Share News

శాంతి ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలగినా పట్టించుకోను: ట్రంప్

ABN , Publish Date - Jul 19 , 2026 | 09:22 PM

అమెరికాతో కుదిరిన శాంతి అవగాహన ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలగడంతో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇరాన్ నిర్ణయాన్ని తాను ఏమాత్రం పట్టించుకోనని వ్యాఖ్యానించారు.

శాంతి ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలగినా పట్టించుకోను: ట్రంప్

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య పోరు తారాస్థాయికి చేరుతోంది. అమెరికాతో కుదిరిన శాంతి అవగాహన ఒప్పందం(MoU) నుంచి ఇరాన్ వైదొలగడంతో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇరాన్ నిర్ణయాన్ని తాను ఏమాత్రం పట్టించుకోనని వ్యాఖ్యానించారు. ఓ అమెరికా వార్తా ఛానల్‌ ఇంటర్వ్యూ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. 'శాంతి ఒప్పందం నుంచి ఇరాన్ తప్పుకోవడం గురించి నాకేమాత్రం సంబంధం లేదు. మా ప్రధాన లక్ష్యం ఒక్కటే.. ఇరాన్ అణ్వాయుధాలను నిరోధించడం' అని అన్నారు.


ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) ఇటీవల ఖుజెస్తాన్ ప్రాంతంలోని అహ్వాజ్ నగరంలో ఓ అమెరికా MQ-9 డ్రోన్‌ను అడ్డగించి, ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ MQ డ్రోన్‌ను.. ప్రధానంగా నిఘా, రహస్య సమాచార సేకరణ, లక్ష్యిత దాడుల కోసం ఉపయోగిస్తారని అమెరికా వైమానిక దళం(మానవ రహిత) పేర్కొంటుంది.


కాగా.. జోర్డాన్‌లో జరిగిన దాడిలో అమెరికన్ సైనికులు ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అమెరికా తాజాగా ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ స్థావరాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలపై ప్రతిదాడులు నిర్వహించింది. వరుసగా ఎనిమిదో రోజు ఈ దాడులు కొనసాగుతున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్‌కామ్) వెల్లడించింది.


మరోవైపు.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికాకు ఇటీవల తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఇలాగే దాడులు కొనసాగిస్తే 'మరచిపోలేని గుణపాఠం చెప్తాం' అని వార్నింగ్ ఇచ్చారు. అగ్రరాజ్య అధ్యక్షుడి సంతకానికి ప్రస్తుతం ఎలాంటి విలువ లేదని, ఆ దేశం పదేపదే ఒప్పందాలను ఉల్లంఘించడం వల్లే తాము విశ్వాసం కోల్పోయామని విమర్శించారు.


ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 19 , 2026 | 09:23 PM