Share News

కమలంలో కాక్రోచ్ కలవరం!

ABN , Publish Date - Aug 09 , 2026 | 02:32 AM

జాతీయ రాజకీయాలలో బాహుబలిగా ఎదిగి, 2029 ఎన్నికల్లో కూడా మెజారిటీ సాధించి నాలుగో పర్యాయం ప్రధానమంత్రిగా కొనసాగాలని తలపోస్తున్న నరేంద్ర మోదీ ప్రభ మసకబారుతోందా? గతంలో రైతులు నెలల తరబడి ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలకు ఏమాత్రం...

కమలంలో కాక్రోచ్ కలవరం!

రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడంలో విజయం సాధిస్తూ వచ్చిన ప్రధాని మోదీ అదే మార్గంలో యువతను కట్టడి చేయలేమని గుర్తించినట్టున్నారు. రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులకు అనేక బలహీనతలు ఉంటాయి. వాటిని ఉపయోగించుకొని వారందరినీ బీజేపీ పెద్దలు కట్టడి చేస్తూ వచ్చారు. ఈ కారణంగానే ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన అనేక గొంతులు మూగబోయాయి. యువత పరిస్థితి వేరు. పోరాడితే పోయేది ఏమీ లేదు- మహా అయితే సంకెళ్లు పోతాయి అన్నట్టుగా యువత ధోరణి ఉంటుంది. బొద్దింకల ఉద్యమంలో అదే కనిపించింది.

ఆరెస్సెస్‌ కూడా గత కొంత కాలంగా కేంద్ర పెద్దల పోకడల పట్ల సంతృప్తిగా లేదన్న ప్రచారం ఉంది. బొద్దింకల ఉద్యమం, ఆ తర్వాత బిహార్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఖాళీ చేసిన అసెంబ్లీ స్థానాన్ని ఉప ఎన్నికల్లో కోల్పోయిన తర్వాత ఆరెస్సెస్‌ పెద్దలు తమ అభిప్రాయాలను బాహాటంగా చెప్పడం మొదలెట్టారు. చర్చకు మరో రూపమే నిరసన అని, ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధమని, సమస్యలను పట్టించుకోకపోతే ఆందోళనలు పుట్టుకొస్తాయని, ఎన్నికల్లో విజయాలే నాయకత్వానికి నిదర్శనం కాదని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు మోదీని దృష్టిలో పెట్టుకొని చేసినవే అన్న అభిప్రాయం ఏర్పడింది.

జంతర్‌ మంతర్‌ ఉద్యమం తర్వాత మోదీ కొంత డల్‌గా కనిపిస్తున్నారు. తాజా పరిణామాలు తొలి ఎదురుదెబ్బగా పేర్కొనవచ్చు. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నుంచి మోదీకి అనూహ్య మద్దతు లభించింది. వారిద్దరూ మోదీని ఆకాశానికెత్తారు. మోతాదుకు మించి ప్రధానిని పొగిడారన్న అభిప్రాయం కూడా ఉంది. మోదీ బలంగా ఉన్నప్పుడు చంద్రబాబు 2019లో ఆయనతో గొడవ పెట్టుకున్నారని, ఇప్పుడు మోదీ బలహీనపడుతున్నప్పుడు అవసరానికి మించి నెత్తిన పెట్టుకుంటున్నారన్న అభిప్రాయం టీడీపీ నాయకుల్లోనే ఉంది.

తాము ప్రెషర్‌ గ్రూపుగా పనిచేస్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ నాయకులు ప్రకటించడం శుభపరిణామం. రాజకీయాల్లో బురద పూసుకొనేవారు ఉంటారు కనుక ఆ బురదను కడిగే వాళ్లూ ఉండాలి. మన దేశంలో అంతో ఇంతో ప్రజాదరణ పొందిన వాళ్లు విజిల్‌ బ్లోయర్‌ పాత్ర ఎంచుకోకుండా రాజకీయాల్లోకి వెళ్లి కనుమరుగవుతున్నారు. అందుకే ఒత్తిడి తీసుకురాగలిగిన ప్రెషర్‌ గ్రూపు అవసరం.

మన దేశంలో ఏ ఒక్క వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయడం లేదు. ఇంకా చెప్పాలంటే వాటిని పనిచేయనివ్వడం లేదు. పై వాళ్ల ఆదేశాలకు అనుగుణంగా వ్యవస్థలు నడుచుకుంటున్నాయి. సీజేపీ రూపంలో ఇప్పుడు మన దేశంలో జవాబుదారీతనం కోసం ప్రారంభమైన ఉద్యమం అలా చల్లబడి పోకూడదని కోరుకుందాం.


