డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం కన్నెర్ర.. చర్యలు తీసుకోవాలని మెటాకు అదేశం..
ABN , Publish Date - Aug 08 , 2026 | 03:21 PM
సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ కంటెంట్ వీడియోల వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. డీప్‌ఫేక్ కంటెంట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మెటాను కేంద్రం ఆదేశించింది.
సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ కంటెంట్ వీడియోల వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. డీప్‌ఫేక్ కంటెంట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మెటాను కేంద్రం ఆదేశించింది. సోషల్ మీడియా వేదికల్లో ఉండే కంటెంట్‌కు ఆయా సంస్థలే బాధ్యత వహించాలని పేర్కొంది. అలాగే భారత చట్టాల ప్రకారం మెటా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తోందా లేదా అనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది (Meta deepfakes).
ఇటీవల కేంద్రం, మెటా ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో డీప్‌ఫేక్‌లు, బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్, నకిలీ ఖాతాలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. హానికరమైన కంటెంట్‌ను గుర్తించిన తర్వాత కూడా అది సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఏఐ సాయంతో రూపొందించే నకిలీ వీడియోలు, చిత్రాలు, ఆడియోలు వాటి దుర్వినియోగంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది (Centre Meta action).
ముఖ్యంగా ప్రజలను తప్పుదోవ పట్టించే, వ్యక్తుల ప్రతిష్ఠకు నష్టం కలిగించే లేదా ఇతర హానికరమైన ప్రయోజనాలకు ఉపయోగించే కంటెంట్‌ను అరికట్టాల్సిన అవసరాన్ని మెటాకు కేంద్రం స్పష్టం చేసింది (Deepfake regulation India). ఇక, మెటాతో జరిగిన చర్చల అనంతరం తదుపరి చర్యలు ఏ విధంగా ఉండాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం న్యాయపరమైన అభిప్రాయం కోసం ఎదురుచూస్తోంది. న్యాయ సలహా అందిన తర్వాత మెటాపై తదుపరి చర్యల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫేక్ పనీర్, నెయ్యి, వెన్నపై కొరడా
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