డీగో గార్సియాపై గురి!
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:17 AM
అమెరికా, యూకేల ఉమ్మడి ప్రతిష్ఠాత్మక సైనిక స్థావరం డీగో గార్సియాపైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అందులో ఒకటి మధ్యలోనే కూలిపోగా, మరొకదానిని క్షిపణి రక్షణ వ్యవస్థలు అడ్డుకుని, ధ్వంసం చేశాయి.
4 వేల కి.మీ. దూరంలోని అమెరికా, బ్రిటన్ స్థావరంపైకి ఇరాన్ క్షిపణులు
ఇప్పటివరకూ తెలిసిన మేరకు ఇరాన్ క్షిపణుల గరిష్ఠ సామర్థ్యం 2 వేల కిలోమీటర్లే!
జెరూసలేంలోని అల్‌అక్సా మసీదు సమీపంలో
క్షిపణి దాడి.. బాగ్దాద్‌లోని అమెరికా బేస్‌లో పేలుళ్లు
ఇరాన్ నతాంజ్ అణుకేంద్రంపై అమెరికా దాడులు
ఇజ్రాయెల్ ఎఫ్-16ను కూల్చేశాం: ఐఆర్‌జీసీ
దాడి నిజమేగానీ విమానం కూలలేదు: ఇజ్రాయెల్
హోర్ముజ్‌పై సడలుతున్న ఇరాన్ పట్టు: అమెరికా
జలసంధిని తెరవండి.. ఇరాన్‌కు 22 దేశాల విజ్ఞప్తి
వాషింగ్టన్/దుబాయ్/న్యూఢిల్లీ, మార్చి 21: అమెరికా, యూకేల ఉమ్మడి ప్రతిష్ఠాత్మక సైనిక స్థావరం డీగో గార్సియాపైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అందులో ఒకటి మధ్యలోనే కూలిపోగా, మరొకదానిని క్షిపణి రక్షణ వ్యవస్థలు అడ్డుకుని, ధ్వంసం చేశాయి. అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ అంశంపై కథనం ప్రచురించింది. బ్రిటన్ కూడా ఈ క్షిపణి దాడులను ధ్రువీకరించింది. ఇరాన్ క్షిపణులు ప్రయోగించడం కొత్తేమీ కాకపోయినా ఏకంగా 4 వేల కిలోమీటర్ల దూరం వెళ్లే సామర్థ్యం ఉండటం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు తెలిసిన మేరకు ఇరాన్ క్షిపణుల గరిష్ఠ సామర్థ్యం 2 వేల కిలోమీటర్లే కావడం గమనార్హం. ఈ క్షిపణి దాడులతో పశ్చిమాసియాలోని యుద్ధం హిందూ మహాసముద్రానికీ విస్తరించినట్టేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న డీగో గార్సియా స్థావరం అత్యంత కీలకమైనది. అక్కడ అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక బీ-2 బాంబర్లు సహా అత్యాధునిక మిలిటరీ, రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ వద్ద ఉన్న క్షిపణుల్లో ఖోరామ్‌షెహర్-4 క్షిపణి అత్యధికంగా 2 వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదనే డేటా మాత్రమే ఉంది. అవి మొత్తం పశ్చిమాసియాతోపాటు తూర్పు యూర్‌పలోని కొన్ని దేశాల వరకు చేరుకోగలవని అంచనా. కానీ డీగో గార్సియాపైకి ప్రయోగంతో.. ఇరాన్ క్షిపణుల అసలు సామర్థ్యం ఎంత అనే చర్చ జరుగుతోంది. భారతదేశానికి దక్షిణంగా హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న డీగో గార్సియా దీవి (చాగోస్ ఐలాండ్స్‌లో భాగం) ఇరాన్ నుంచి సుమారు 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇరాన్ క్షిపణి అక్కడి వరకు చేరుకుందంటే.. అది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి (ఐఆర్‌బీఎం) అని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఈ క్షిపణి అటు బ్రిటన్‌లోని లండన్ వరకు చేరుకోగలదని, చాలా వరకు యూరప్ దేశాలపై దాడి చేయగలదని అంటున్నారు. నిజానికి ఇరాన్ ఇటీవలి కాలంలో అంతరిక్ష ప్రయోగాల్లో పురోగతి సాధించింది. రాకెట్లతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఆ రాకెట్ సాంకేతికతలను వినియోగించుకుని.. 4, 5 వేల కిలోమీటర్లకుపైగా సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణులను (ఐసీబీఎం)లను ఇరాన్ అభివృద్ధి చేస్తోందని అమెరికా గతంలోనే పేర్కొంది కూడా.
ఇరాన్‌ది అవివేకపూరిత చర్య: యూకే
డీగో గార్సియాపై ఇరాన్ క్షిపణి దాడులను యూకే ఖండించింది. అది అవివేకపూరిత చర్య అని మండిపడింది. ఆ దాడులు విఫలమయ్యాయని పేర్కొంది. యూకే స్థావరాలపై ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి మూసివేత వంటివి బ్రిటన్‌కు, మిత్ర దేశాల ప్రయోజనాలకు నష్టకరమని పేర్కొంటూ యూకే రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే ఆ క్షిపణులు ఎంత సమీపంలోకి వచ్చాయి? ఎలా కూల్చారు? ఏమైనా నష్టం జరిగిందా అన్న వివరాలను వెల్లడించలేదు. ఇరాన్‌పై యుద్ధంలో యూకే నేరుగా పాల్గొనకపోయినా.. తమ దేశంలోని బేస్‌లను, ఉమ్మడి స్థావరమైన డీగో గార్సియాను ఇరాన్‌పై దాడికోసం వినియోగించుకునేందుకు ఇటీవలే అమెరికాకు అనుమతించింది. ఈ క్రమంలో డీగో గార్సియాపై ఇరాన్ క్షిపణి దాడులకు ప్రయత్నించింది.
