Share News

మంచుకొండల నుంచి... సరిహద్దు గ్రామాల్లోకి...

ABN , Publish Date - Aug 09 , 2026 | 10:57 AM

ఆకాశాన్నంటే పర్వత శిఖరాలు, అగాథాల్లాంటి లోయలు... ఎత్తైన కొండ శిఖరాల నుంచి మంచు కరిగి, వెండి ధారలుగా పడుతున్న సన్నటి నీటి పాయలు... పరవళ్ళు తొక్కుతూ అతి వేగంగా ప్రవహిస్తూ... సెలయేళ్లుగా, మహోధృత నదులుగా మారే దృశ్యం నిరుపమానం.

మంచుకొండల నుంచి... సరిహద్దు గ్రామాల్లోకి...

ఆకాశాన్నంటే పర్వత శిఖరాలు, అగాథాల్లాంటి లోయలు... ఎత్తైన కొండ శిఖరాల నుంచి మంచు కరిగి, వెండి ధారలుగా పడుతున్న సన్నటి నీటి పాయలు... పరవళ్ళు తొక్కుతూ అతి వేగంగా ప్రవహిస్తూ... సెలయేళ్లుగా, మహోధృత నదులుగా మారే దృశ్యం నిరుపమానం. అదే సమయంలో కళ్ళు తిరిగే కొండల అంచులగుండా, గుండెను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించడం సాహసంగానూ, సరదాగానూ ఉంటుంది. కశ్మీర్‌ నుంచి అమృత్‌సర్‌ దాకా ఇటీవల ఓ బృందం సాగించిన ప్రయాణ విశేషాలివి...

శ్రీనగర్‌ నుంచి లద్ధాఖ్‌, మనాలీ మీదుగా అమృతసర్‌ వరకు 13 రోజుల ప్రయాణం మాది. భావసారూప్యత కలిగిన మిత్రులం పదిమందిమి కలిసి ఈ సుదీర్ఘ ప్రయాణం చేశాం. హైదరాబాద్‌ నుంచి బయలుదేరి శ్రీనగర్‌ విమానాశ్రయంలో దిగగానే నేరుగా (జూన్‌ 27న) పహల్గాం లోయ చేరుకున్నాం. రాత్రి బస అక్కడే. రెండో రోజు పహల్గాం లోయ సందర్శన. 7200 అడుగుల ఎత్తులో ఉండే ఈ లోయ గుండా ‘లిడ్డర్‌’ నది ప్రవహిస్తుంది. అక్కడ ఎక్కువగా సినిమా షూటింగులు జరుగుతాయి. సన్నీ డియోల్‌ ‘బేతాబ్‌’ సినిమా తీసిన స్థలాన్ని ‘బేతాబ్‌ లోయ’గా పిలుస్తారు. ఇక్కడి నుంచే అమర్నాథ్‌ యాత్ర ప్రారంభం అవుతుంది. 2025లో సంచలనం సృష్టించిన ‘పహల్గాం యాత్రికుల కాల్చివేత’ స్థలం ‘బైసరన్‌ వ్యాలీ’కి వెళ్లడాన్ని ప్రస్తుతం నిషేధించారు. 95 కిలోమీటర్లు వెనక్కి వచ్చి శ్రీనగర్లో బస చేశాం.


మూడో రోజున శ్రీనగర్‌ నుంచి పూలలోయ ‘గుల్‌ మార్గ్‌’ ప్రయాణం. ప్రఖ్యాత ‘గొండాల కేబుల్‌ కార్‌’ ఎక్కాలంటే ముందే టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. కొండపై నుంచి లోయదాకా రంగురంగుల పూలతో అందాలను వెదజల్లుతుందీ గుల్మార్గ్‌. అందమైన పచ్చిక బయళ్లతో, విశాలమైన గోల్ఫ్‌ మైదానాలున్నాయి. 360 డిగ్రీలలో చుట్టూరా ఎత్తైన కొండలు కనబడతాయి.

