Share News

ఇరాన్‌పై మళ్లీ దాడులకు నెతన్యాహు ఒత్తిడి!

ABN , Publish Date - Nov 13 , 2026 | 09:41 PM

ఇరాన్‌పై మరోసారి దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఒత్తిడి పెంచుతోందా? తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి.

ఇరాన్‌పై మళ్లీ దాడులకు నెతన్యాహు ఒత్తిడి!

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై మరోసారి దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఒత్తిడి పెంచుతోందా? తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు అత్యంత సన్నిహితుడైన మొసాద్‌ చీఫ్‌ రోమన్‌ గోఫ్‌మన్‌ ప్రస్తుతం వాషింగ్టన్‌లో పర్యటిస్తున్నారు. ఇరాన్‌ యుద్ధానికి సంబంధించి ట్రంప్‌ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌తోనూ ఆయన సమావేశమైనట్లు పలు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆక్సియోస్‌ మీడియా సంస్థ వెల్లడించింది. గోఫ్‌మన్ తర్వాత మియామీ వెళ్లి వైట్‌హౌస్‌ ప్రతినిధి స్టీవ్‌ విట్‌కాఫ్‌తోనూ భేటీ కానున్నారని తెలిపింది. ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యలు చేపట్టాలని ట్రంప్‌ను నెతన్యాహు కోరుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇజ్రాయెల్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. గత నెల 27న జరిగిన ఎన్నికల తర్వాత నెతన్యాహు సంకీర్ణ కూటమి పార్లమెంటులో మెజారిటీ కోల్పోయిన విషయం తెలిసిందే.


ట్రంప్‌ విముఖత!

ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించాలని ట్రంప్‌ను నెతన్యాహు కోరుతున్నట్లు సమాచారం. అయితే ఇరాన్‌తో చర్చలకు మరికొంత సమయం ఇవ్వాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈనెల 5న ఇరాన్‌ యుద్ధ పరిణామాలపై ఇరువురు నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నెతన్యాహు మళ్లీ సైనిక చర్యలకు మొగ్గు చూపగా.. దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగించడమే మంచిదని ట్రంప్‌ అభిప్రాయపడ్డారని ఇజ్రాయెల్‌ మీడియా సంస్థ ఎన్‌12 వెల్లడించింది. ఇరాన్‌పై మరోసారి దాడులు చేయడం లేదా చర్చల ద్వారా ఒక ఒప్పందానికి రావడం లేదా నౌకలను దిగ్బంధించి ఆర్థిక ఆంక్షలను కొనసాగించడం వంటి చర్యలు చేపట్టేందుకు ట్రంప్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ట్రంప్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


ఎన్నికలకు ముందే దాడులకు ప్లాన్

ఇజ్రాయెల్‌లో గత నెల 27న జరిగిన ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇరాన్‌పై దాడులకు నెతన్యాహు, గోఫ్‌మన్‌ ప్రణాళిక రూపొందించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ ప్రతిపాదనకు గోఫ్‌మన్ మద్దతు తెలిపినప్పటికీ.. ఇరాన్‌ నుంచి భారీగా ప్రతిదాడులు వచ్చే ప్రమాదం ఉందని, ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని భావించిన పలువురు భద్రతాధికారులు దీనిని వ్యతిరేకించారని ఇజ్రాయెల్‌ చానెల్‌ 12 వెల్లడించింది. అయితే ఆ కథనాన్ని నెతన్యాహు కార్యాలయం ఖండించింది. ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడి చేసే ఆలోచన లేదని ప్రధాని అప్పట్లోనే స్పష్టం చేశారని పేర్కొంది.


ఈ వార్తలూ చదవండి

నాతో చర్చకు వస్తే ప్రధాని పదవిలో మోదీ కొనసాగలేరు.. రాహుల్ గాంధీ సవాల్..

సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్‌-కావ్య వివాహ వేడుక.. ఏమిటా పెళ్లి పద్ధతి..

Updated Date - Nov 13 , 2026 | 09:41 PM