జాతీయ రాజకీయాలలో బాహుబలిగా ఎదిగి, 2029 ఎన్నికల్లో కూడా మెజారిటీ సాధించి నాలుగో పర్యాయం ప్రధానమంత్రిగా కొనసాగాలని తలపోస్తున్న నరేంద్ర మోదీ ప్రభ మసకబారుతోందా? గతంలో రైతులు నెలల తరబడి ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలకు ఏమాత్రం చలించని ప్రధాని మోదీ, నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌పై కాక్రోచ్‌ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన ఉద్యమానికి తలొంచారా? ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడమే నాయకత్వానికి నిదర్శనం కాదని ప్రధాని మోదీని దృష్టిలో ఉంచుకొనే ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యానించారా? అని ప్రశ్నించుకుంటే ‘అవును’ అనే సమాధానం వస్తోంది. ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమంలో నిజానికి లక్షల సంఖ్యలో విద్యార్థులు పాల్గొనలేదు. ఆ ఉద్యమంలో పాల్గొన్న వారి సంఖ్య పది వేలకు మించి ఉండదని ఒక అంచనా. అంతకు మించిన సంఖ్యలో రైతులు చేపట్టిన ఉద్యమానికి ప్రధాని మోదీ ఎందుకు దిగి రాలేదు? అంటే కారణం లేకపోలేదు. రైతు ఉద్యమంలో కేవలం పంజాబ్‌, హరియాణాకు చెందిన రైతులే ఎక్కువగా పాల్గొన్నారు. వారి ఉద్యమానికి సంఘీభావంగా ఇతర రాష్ర్టాల రైతులు ఉద్యమ బాట పట్టలేదు. విద్యార్థులు చేపట్టిన ఉద్యమం అలా కాదు. జంతర్‌ మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనల్లో ఎంత మంది పాల్గొన్నారనే దానికంటే... సదరు ఉద్యమానికి మద్దతుగా అనేక రాష్ర్టాలలో, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలలో విద్యార్థులు రోడ్డెక్కడం కీలకం! బహుశా ఈ పరిణామం ప్రధాని మోదీ ఒక మెట్టు దిగి వచ్చేలా చేసి ఉంటుంది. జెన్‌–జీ ఉద్యమాల వల్ల శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌లలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఇప్పుడా దేశాలలో జెన్‌–జీ ప్రభావం కనిపిస్తోందా? అంటే అది వేరే విషయం! మన దేశంలో కూడా జెన్‌–జీ ఉద్యమాలు ప్రభుత్వాలను మార్చగలవా? అంటే ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. అయితే... దేశ ప్రజలలో, ముఖ్యంగా యువతలో అశాంతి, అసహనం నెలకొన్న విషయాన్ని జంతర్‌ మంతర్‌ ఉద్యమం ప్రస్ఫుటం చేసింది. ఈ కారణంగానే క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించిన ప్రధానమంత్రి మోదీ రాజీకి దిగి వచ్చి విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించి ఉంటారు.


