ఈటల, బండి మధ్య సయోధ్య భేటీ
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:46 AM
రాష్ట్ర బీజేపీలో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉప్పు, నిప్పులా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సయోధ్య భేటీ జరిగింది.
లక్ష్మణ్ నివాసంలో సమావేశమైన అభయ్ పాటిల్.. కలిసి పని చేయాలని అధిష్ఠానం మాటగా స్పష్టీకరణ
ఎవరితో వ్యక్తిగత విభేదాల్లేవు
కలిసి పని చేయడానికి అభ్యంతరం లేదు: ఈటల
లేనిపోని ఫిర్యాదులు చేసినా బహిరంగంగా స్పందించలేదు
తప్పుంటే చెప్పండి.. సరిదిద్దుకుంటా: సంజయ్
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బీజేపీలో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉప్పు, నిప్పులా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సయోధ్య భేటీ జరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే ఎజెండాగా.. వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి, కలిసి పని చే స్తామని వారు పార్టీ అధినాయకత్వానికి తెలిపారు. వారిద్దరి మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో సఖ్యత కోసం పార్టీ అగ్ర నాయకత్వం ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పాటిల్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నివాసంలో శనివారం సయోధ్య భేటీ నిర్వహించారు. పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. సమావేశం ఆరంభంలోనే అభయ్ పాటిల్ పార్టీ అధినాయకత్వం ఆలోచనను విస్పష్టంగా ఇద్దరు అగ్ర నేతలకు వివరించారు. ‘‘కలిసి పని చేయండి. విభేదాలు వీడండి. పార్టీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఏం చేద్దాం? భాయ్ సాబ్ చెప్పండి’’ అని సంజయ్, ఈటలను ఉద్దేశించి అన్నారు. భవిష్యత్తు కార్యాచరణే ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా తీసుకోవాలని హితవు పలికారు.
విభేదాలను పక్కనబెట్టేందుకు సిద్ధం: ఈటల
‘‘తెలంగాణలో పార్టీని అధికారంలోకి రావాలన్నది కార్యకర్తల కల. ఎన్నో ఏళ్లుగా వారు శ్రమిస్తున్నారు. అందుకు అనుగుణంగా పార్టీని గెలుపు తీరాలకు చేర్చేందుకు సిద్ధంగా ఉన్నా. చిన్న చిన్న విభేదాలను పక్కనబెట్టేందుకు సిద్ధం’’ అని ఈటల తెలిపారు. కలిసి పని చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, తనకు ఎవరి పట్లా వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు. పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమని, ఇందుకోసం ఎంతవరకైనా వెళతానని స్పష్టం చేశారు. సంస్థాగతంగా ఉన్న సమస్యలను పార్టీ పరిష్కరించడం శుభ పరిణామమని తెలిపారు.
పార్టీ ఏం చెబితే అది చేస్తా: సంజయ్
సమావేశంలో ఈటల తర్వాత సంజయ్ మాట్లాడారు. ‘‘నాకు ఎవరిపైనా కోపం లేదు. ద్వేషం అంతకన్నా లేదు. పార్టీని అధికారంలోకి తీసుకురావడం నా కల. క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తా. నన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించినా అధినాయకత్వం మాటను జవదాటలేదు. ఎందుకంటే పార్టీ నాకు తల్లి. నా తల్లి నాకు నేర్పించిన క్రమశిక్షణ, సంస్కారమే నాకు శ్రీరామరక్ష. నేనేంటో.. నా బతుకు, నా పోరాటం, త్యాగాలు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసు. సీఎం పదవి కోసమో, డబ్బు కోసమో ఏనాడూ పాకులాడలేదు’’ అని స్పష్టం చేశారు. తనపై లేని పోని ఫిర్యాదులు చేసినా ఎన్నడూ బహిరంగంగా వాటిపై స్పందించలేదని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కాషాయ జెండా పట్టుకుని కార్యకర్తల కష్టాలను, కన్నీళ్లను చూశానని, పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి వారి కన్నీళ్లు తుడవాలన్న కోరికే తప్ప మరోటి తనకు లేదని స్పష్టం చేశారు. పార్టీ ఏం చెబితే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. తన తరపున తప్పు ఏమైనా ఉంటే చెప్పాలని, సరిదిద్దుకుంటానని వ్యాఖ్యానించారు.
ఈటలతో అభయ్ పాటిల్ భేటీ
శామీర్‌పేటలోని ఈటల నివాసానికి శుక్రవారం రాత్రి అభయ్ పాటిల్ వెళ్లారు. అర్ధరాత్రి వరకూ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించారు. అలాగే, శనివారం ఈటల, సంజయ్‌తో భేటీ తర్వాత ఆయన నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌తో సమావేశమయ్యారు. ఇక, సమావేశం తర్వాత మీడియా సమక్షంలో ఈటలను సంజయ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈటల కూడా అంతే ఆత్మీయంగా సంజయ్‌ని దగ్గరకు తీసుకున్నారు. ఇద్దరు నేతలు నవ్వుతూ ఫొటోలకు పోజు ఇచ్చారు.
మా నేతల మధ్య విభేదాల్లేవ్: ఎంపీ లక్ష్మణ్
తమ పార్టీలోని నేతల మధ్య విభేదాల్లేవని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సంజయ్, ఎంపీ ఈటల మధ్య విభేదాల్లేవని వెల్లడించడానికే లంచ్ భేటీకి ఆహ్వానించినట్లు చెప్పారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్ర పర్యటనలపై చర్చించామని చెప్పారు. ‘‘రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కలిసికట్టుగా పనిచేస్తాం. తెలంగాణలో కూడా జమిలి ఎన్నికలు ఖాయం. ఇక్కడ కూడా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. మహిళా రిజర్వేషన్ అమలవుతుంది. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పరిపాలన కుప్పకూలింది’’ అని విమర్శించారు.