

Updated Date - Mar 22 , 2026 | 06:13 AM