ఊహించని విస్తరణ

నిజానికి విద్యార్థుల ఉద్యమాన్ని బీజేపీ పెద్దలు ప్రారంభంలో సీరియస్‌గా తీసుకోలేదు. ఫలితంగా ఉద్యమం విస్తరించింది. నరేంద్ర మోదీ వంటి బలమైన నాయకుడు ఇలాంటి ఉద్యమాలకు తలొగ్గుతారని ఎవరూ ఊహించలేదు. అయితే, రాజకీయ పరిశీలకుల అంచనాలకు భిన్నంగా ప్రధాని మోదీ విద్యార్థుల డిమాండ్లకు ఓకే చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ కూడా మొదటిసారిగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ ఎంపీలు ప్రధాని నివాసం వద్ద గంటల తరబడి ఆందోళన చేశారు. చివరికి వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యాన్‌లలో తరలించవలసి వచ్చింది. ఈ సంఘటనతో రాహుల్‌ గాంధీలో ఫైటర్‌ ఉన్నాడన్న భావన రాజకీయ పరిశీలకులలో ఏర్పడింది. రాజకీయ పార్టీలే కాదు– ఇతర వ్యవస్థలు కూడా కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమాన్ని ప్రారంభంలో సీరియస్‌గా తీసుకోలేదు. అయితే, జంతర్‌ మంతర్‌ వద్ద చోటుచేసుకున్న పరిణామాల తర్వాత ఆయా వ్యవస్థలు, ఆ వ్యవస్థల్లోని ప్రముఖులు గొంతులు సవరించుకున్నారు. ప్రముఖుల స్వరాలు మారాయి అనే దానికంటే ఆయా వ్యవస్థలు ఉలిక్కిపడ్డాయనడం సబబుగా ఉంటుంది. రాజకీయ పార్టీలు, న్యాయ వ్యవస్థతో పాటు మీడియాపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న దాఖలాలు కొంత కాలంగా కనిపిస్తున్నాయి. తమకు జవాబుదారీతనం కావాలని ఈ దేశ యువత, ముఖ్యంగా విద్యార్థులు కోరుకుంటున్నారని ఆయా వ్యవస్థలు మొదటిసారిగా గుర్తించాయి. రాజ్యాంగ పరమైన రక్షణలో ఉన్న న్యాయ వ్యవస్థ కూడా పరిస్థితి తీవ్రతను గుర్తించాల్సి రావడం ముదావహం. విద్యార్థులు రాళ్లు రువ్వినా ప్రభుత్వం బల ప్రయోగం చేయరాదని సుప్రీం కోర్టు సూచించడం ఇటీవలి కాలంలో యువత సాధించిన విజయంగా పేర్కొనవచ్చు. న్యాయ వ్యవస్థ సైతం దిద్దుబాటు చర్యలు చేపట్టిన నేపథ్యంలో రాజకీయమే శ్వాసగా ఎదిగిన ప్రధానమంత్రి మోదీ మాత్రం పరిస్థితులను ఆకళింపు చేసుకోకుండా ఉంటారా? పరిస్థితులు అనువుగా లేనప్పుడు ఒక అడుగు వెనక్కు తగ్గడం ఓటమిని అంగీకరించడం కాదు. అదొక యుద్ధ నీతి! అందుకే విద్యార్థుల విషయంలో ప్రధాని మోదీ వెనక్కు తగ్గారు. ఈ చర్య ద్వారా తన ప్రభుత్వంపై యువతలో వ్యతిరేకత విస్తరించకుండా కట్టడి ప్రయత్నాలకు ఆయన శ్రీకారం చుట్టారని భావించవచ్చు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడంలో విజయం సాధిస్తూ వచ్చిన ప్రధాని మోదీ అదే మార్గంలో యువతను కట్టడి చేయలేమని గుర్తించినట్టున్నారు.


భిన్న అనుభవం...

రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులకు అనేక బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను ఉపయోగించుకొని వారందరినీ బీజేపీ పెద్దలు కట్టడి చేస్తూ వచ్చారు. ఈ కారణంగానే ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన అనేక గొంతులు మూగబోయాయి. అధికారానికి ఎదురొడ్డి పోరాడలేకపోయాయి. యువత, ముఖ్యంగా విద్యార్థుల పరిస్థితి వేరు. పోరాడితే పోయేది ఏమీ లేదు– మహా అయితే సంకెళ్లు పోతాయి అన్నట్టుగా యువత ధోరణి ఉంటుంది. బొద్దింకల రూపంలో జరిగిన ఉద్యమంలో అదే కనిపించింది. ప్రభుత్వాలలో నిరంకుశ పోకడలు పొడసూపినప్పుడు ఏదో ఒక రూపంలో ఆందోళనలు పుట్టుకొస్తాయి. ధిక్కారమును సైతునా అన్నట్టుగా... నిరసనలను సహించబోమని పాలకులు భీష్మించుకుంటే కుదరదు. బీజేపీని వెనకుండి నడిపించే ఆరెస్సెస్‌ కూడా గత కొంత కాలంగా కేంద్ర పెద్దల పోకడల పట్ల సంతృప్తిగా లేదన్న ప్రచారం ఉంది. అయితే, ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తుండటం వల్ల ఆరెస్సెస్‌ పెద్దలు తమ అభిప్రాయాలను లోలోపలే దాచుకున్నారు. బొద్దింకల ఉద్యమం, ఆ తర్వాత బిహార్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఖాళీ చేసిన అసెంబ్లీ స్థానాన్ని ఉప ఎన్నికల్లో కోల్పోయిన తర్వాత ఆరెస్సెస్‌ పెద్దలు తమ అభిప్రాయాలను బాహాటంగా చెప్పడం మొదలెట్టారు. చర్చకు మరో రూపమే నిరసన అని, ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధమని, సమస్యలను పట్టించుకోకపోతే ఆందోళనలు పుట్టుకొస్తాయని, ఎన్నికల్లో విజయాలే నాయకత్వానికి నిదర్శనం కాదని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీని దృష్టిలో పెట్టుకొని చేసినవే అన్న అభిప్రాయం ఏర్పడింది. ప్రస్తుత రాజకీయాలలో బీజేపీ అతి పెద్ద జాతీయ పార్టీ అయితే, ప్రధాని మోదీ– హోం మంత్రి అమిత్‌ షాల చేతుల్లోకి ఆ పార్టీ నాయకత్వం వెళ్లిన తర్వాత అదొక జాతీయ స్థాయి ప్రాంతీయ పార్టీగా మారిపోయిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. నిర్ణయాలన్నీ ఆ ఇరువురి కనుసన్నల్లోనే జరుగుతూ వచ్చాయి. పార్టీలో అప్పటివరకు బలమైన నాయకులుగా చలామణి అయిన వారు సైతం మూగబోయారు. ఆ ఇద్దరికీ తప్ప మిగతా వారెవరికీ పార్టీ నిర్ణయాలతో సంబంధం లేకుండా పోయిందన్న భావన బీజేపీ శ్రేణుల్లో వ్యాపించింది. దీంతో ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉండినట్టుగా బీజేపీలో కూడా వ్యక్తి పూజ మొదలైంది. ఆరెస్సెస్‌ వంటి సంస్థ సైతం మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలలో ముఖ్యమంత్రుల ఎంపికపై కూడా బీజేపీలో అంతర్గతంగా అసంతృప్తి కనిపించింది. అయితే మోదీ–షాలను ఎదిరించే పరిస్థితి లేనందున అసంతృప్తి అక్కడితో ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్‌ మినహా మిగతా ఉత్తరాది రాష్ర్టాలలో బలమైన నాయకులు పక్కకు తప్పుకోవలసిన పరిస్థితులు కల్పించారు.


ఈ కారణంగానే తాజాగా బిహార్‌, మధ్యప్రదేశ్‌లలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. గుజరాత్‌లో కూడా గతంతో పోలిస్తే మెజారిటీ భారీగా తగ్గిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఒకప్పుడు ఇలాగే రాష్ర్టాలలో బలమైన నాయకులను పక్కన పెట్టింది. ఫలితంగా ఆ పార్టీ ఇప్పుడు ఏ స్థితికి చేరిందో చూస్తున్నాం. బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తోందన్న అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో లేకపోలేదు. అయితే మోదీ–షాల వద్ద ఆ మాట చెప్పలేని స్థితి! అంతా ఆ ఇద్దరే చూసుకుంటారులే అన్న భావన పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాక్రోచ్‌ జనతా పార్టీ నేతృత్వంలో జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ఉద్యమం రాజకీయాల్లో కుదుపు తెచ్చింది. బీజేపీలో కూడా అంతర్మథనం మొదలైంది. విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో ప్రధాని మోదీ ఒకింత ఆత్మరక్షణలో పడ్డారు. అయినా ఆయనకు మద్దతుగా సొంత పార్టీ నుంచి ఒక్క గొంతు కూడా వినిపించలేదు. పార్లమెంటు సమావేశాలకు ప్రధాని మోదీ– హోం మంత్రి అమిత్‌ షా రోజుల తరబడి గైర్హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి కదా! హోం మంత్రిని సభకు రావలసిందిగా సూచించండి!’ అని రాజ్యసభ చైర్మన్‌ రాధాకృష్ణన్‌ స్వయంగా కేంద్ర మంత్రిని కోరడాన్ని చూశాం. ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలు ప్రధాని మోదీ నాయకత్వ పటిమకు పరీక్షగా మారాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేని పక్షంలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వం బలహీనపడుతుందన్న అభిప్రాయం బీజేపీ వర్గాలలో ఉంది.

భోగాపురంలో కులాసాగా...