నాలుగో రోజున చారిత్రక, అద్భుతమైన శ్రీనగర్‌ సందర్శన. ‘ప్యారడైజ్‌ ఆన్‌ ఎర్త్‌’ గా పిలిచే ఈ నగరం అందమైన పూదోటలకు, మొఘల్‌ కట్టడాలకు నిలయం. ‘మొగల్‌ గార్డెన్‌’, ‘షాలిమార్‌ గార్డెన్‌’ చూశాం. సీజన్‌ కాదు కాబట్టి ‘తులిప్‌ గార్డెన్‌’లో అందమైన తులిప్‌ తోటలను చూడలేకపోయాం. ఎత్తైన కొండపై వెయ్యేళ్ల నాటి శంకరాచార్యుల ఆల యం ఉంది.


book6.2.jpgఇక్కడి నుంచి శ్రీనగర్‌ పట్టణం మొత్తాన్ని చూడొచ్చు. శ్రీనగర్లో తప్పకుండా చూడాల్సిన దాల్‌ సరస్సులో ఫ్లోటింగ్‌ గార్డెన్‌, ఫ్లోటింగ్‌ మార్కెట్‌, ఫ్లోటింగ్‌ గ్రామాలు ఆశ్చర్యంగా అనిపించాయి. దాల్‌ లేక్‌లో 15 వేల జనాభా ఉందని, 6 వేలమంది బోట్‌లపై ఆధారపడి జీవిస్తున్నారని షికారా (బోట్‌ నడిపే వ్యక్తి) చెప్పాడు. అల్లంత దూరంలో కొండపై రాజా హరిసింగ్‌ కోట కనబడుతుంది. కానీ ప్రవేశం లేదు. ఉద్వేగంతో చూసే ప్రదేశాల్లో ‘లాల్‌ చౌక్‌ స్తూపం’ ఒకటి. నగరం మధ్యలో కశ్మీరీల దశాబ్దాల స్వాతంత్య్ర ఆకాంక్షల పోరాట చిహ్నమిది. ప్రజాందోళనల, వేలాదిమంది త్యాగాల గుర్తు ఇది.


అద్భుతమైన ‘సంగం’

ఐదో రోజు శ్రీనగర్‌ నుంచి ద్రాస్‌, సోన్‌ మార్గ్‌ గుండా 200 కి.మీ. కార్గిల్‌ ప్రయాణం. పచ్చటి కొండలు, లోయలు, నదులతో ప్రకృతి అందంగా కనబడుతుంది. ఈ దారిలోనే సోన్‌ మార్గ్‌ టన్నెల్లో ప్రయాణిస్తాము. 11,578 అడుగుల ఎత్తులో 14.2 కి.మీ. మేర నిర్మాణంలో ఉన్న ‘జోజిల్లా’ సొరంగ నిర్మాణం ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఆసియాలోనే పొడవైన రెండు వైపులా నిర్మిస్తున్న సొరంగ మార్గం.

ఆరో రోజు కార్గిల్‌ నుంచి లే (లద్దాఖ్‌ ముఖ్య పట్టణం) 234 కి.మీ. దూరం. రోజంతా ప్రయాణం. మధ్యలో 1999 కార్గిల్‌ యుద్ధ జవానుల స్మారక స్తూపం, 13,478 అడుగుల ఎత్తులో ఉన్న ‘ఫతుల్లా పాస్‌’, వెయ్యేళ్లనాటి ‘ఆల్చి’ బౌద్ధ సన్యాసాశ్రమం చూశాక... ‘లే’కు చేరే 35 కి.మీ. ముందు అద్భుతమైన ప్రదేశం ‘సంగం’ వస్తుంది. టిబెట్‌ నుంచి నీలిరంగులో నిశ్శబ్దంగా ప్రవహించే ‘సింధూనది’, జంస్కార్‌ లోయ నుంచి మడ్డిగా, బురదగా, వేగంగా ప్రవహించే ‘జంస్కార్‌’ నది కలిసే చోటు ఇది. దేశంలోనే ఎత్తైన రాఫ్టింగ్‌ ప్రదేశం (10 వేల 500 అడుగులు) ఇక్కడే ఉంది.


