Share News

మనసు చెప్పిందే వింటా!

ABN , Publish Date - Jul 19 , 2026 | 07:54 AM

నలభై ఏళ్లకు పైబడిన వయసు, నాలుగేళ్ల చిన్నారికి తల్లి... అయితేనేం, కథానాయికగా కాజల్‌ అగర్వాల్‌ చరిష్మా ఏమాత్రం తగ్గలేదు.

 మనసు చెప్పిందే వింటా!
Kajal Aggarwal

నలభై ఏళ్లకు పైబడిన వయసు, నాలుగేళ్ల చిన్నారికి తల్లి... అయితేనేం, కథానాయికగా కాజల్‌ అగర్వాల్‌ చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చినా... సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ అగ్రహీరోల సరసన నటిస్తూ దూసుకెళ్తోంది. తాజాగా బాలీవుడ్‌ చిత్రం ‘ది ఇండియన్‌ స్టోరీ’లో అడ్వకేట్‌ అర్చనగా కనిపించనున్న ఈ వెండితెర చందమామ చెబుతున్న తాజా కబుర్లివి...

‘నో’ చెప్పడం ముఖ్యం...

కొన్ని సందర్భాల్లో ‘నో’ చెప్పడం ముఖ్యం. నేను ఒక విషయంలో చాలా క్లియర్‌గా ఉంటా. అవకాశాల కోసం ప్రతీదానికి తలాడించాల్సిన పని లేదు. నేను నా మనసు చెప్పిందే వింటా. ఎంత పెద్ద అవకాశం అయినా... నాకు కంఫర్ట్‌గా లేకపోతే అటువైపే వెళ్లను. అయితే కెరీర్‌ మొదట్లో కొందరు దర్శకులు, నిర్మాతలు క్యారెక్టర్‌కు తగ్గట్టుగా సన్నగా, లావుగా అవ్వమని చెబుతుండేవారు. గత్యంతరం లేక వారి సలహాలు వినేదాన్ని. దాంతో చాలా ఇబ్బందులు పడ్డా. ఇప్పుడైతే కచ్చితంగా ‘నో’ అనేస్తా.


book2.jpgతల్లిగా ఆలోచిస్తున్నా...

పెళ్లయ్యి, ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత... నేను సినిమాలకు ఓకే చెప్పే విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏ కథ విన్నా ఒక తల్లిగా ఆలోచిస్తున్నా. నా కొడుకు నీల్‌ పెద్దయ్యాక నా సినిమాలు చూసి ‘ఇది మా అమ్మ సినిమా’ అంటూ గొప్పగా చెప్పుకోవాలి. అందుకే ప్రతీ స్ర్కిప్ట్‌ ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా. మునుపటిలా కాకుండా పాత్ర పూర్తిగా నచ్చితేనే సైన్‌ చేస్తున్నా.


అదొక విషవలయం...

ఫుడ్‌ పాయిజనింగ్‌లాగే... సోషల్‌ మీడియా అంటే బ్రెయిన్‌ పాయిజనింగ్‌. అదొక విషవలయం. సామాజిక మాధ్యమాల్లో మనం ఇతరుల కంటెంట్‌ చూస్తుంటాం. అందులో సగం కూడా నిజం ఉండదు. చాలావరకు అసత్యాలు... అర్ధసత్యాలే. అసలు మనం ఏం చూస్తున్నాం? ఎంత చెత్తను బుర్రలోకి ఎక్కించుకుంటున్నాం అనేది ఎవరూ ఆలోచించడం లేదు. సోషల్‌ మీడియా కంటెంట్‌ మన బుర్రల్లోకి స్లో పాయిజన్‌లా వెళ్లి పిచ్చివాళ్లని చేస్తోంది. అందుకే సోషల్‌ మీడియాకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిదని నా గట్టి నమ్మకం.


book2.3.jpgఆరోగ్యమే అన్నింటికన్నా ముందు...

నా ఫిట్‌నెస్‌ గురించి చాలామంది అడుగుతుంటారు. నా ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏమిటంటే నేను రోజూ యోగా చేస్తా. వారంలో రెండుసార్లు వెయిట్‌ ట్రెయినింగ్‌ తీసుకుంటా. పూర్తిగా శాకాహారిని. ప్రతీరోజూ తక్కువ మోతాదులో ఐదుసార్లు తింటా. ప్రెగ్నెన్సీ తర్వాత కలరిపయట్టు నేర్చుకున్నా. దానివల్ల శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా తయారయ్యా. నాకు ఆరోగ్యమే ముందు... అన్నీ దాని తర్వాతే.


దీపికాకే నా మద్దతు...

దీపికా పదుకొణే చెప్పినట్టు రోజూ 8 గంటల పని నియమానికి నా మద్దతు తెలుపుతున్నా. అందులో ఎలాంటి తప్పు లేదు. కార్పొరేట్‌ రంగంలో పనివేళలకు నిబంధనలు ఉన్నప్పుడు... సినిమా పరిశ్రమలో ఇలాంటి విషయాల్లో డబుల్‌ స్టాండర్డ్స్‌ ఎందుకు? నేను సినిమాలు సైన్‌ చేసే ముందే కాంట్రాక్ట్‌లో నా కండిషన్స్‌ చెబుతా. ఆదివారం అస్సలు పని చేయను. ఆ రోజు పూర్తి సమయమంతా నా కుటుంబానికే కేటాయిస్తా.


book2.4.jpgమండోదరిగా...

నీల్‌కు చిన్నప్పటి నుంచే రామాయణ కథలు వినడం, రామ్‌లీలా విజువల్స్‌ చూడడం ఇష్టం. నేను ‘రామాయణ’లో మండోదరి పాత్ర చేస్తున్నా అని చెప్పగానే... ఎగిరి గంతేశాడు. ఎందుకంటే రామాయణంలో వాడికి రాముడి కన్నా రావణుడి పాత్రే ఎక్కువ ఇష్టం. ఈ సినిమా రెండో భాగం విడుదలయ్యే సమయానికి నీల్‌కు ఐదేళ్లు వస్తాయి. బహుశా వాడు థియేటర్‌లో చూసే మొదటి సినిమా అదే అవుతుందేమో!


ఈ వార్తలు కూడా చదవండి:

నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను తొలగించాలి

కోట్లు కొల్లగొట్టిన ఆ దంపతులు అదుపులో?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 10:33 AM