జంతర్‌ మంతర్‌ ఉద్యమం తర్వాత ప్రధాని మోదీ కొంత డల్‌గా కనిపిస్తున్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు తాజా పరిణామాలు తొలి ఎదురుదెబ్బగా పేర్కొనవచ్చు. సొంత పార్టీ నుంచి కూడా ప్రధానికి ఆశించిన స్థాయిలో నైతిక మద్దతు లభించలేదని చెబుతున్నారు. అయితే, ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నుంచి మోదీకి అనూహ్య మద్దతు లభించింది. సదరు వేదికపై నుంచి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రధాని మోదీని ఆకాశానికెత్తారు. వారిరువురూ మోతాదుకు మించి ప్రధానిని పొగిడారన్న అభిప్రాయం కూడా ఉంది. జెన్‌–జీ ఉద్యమం తర్వాత తనకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నుంచి ఈ స్థాయి మద్దతు లభించడంతో ప్రధాని మోదీ ఉబ్బితబ్బిబైనట్టు కనిపిస్తోంది. ఈ కారణంగానే గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రధాని మోదీ వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. భోగాపురం సంఘటన ప్రధాని మోదీకి నైతికంగా కొండంత బలాన్ని ఇవ్వడం ఎంత నిజమో... చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు రాజకీయంగా కొంత నష్టం చేయడం కూడా అంతే నిజం. వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డికి ప్రధాని మోదీ అండగా ఉంటున్నారన్న భావన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో బలంగా ఉంది. ఈ కారణంగానే ప్రధానమంత్రిని అదే పనిగా ముఖ్యమంత్రి పొగడటం ప్రజలకు రుచించడం లేదు. ప్రధాని మోదీ బలంగా ఉన్నప్పుడు చంద్రబాబు 2019లో ఆయనతో గొడవ పెట్టుకున్నారని, ఇప్పుడు మోదీ బలహీనపడుతున్నప్పుడు అవసరానికి మించి నెత్తిన పెట్టుకుంటున్నారన్న అభిప్రాయం తెలుగుదేశం నాయకుల్లోనే ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం కనుక ప్రధాని మోదీతో అంటకాగాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తప్పదని ఆ పార్టీ వర్గాలే వివరిస్తున్నాయి. రాజకీయాలలో ఇవాళ ఉన్న పరిస్థితులు రేపు కొనసాగుతాయని చెప్పలేం. ప్రస్తుతానికి ప్రతికూలంగా మారిన పరిస్థితులను ప్రధాని మోదీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కావలసినంత వ్యవధి ఉంది. 2029 ఎన్నికల తర్వాత కూడా ప్రధానిగా కొనసాగాలని అనుకుంటున్న ఆయన అందుకు తగిన వ్యూహాలను రూపొందించుకోకుండా ఉంటారా? ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించగలిగితే ప్రధాని మోదీ ప్రతిష్ఠ అమాంతం పెరిగిపోతుంది.

2-edi.jpg


‘కాక్రోచ్‌’ భవిష్యత్తు బాట..

ఇకపై తాము ప్రెషర్‌ గ్రూపుగా పనిచేస్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ నాయకులు ప్రకటించడం శుభపరిణామం. రాజకీయాల్లో బురద పూసుకొనేవారు ఉంటారు కనుక ఆ బురదను కడిగే వాళ్లూ ఉండాలి. ఇందుకోసం సీజేపీ ప్రెషర్‌ గ్రూపు పాత్ర పోషించాలనుకోవడం ముదావహం. మన దేశంలో అంతో ఇంతో ప్రజాదరణ పొందిన వాళ్లు విజిల్‌ బ్లోయర్‌ పాత్ర ఎంచుకోకుండా రాజకీయాల్లోకి వెళ్లి కనుమరుగవుతున్నారు. తెలుగునాట జయప్రకాశ్‌ నారాయణ, లక్ష్మీనారాయణ వంటి అధికారులను చూశాం. సీజేపీ నాయకులు అలా కాకుండా విజిల్‌ బ్లోయర్‌ పాత్ర పోషిస్తామని చెప్పడం మంచి పరిణామం. ఇవాళ యువత అన్ని వ్యవస్థల నుంచీ జవాబుదారీతనాన్ని ఆశిస్తోంది. ఇందుకోసం ఒత్తిడి తీసుకురాగలిగిన ప్రెషర్‌ గ్రూపు అవసరం. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో ప్రశ్నపత్రాల లీకేజీలు ఆగిపోతాయని, కఠిన చట్టాలతో అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని ఆశించలేం. నిజానికి ఈ చట్టాలన్నీ రాకముందు దేశంలో నైతిక విలువలు బలంగా ఉండేవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో చట్టాలు బలంగా లేకపోయినా అవినీతి కనీస స్థాయిలోనే ఉండింది. వ్యవస్థలలో జంకూ జవాబుదారీతనం ఉండేవి. కాల క్రమంలో విలువలు పతనమయ్యాయి. అవినీతి ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయింది. చట్టాలు లేనప్పటి రోజులతో పోల్చితే కఠిన చట్టాలు అని మనం చెప్పుకొంటున్న చట్టాలు వచ్చిన తర్వాత అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో జరిగిన ఒక అమానుష సంఘటన తర్వాత నిర్భయ చట్టం తెచ్చుకున్నాం. అంత మాత్రాన ఆడ బిడ్డలపై అత్యాచారాలు ఆగిపోలేదే? అవినీతి నిరోధానికి కూడా అనేక చట్ట సవరణలు వచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వంటి సంస్థలకు కొమ్ములు, కోరలు తగిలించారు. అంత మాత్రాన అవినీతి ఆగిపోయిందా? దేశంలో వివిధ స్థాయిలలో నైతిక విలువలు పతనమయ్యాయి. వాటిని పునరుద్ధరించుకోకుండా కేవలం చట్టాలతో వ్యవస్థలను ప్రక్షాళన చేయాలనుకోవడం నేల విడిచి సాము చేయడమే అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది కొత్త కొత్త చట్టాలు కాదు. వ్యవస్థలలో జవాబుదారీతనం. ప్రస్తుతం మన దేశంలో ఏ ఒక్క వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయడం లేదు. ఇంకా చెప్పాలంటే వాటిని పనిచేయనివ్వడం లేదు. పై వాళ్ల ఆదేశాలకు అనుగుణంగా వ్యవస్థలు నడుచుకుంటున్నాయి.


