Share News

పెద్ద అంబర్‌పేటలో నకిలీ ఎరువుల తయారీ!

ABN , Publish Date - Jul 19 , 2026 | 06:50 AM

హైదరాబాద్‌ నగర శివారులోని పెద్ద అంబర్‌పేటలో ఓ ఎరువుల కేంద్రంలో నకిలీ ఎరువులను తయారు చేస్తున్నారు. ఎరువుల దుకాణాల ద్వారా వాటిని రైతులకు సరఫరా చేస్తున్నారు.

పెద్ద అంబర్‌పేటలో నకిలీ ఎరువుల తయారీ!

  • త్రిమూర్తి ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో తయారీ కేంద్రం

  • వ్యవసాయ అధికారులు, పోలీసుల దాడిలో వెల్లడి

  • సుమారు 10 వేల నకిలీ ఎరువుల బస్తాల సీజ్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగర శివారులోని పెద్ద అంబర్‌పేటలో ఓ ఎరువుల కేంద్రంలో నకిలీ ఎరువులను తయారు చేస్తున్నారు. ఎరువుల దుకాణాల ద్వారా వాటిని రైతులకు సరఫరా చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ రైతుకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎరువుల తయారీ కేంద్రంపై దాడి చేయడంతో ఈ విషయం వెల్లడైంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘనాథపాలెం గ్రామంలోని ఓ ఎరువుల దుకాణంలో స్థానిక రైతు ఒకరు డీఏపీని కొనుగోలు చేశారు. అయితే అది నకిలీ ఎరువుగా అనుమానం వచ్చిన రైతు సదరు దుకాణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఎరువుల దుకాణంపై దాడి చేసి షాపు నిర్వాహకుడిని విచారించగా.. అతడు నకిలీ ఎరువును విక్రయించినట్లు అంగీకరించాడు. అది ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో తెలిపాడు. ఈ మేరకు గురువారం రాత్రి మఠంపల్లి ఎస్‌ఐ.. తన సిబ్బంది, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల వ్యవసాయ అధికారులు, హయత్‌నగర్‌ పోలీసులతో కలిసి పెద్ద అంబర్‌పేట హరితహారం కాలనీలో త్రిమూర్తి ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో నిర్వహిస్తున్న నకిలీ ఎరువుల కేంద్రంపై దాడి చేశారు. ఈ దాడిలో మ్యారియెట్‌ ఆఫ్‌ పొటా్‌ష(ఎంఓపీ), 17-17-17 పేరుతో తయారు చేసిన నకిలీ ఎరువుల బస్తాలను గుర్తించారు. సుమారు 10 వేల నకిలీ ఎరువుల బస్తాలు ఉన్నట్లు గుర్తించి వాటిని సీజ్‌ చేశారు. ఎరువుల శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు వ్యవసాయ అఽధికారులు తెలిపారు.

Updated Date - Jul 19 , 2026 | 06:50 AM