book6.3.jpgఏడో రోజున లే నుంచి ‘నుబ్రా’ లోయ 150 కి.మీ. ప్రయాణం. 40 కి.మీ దాటాక ‘ఖర్‌ దుంగ్లా పాస్‌’కు చేరాం. ఇక్కడ ఒక కొండ మీద కాఫీ హౌస్‌ ఉంది. అత్యంత ఎత్తులో ఉన్న కెఫెటేరియా అది. అతి చల్లటి వాతావర ణంలో ఆ శిఖరం మీద వేడి వేడి కాఫీ అద్భు తమైన అనుభూతి. అయితే అక్కడ పది నిమిషాలకన్నా ఎక్కువసేపు ఉండనివ్వరు. ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉంటాయి. మార్గం మొత్తంలో ఆక్సిజన్‌ తక్కువగా ఉంటుంది. అందుకని ఆక్సిజన్‌ సిలిండర్‌, కర్పూరం, ఇలాంటి ఏర్పాట్లతో బయలుదేరాలి. ఆన్‌లైన్లో ముందుగానే ‘ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌’ తీసుకోవాలి. నుబ్రాకు 30 కిలోమీటర్ల ముందు ప్రఖ్యాత ‘దిస్కిత్‌ ’ బౌద్ధాశ్రమం, 31 మీటర్ల ఎత్తైన మైత్రేయ బౌద్ధ విగ్రహాన్ని చూడొచ్చు. వ్యాలీకి సమీపంలో ‘హండర్‌ సాండ్‌ డ్యూన్స్‌ (హండర్‌ ఇసుక మేటలు)’ చూసి తీరాలి. లక్షలాదిఏళ్లుగా పర్వతాల నుంచి సహజంగా రాలిపడే రాతి రేణువులతో ఏర్పడిన చల్లని ఎడారి ప్రాంత మిది. ఇక్కడ ఒంటె స్వారీ కూడా చేయొచ్చు.


మర్చిపోలేని జ్ఞాపకం...

ఎనిమిదో రోజున నుబ్రా నుంచి 160 కి.మీ దూరంలో ఉన్న ‘పాంగాంగ్‌’ సరస్సుకు చేరాం. పాంగాంగ్‌ నుంచి 140 కిలోమీటర్లు లే వరకు ప్రయాణం అత్యంత సాహసోపేతమైనది. మే నుంచి జూలై మాసాల్లోనే ఈ దారి తెరిచి ఉంటుంది. మంచు కరిగి నీటి ప్రవాహాల అడ్డంకులు, మధ్యలో ఎలాంటి నివాసాలు లేకుండా రాళ్లలో షాయోన్‌ నదీతీరంలో ఈ ప్రయాణం కొనసాగుతుంది. ‘వారిలా పాస్‌’ దగ్గర మాత్రమే హోటల్‌ సౌకర్యం ఉంది. మొత్తం టూర్లో పాంగాంగ్‌ సరస్సు సందర్శన మర్చిపోలేని జ్ఞాపకం.


book6.4.jpgచైనా, భారత్‌ల మధ్య 134 కిలోమీటర్ల పొడవునా, ఎక్కువలో ఎక్కువగా 5-6 కిలోమీటర్ల వైశాల్యంతో, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఉప్పు నీటి సరస్సు ఇది. భారత భూభాగంలో 45 కిలోమీటర్లు మాత్రమే వ్యాపించి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఏర్పడిన ఉప్పునీటి సరస్సు ఇదొక్కటే. డిసెంబర్‌, ఫిబ్రవరి నెలల మధ్యలో మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలతో గడ్డకట్టుకు పోతుందట. ఈ సీజన్‌ (మే- జూలై)లో కూడా నీటిలో చేతులు పెడితే చల్లబడిపోయి, జివ్వున లాగాయి. ఇందులో జీవులు, చేపల్లాంటివేవీ లేవు. ‘త్రీ ఇడియట్స్‌’ షూటింగ్‌ ‘స్పాంగ్‌ విక్‌’ గ్రామ సమీపంలో జరిగింది. మేము సాయంత్రానికల్లా ‘లే’ (160 కి.మీ.)కు బయలుదేరాం.


తొమ్మిదో రోజు లే నుంచి మనాలీకి వెళ్లే దారిలో 320 కిలోమీటర్లు ప్రయాణం చేసి ‘జిస్ప’కు చేరుకున్నాం. రాత్రి బస అక్కడే చేశాం. ఈ దారి మే నుంచి జూలై మధ్యలో తప్ప మిగతా మాసాల్లో మూసి వేస్తారు. ఎత్తైన కొండశిఖరాలు, అగాథాలుగా ఉండే లోయలు, పాములా తిరుగుతూ, ఎక్కుతూ- దిగుతూ ‘భాగా’ నది పక్కనే ప్రయాణిస్తూ, అనేకచోట్ల ఈ నదిని బ్రిడ్జీల గుండా దాటుతూ చేసే ప్రయాణం మర్చి పోలేని జ్ఞాపకం. ‘జిస్ప’కు రాత్రి కల్లా చేరుకొని, గుడారాల్లో ‘భాగా’ నది పక్కన బస చేశాం.

