ఖమేనీ అంత్యక్రియల్లో హోరెత్తిన ట్రంప్ మరణ శిక్ష నినాదాలు
ABN , Publish Date - Jul 05 , 2026 | 01:58 PM
ఇరాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా ప్రాంతంలో అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఓ కళాకారుడు ట్రంప్‌నకు మరణశిక్ష విధించాలని పిలుపునివ్వడంతో అక్కడి జనం ఆయనకు మద్దతుగా నిలిచారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా ప్రాంతంలో అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా మహమ్మద్ రసూలీ అనే కళాకారుడు ట్రంప్‌నకు మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు. దీంతో అక్కడ భారీగా గుమిగూడిన జనమంతా ఆయనకు మద్దతిస్తూ.. ఒక్కసారిగా అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు.
మహమ్మద్ రసూలీ(కవి) ప్రసంగిస్తుండగా.. 'డెత్ టూ అమెరికా!', 'డెత్ టూ ఇజ్రాయెల్!' అంటూ నినదించారు. అంత్యక్రియల వద్ద జన సమూహాన్ని ఉద్దేశించి రసూలీ మాట్లాడుతూ.. 'ప్రపంచంలోనే అత్యంత నీచుడైన వ్యక్తి(ట్రంప్‌ను ఉద్దేశించి) ఇంకా ఎందుకు బతికి ఉన్నాడు?, ఇకపై ట్రంప్‌నకు ఈ ప్రపంచం ఏమాత్రం మంచి ప్రదేశం కాదు' అని అన్నారు. దీంతో ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు వినిపించాయి. పెద్దఎత్తున గుమిగూడిన జనసందోహం.. తమందరి నోట ఒకే మాట వస్తుందని, అదే 'ప్రతీకారం!.. ప్రతీకారం!' అంటూ సామూహిక నినాదాలతో హోరెత్తించారు.
ట్రంప్ స్పందిస్తూ..
ఖమేనీ అంత్యక్రియల దృశ్యాలపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అంతిమ సంస్కారాలకు జనం పెద్దఎత్తున హాజరుకావడం చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్టు చెప్పారు. 'నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రజలు ఆయన్ను ద్వేషిస్తారని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. అంత్యక్రియల సమయంలో జనం సంతాపం ప్రకటించడం, కన్నీళ్లు కార్చడం చూశా. బహుశా అవి నకిలీ కన్నీళ్లు కావచ్చు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా.. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబసభ్యుల అంత్యక్రియలకు టెహ్రాన్ వ్యాప్తంగా భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 1.5 కోట్ల మంది హాజరుకావచ్చని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేసినట్టు సమాచారం. దీనికోసం మొసల్లా గ్రాండ్ సమీపంలో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటుచేశారు.
ఇవీ చదవండి:
'బాస్ ఎవరో ఆయనకు తెలుసు'.. నెతన్యాహుపై ట్రంప్ వ్యాఖ్యలు
లాహోర్ కేసు.. ఉప ప్రధాని మనవడిపై సంచలన ఆరోపణలు!