నతాంజ్ అణు కేంద్రంపై దాడి
ఇరాన్‌లోని కీలకమైన నతాంజ్ అణు విద్యుత్ కేంద్రంపై మరోసారి దాడి జరిగింది. ఆ ప్రాంతంలోని పలు భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్-అమెరికా తీరు నేరపూరితమని, అంతర్జాతీయ అణు ఒప్పందాలకు విరుద్ధమని మండిపడింది. దీనిపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతానికి నతాంజ్ కేంద్రం నుంచి రేడియో ధార్మికత ఏమీ వెలువడటం లేదని ప్రకటించింది. నిజానికి ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలుపెట్టిన రెండో రోజే నతాంజ్ అణుకేంద్రంపై దాడి జరిగింది. రేడియో ధార్మికత లీక్ కావొచ్చన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అలాంటిది ఇప్పుడు మళ్లీ దాడి జరగడం కలకలం రేపుతోంది. నతాంజ్ అణుకేంద్రంపై దాడులను ఐఏఈఏ ధ్రువీకరించింది. అణుకేంద్రంపై దాడిని రష్యా తీవ్రంగా తప్పుబట్టింది. అణు ధార్మికత లీకైతే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ అంశంలో ప్రపంచ దేశాలు కలగజేసుకోవాలని కోరింది. అయితే నతాంజ్ అణుకేంద్రంపై దాడి అమెరికా పనేనని, అక్కడ బంకర్ బస్టర్ బాంబులు వేసిందని ఇజ్రాయెల్‌లో కథనాలు ప్రసారం కావడం గమనార్హం.
ఇజ్రాయెల్ ఎఫ్-16ను కూల్చేశాం: ఐఆర్‌జీసీ
టెహ్రాన్ నగర సమీపంలో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఎఫ్-16 ఫైటర్‌ను శనివారం తెల్లవారుజామున కూల్చివేశామని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. శత్రువులకు సంబంధించి తాము కూల్చిన మూడో ఫైటర్ ఇది అని పేర్కొంది. ఇప్పటివరకు శత్రువులకు చెందిన డ్రోన్లు, క్షిపణులు, ట్యాంకర్ విమానాలు, ఫైటర్ జెట్లు కలిపి 200 టార్గెట్లను అడ్డుకుని, ధ్వంసం చేశామని తెలిపింది. అయితే తమ ఫైటర్ ఏదీ కూలిపోలేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ పేర్కొంది. టెహ్రాన్ సమీపంలో దాడులు చేస్తుండగా ఒక ఇరాన్ క్షిపణి తమ ఫైటర్ వైపు దూసుకువచ్చిందని.. పైలట్లు వెంటనే తగిన విధంగా స్పందించి, ఫైటర్‌ను తప్పించారని తెలిపింది. ఫైటర్‌కు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. కాగా, ఇక ఇరాన్‌పై దాడులను మరింత ఉధృతం చేయబోతున్నామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ప్రకటించారు. ఇరాన్ బలగాల కమాండర్లను, దాడి సామర్థ్యాలను పూర్తిగా తుడిచిపెట్టేదాకా దాడులు కొనసాగుతాయని పేర్కొన్నారు.
అరబ్ గల్ఫ్ దేశాల్లోని కీలక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున చమురు వ్యవస్థలున్న ప్రాంతాలపైకి దూసుకొచ్చిన 20 డ్రోన్లను అడ్డుకున్నామని సౌదీ ప్రకటించింది.
ఇరాక్‌లోని బాగ్దాద్‌లో అమెరికా సైనిక స్థావరాన్ని నాలుగు డ్రోన్లు తాకాయి. దీనితో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ఇంధన ట్యాంకులను డ్రోన్లతో పేల్చివేశామని.. దానితో సాధారణ విమానాలు, ఫైటర్ల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోందని ఇరాన్ శనివారం వెల్లడించింది. ఆ ప్రాంతంలో తమ వరుస దాడులతో సైనిక సిబ్బందిని ఇజ్రాయెల్ ఖాళీ చేయించిందని పేర్కొంది.
ఇరాన్‌లోని తీరప్రాంత పట్టణం రామ్సార్‌లోని పౌర ఆవాసాలపై యూఎస్ -ఇజ్రాయెల్ దాడులు చేశాయని.. ఒక చిన్నారి, ఆమె తల్లిదండ్రులు మృతిచెందారని మజాన్‌దారన్ రాష్ట్ర గవర్నర్ మెహ్దీ రోస్తామి వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 20,984 మంది ప్రజలు గాయపడినట్టు ఇరాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ముస్లింలు, యూదులు, క్రిస్టియన్లు ఎంతో పవిత్రంగా భావించే జేరుసలేంపై రంజాన్ పండుగ రోజు ఇరాన్ క్షిపణి దాడులు చేసిందని ఇజ్రాయెల్ పేర్కొంది. అక్కడి అల్ అక్సా మసీదుకు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో క్షిపణి దాడి జరిగిందని, ఆధ్యాత్మిక ప్రభుత్వంగా చెప్పుకొనేవారి అసలు రూపం ఇది అని విమర్శించింది.