లాహోర్ కేసు.. ఉప ప్రధాని మనవడిపై సంచలన ఆరోపణలు!
ABN , Publish Date - Jul 05 , 2026 | 10:15 AM
పాకిస్థాన్ లాహోర్‌లో ఇద్దరు విదేశీ మహిళల కిడ్నాప్, సామూహిక అత్యాచార కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మనవడు రజా దార్ పాత్ర ఉన్నట్టు స్థానిక మీడియా సంస్థలు నివేదించాయి.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ లాహోర్‌లో ఇద్దరు విదేశీ మహిళల కిడ్నాప్, సామూహిక అత్యాచార కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీ ఆస్తుల కోసం ఈ నేరానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇందులో పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మనవడు రజా దార్‌నూ నిందితుడిగా పేర్కొంటూ స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
సీఆర్‌పీసీ సెక్షన్-164 కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితుల్లో ఒకరైన ఆస్ట్రిడ్ గాబ్రియేలా రాబిన్సన్ బ్రాచో.. ఓ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌కు తన వాంగ్మూలాన్ని సమర్పించారు. అందులో.. 'నేను, నా స్నేహితురాలు స్టెఫానీ అడ్రియానా లాహోర్‌కు వచ్చిన కాసేపటికే మేముంటున్న ఇంట్లోకి సాయుధ వ్యక్తులు ప్రవేశించి మమ్మల్ని బంధించారు. క్రిప్టో కరెన్సీ ఆస్తులున్న కంప్యూటర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అది ఎక్కడుందో వారికి చెప్పాను. ఆ తర్వాత డబ్బు, పాస్‌వర్డ్స్ కావాలని రజా దార్ పట్టుబట్టాడు' అని ఆమె పేర్కొన్నారు.
డబ్బు, క్రిప్టో ఆస్తులను అప్పగిస్తేనే తము ప్రాణాలతో విడిచిపెడతామని, లేదంటే చంపేస్తామని రజా దార్(ఇషాక్ దార్ మనవడు) బెదిరించారని ఆస్ట్రిడ్ ఆరోపించారు. ఆ తర్వాత తనపై దాడిచేసి ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని, అదే సమయంలో మరో వ్యక్తి తుపాకీతో కాపలా కాశాడని మేజిస్ట్రేట్ ఎదుట వాపోయారు. రజా దార్ తన మొబైల్ ఫోన్‌తో పలువురికి కాల్ చేసి డబ్బు డిమాండ్ చేయగా, ఆ సమయంలో స్టెఫానీ తల్లి లక్ష డాలర్లు పంపడంతో తమను విడిచిపెట్టారని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో వారి నుంచి తప్పించుకున్నామని ఆస్ట్రిడ్ చెప్పుకొచ్చారు. ఈ కేసులో రజా దార్‌తో పాటు హసన్ రజా, సికందర్ ఖాన్, సాజిద్ అలీ అనే నలుగురిని లాహోర్ కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.
కాగా.. నెదర్లాండ్, వెనెజువెలాకు చెందిన ఈ ఇద్దరు మహిళలు 2025 అక్టోబర్‌లో సింగపూర్‌లో క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్ సందర్భంగా రజా దార్‌కు పరిచయమైనట్టు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత రజా దార్.. వాణిజ్య వీసాపై వారిని తమ దేశానికి ఆహ్వానించడంతో జూన్ 29న లాహోర్‌కు వచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో వారిని కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించి, డబ్బు కోసం నిర్బంధించారనే ఆరోపణలున్నాయి.
ఇవీ చదవండి:
'బాస్ ఎవరో ఆయనకు తెలుసు'.. నెతన్యాహుపై ట్రంప్ వ్యాఖ్యలు
ఇరాన్ చర్చలపై అమెరికా మీడియా కథనం.. 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేసిన ఇజ్రాయెల్