పదో రోజున ‘జిస్ప’ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని ‘మనాలి’ (140 కి.మీ.) మధ్యాహ్నానికి చేరాం. 40 కిలోమీటర్లు దాటగానే ‘సూరజ్‌ దాల్‌’ సరస్సు. ఇక్కడే ప్రపంచంలోనే ఎత్తైన 9.02 కి.మీ. అతి పొడవైన సొరంగం ‘అటల్‌ టన్నెల్‌’ గుండా ప్రయాణం చేయడం అద్భుతం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైన ఈ టన్నెల్‌ వలన 13,586 అడుగుల ఎత్తులో ఉన్న ‘రోహ్‌ తాంగ్‌ పాస్‌’కు వెళ్లకుండా 48 కిలోమీటర్ల ప్రయాణం ఆదా అవుతుంది.ముఖ్యంగా అన్ని కాలాల్లో ఈ సొరంగం గుండా ప్రయా ణించొచ్చు. సాయంత్రం మనాలిలోని ‘మను టెంపుల్‌’, ‘మాల్‌ మార్కెట్‌’లకు వెళ్ళాం.


book6.5.jpgభీముని భార్య హిడింబ పేరుతో గుడి!

పదకొండవ రోజు ఉదయమే ‘హిడింబ టెంపుల్‌’ కు వెళ్ళాం. ఈ గుడిని పర్యాటకులు తప్పక చూడాలి. భీముని భార్య హిడింబ పేరుపై ఉన్న గుడి భారతదేశంలో ఎక్కడా లేదు. 30 ఏళ్ల క్రితం ఇందులో ఎలాంటి పూజలు ఉండేవి కావు. లోపలా బయటా శుభ్రం చేయకుండా, శతాబ్దాలుగా ఒక నూనె దీపం (వత్తి) వెలుగుతూ, ఆదిమ గిరిజన సంప్రదాయంలో కొనసాగుతూ ఉండేది. ప్రభుత్వం కలుగజేసుకొని పూజారిని నియమించి, నిత్యం పూజలు చేయిస్తూ, సంప్రదాయ హిందూ దేవాలయంగా మార్చివేసింది. 500 ఏళ్ల కింద నిర్మాణమైందని చెబుతున్న ఈ చిన్న గుడి పక్కనే హిడింబ కుమారుడు ‘ఘటోత్కచుడు’, ‘బర్బరీకుడు’ పురాతన చెట్ల కింద త్రిశూలాలు, కత్తులు, జంతువుల కొమ్ముల రూపంలో పూజలు అందుకుంటున్నారు. అదే రోజు సాయంత్రాని కల్లా పంజాబ్‌లోని ‘ఆనందపూర్‌ సాహిబ్‌’ నగరానికి చేరాం. ఈ ప్రయాణంలో ‘బియాస్‌’’, ‘సత్లుజ్‌’, ‘సిర్సా’ నదుల పక్కనే వెళ్తూ, 11 సొరంగ మార్గాల గుండా రోజంతా ప్రయాణం కొనసాగింది.


12వ రోజున అమృత్‌సర్‌ చేరాం. లూథియానా, జలంధర్‌ గుండా 175 కి.మీ. ప్రయాణం. దారిలో జలంధర్‌ నుంచి 65 కిలోమీటర్ల తర్వాత భగత్‌ సింగ్‌ పూర్వీకుల బంగా గ్రామం ఉంటుంది. అదిప్పుడు పాకిస్తాన్‌లో ఉంది. అతని బాల్యం పూర్వీకుల గ్రామమైన ‘ఖట్మర్‌ కలాన్‌’లో కూడా గడిచింది. అందుకే భారత ప్రభుత్వం దీనిని ఒక ముఖ్య పాకిస్తాన్‌లో ఉంది. అతని బాల్యం పూర్వీకుల గ్రామమైన ‘ఖట్కర్‌ కలాన్‌’లో కూడా గడిచింది. అందుకే భారత ప్రభుత్వం దీనిని ఒక ముఖ్య పర్యాటక కేంద్రంగా చేసింది. భగత్‌ సింగ్‌ తండ్రి కిషన్‌ సింగ్‌, తాత అర్జున్‌ సింగ్‌, చిన్నాన్న అజిత్‌ సింగ్‌ ఇక్కడే ఉండే వారు. వీళ్ళ గృహాన్ని మ్యూజియంగా మార్చి ‘షహీద్‌ - ఏ- ఆజాం సర్దార్‌ భగత్‌ సింగ్‌ మెమోరియల్‌’ అని పేరు పెట్టారు.


