Share News

రిఫైన్డ్, అల్ట్రా రిఫైన్డ్ పేర్లతో మోసాలు.. రూ.1.93 కోట్ల విలువైన కల్తీ వంటనూనె సీజ్

ABN , Publish Date - Aug 08 , 2026 | 01:37 PM

మహారాష్ట్రలో వంటనూనెల కల్తీపై ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఉక్కుపాదం మోపింది. బీడ్ జిల్లాలో తాజాగా సోదాలు నిర్వహించి రూ.1.93 కోట్ల విలువైన కల్తీ వంట నూనెను సీజ్ చేసింది.

రిఫైన్డ్, అల్ట్రా రిఫైన్డ్ పేర్లతో మోసాలు.. రూ.1.93 కోట్ల విలువైన కల్తీ వంటనూనె సీజ్
Beed FDA raids

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో వంటనూనెల కల్తీపై ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఉక్కుపాదం మోపింది. బీడ్ జిల్లాలో తాజాగా సోదాలు నిర్వహించి రూ.1.93 కోట్ల విలువైన కల్తీ వంట నూనెను సీజ్ చేసింది. మిలియన్ల లీటర్ల నూనెను స్వాధీనం చేసుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లోగల సంస్థల్లో ఈ రెయిడ్స్ నిర్వహించింది. ఇంతటి స్థాయిలో కల్తీ నూనె వెలుగుచూడటం జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.


స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆగస్టు 6,7 తేదీల్లో ఈ రెయిడ్స్ జరిగాయి. మొత్తం 1,18,940 కేజీల కల్తీ నూనెలను స్వాధీనం చేసుకున్నారు. ఒకే నాణ్యత గల నూనెలకు రిఫైన్డ్, అల్ట్రా రిఫైన్డ్ అని రాసున్న ప్యాకెట్లల్లో రీప్యాకేజింగ్ చేసి విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడినట్టు వెలుగులోకి వచ్చింది. పలు సంస్థల్లో అపరిశుభ్రంగా ఉన్న స్టోరేజీ ట్యాంకులు కూడా బయటపడ్డాయి.

స్వాగత్ ఆయిల్, చర్ఖా ఆయిల్ సంస్థల్లో ఈ అవకతవకలు బయటపడ్డాయి. ఇతర సంస్థల్లోనూ ఇలాంటి అక్రమాలను అధికారులు గుర్తించారు. అక్రమాలకు పాల్పడ్డ నాలుగు సంస్థల లైసెన్స్‌ను అధికారులు రద్దు చేశారు. సంస్థలకు సీల్ వేశారు. మొత్తం 26 శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌లకు తరలించారు.


ఈ వార్తలనూ చదవండి:

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫేక్ పనీర్, నెయ్యి, వెన్నపై కొరడా

డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

Updated Date - Aug 08 , 2026 | 03:18 PM