చట్టాలు, నిబంధనల ప్రకారం పనిచేసుకుపోయే పరిస్థితులు లేకుండా చేసి... ఆ చట్టం తెస్తాం, ఈ చట్టం తెస్తాం అని ప్రకటించడం మనల్ని మనం మోసం చేసుకోవడమే. శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌లలో చోటుచేసుకున్న జెన్‌–జీ ఉద్యమాలు పాల పొంగుగా చల్లారడాన్ని చూశాం. సీజేపీ రూపంలో ఇప్పుడు మన దేశంలో జవాబుదారీతనం కోసం ప్రారంభమైన ఉద్యమం అలా చల్లబడి పోకూడదని కోరుకుందాం. వ్యవస్థలను, అందులోని వ్యక్తులను జవాబుదార్లుగా చేయడం కోసం శాశ్వత ప్రాతిపదికన విజిల్‌ బ్లోయర్‌ పాత్ర పోషిస్తూనే ఉండాలని కోరుకుందాం. తలపైన తట్టెడు అవినీతి కేసులను మోస్తున్న జగన్‌ రెడ్డి వంటి వారు తాము కూడా బొద్దింకలమని చెప్పుకోవడం ప్రస్తుత ఉద్యమాన్ని పలుచన చేసే ప్రయత్నం కాక మరేమిటి? న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం ఉండి ఉంటే జగన్‌ రెడ్డి పైన ఉన్న కేసులు విచారణకు నోచుకోకుండా ఇలాగే సాగుతూ ఉండేవా? ప్రజాప్రతినిధుల కేసులలో ఏడాదిలోగా విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు స్వయంగా పలుమార్లు నిర్దేశించింది. అయినా ఫలితం శూన్యం. ఈ పరిస్థితుల్లో చట్టాల వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతోంది కదా! కింది స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు జవాబుదారీతనం తీసుకోగలిగితే దేశంలో నిరసనలకు, ఆందోళనలకు తావు ఉండదు. జవాబుదారీతనం లేకపోతే పీఠాలు కదులుతాయన్న భయం ఆయా స్థానాల్లో ఉన్న వ్యక్తులకు కలగాలి. ఇదంతా సాఫీగా జరగాలంటే ప్రెషర్‌ గ్రూపు నుంచి ఒత్తిడి పెరగాలి. కాక్రోచ్‌ జనతా పార్టీ ఇందుకోసం కృషి చేస్తుందని, ఆ ప్రయత్నాలు ఫలించాలని కోరుకుందాం!

ఆర్కే

ఇవి కూడా చదవండి..

యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్

డీప్‌ఫేక్‌ వీడియోలపై కేంద్రం కన్నెర్ర.. చర్యలు తీసుకోవాలని మెటాకు అదేశం..

Updated Date - Aug 09 , 2026 | 09:01 AM