అదే గ్రామ శివారులో భగత్‌ సింగ్‌ మ్యూజియంను ఆధునికంగా తీర్చిదిద్దారు ఇక్కడ ప్రత్యేకంగా భగత్‌ సింగ్‌ సమాధిని పైన అతని విగ్రహంతో సహా నిర్మించారు. ఇదే ఆవరణలో పెద్ద మ్యూజియంలో స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను సజీవంగా ప్రతిబింబించే ఫొటోలు, అప్పటి పేపర్‌ కటింగ్స్‌, షార్ట్‌ ఫిల్ములు, భగత్‌ సింగ్‌ పూర్వీకుల గృహప్రతీకలు చూడడం గొప్ప స్ఫూర్తినిస్తుంది. అదే రోజు సాయంత్రం అమృత్‌సర్‌ చేరుకొని జలియన్‌ వాలా భాగ్‌, గోల్డెన్‌ టెంపుల్‌ చూశాం. తర్వాత ప్రసిద్ధి చెందిన సిక్కు ప్రార్ధనా మందిరం ‘స్వర్ణ దేవాలయం’కు వెళ్లాం. ప్రశాంతంగా, శుభ్రంగా ఉన్న టెంపుల్‌ పరిసరంలోనే రోజూ లక్షలాది మందికి ఉచితంగా భోజనం (లంగర్‌) అందిస్తారు.


13వ రోజు ఉదయాన్నే 115 కి.మీ. దూరంలో ఫిరోజ్‌ పూర్‌ జిల్లాలో ‘హుస్సేనీ వాలా’ గ్రామం చేరుకున్నాం. భారత్‌- పాక్‌కు ఇది సరిహద్దు గ్రామం. చరిత్రాత్మక భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌, బి.కె. దత్‌ సమాధులు ఇక్కడే ఉన్నాయి. 600 మంది పంజాబ్‌ స్వాతంత్య్ర యోధుల స్మారకంగా ‘నేషనల్‌ మార్టిర్స్‌ మెమోరియల్‌’ను గొప్పగా నిర్మిం చారు. ఇక్కడి నుంచి సత్లుజ్‌ నదిఅవతలి వైపు ఉన్న పాకిస్తాన్‌ గ్రామాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఇదే గ్రామం గుండా అవిభక్త ఇండియాలో భారత్‌ భూభాగం నుంచి పాకిస్తాన్‌కు రైలు మార్గం ఉండేది. ఇప్పటికీ ఇక్కడి వరకు భారత్‌ భూభాగంలో రైలు మార్గం ఉంది. సాయంత్రం ‘అట్టారి బార్డర్‌’లో జరిగే ఫ్లాగ్‌ సెరమనీకి వెళ్ళాము. అట్టారి భారత్‌ వైపు ఉంటుంది. వాఘా పాకిస్తాన్‌ వైపు ఉంటుంది. ఒకప్పుడు దేశ భక్తిని, స్ఫూర్తి నిచ్చే విధంగా ఇక్కడ కార్యక్రమాలు ఉండేవి. ఇప్పుడు డీజే సౌండ్స్‌, ఆధునిక డ్యాన్సులతో కృత్రిమంగా మార్చేశారు. అదే రోజు అమృత్‌ సర్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నాం.

- కె.రవిచందర్‌, 98483 33926

- యం.సువిశారద, 79950 11423


ఈ వార్తలు కూడా చదవండి:

నాలుగు రోజుల పాటు బంగారం ధరల్లో పెరుగుదల.. ప్రస్తుతం రేట్స్ ఇవీ

15 నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News


Updated Date - Aug 09 , 2026 | 10:57 AM