హూతీల ముప్పు.. మక్కాలో మళ్లీ అలర్ట్
ABN , Publish Date - Sep 24 , 2026 | 08:01 PM
యెమెన్ రెబల్ మిలిటెంట్ గ్రూపు హూతీల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సౌదీలో గురువారం మరోసారి అలర్ట్ జారీ అయ్యింది.
ఇంటర్నెట్ డెస్క్: యెమెన్ రెబల్ మిలిటెంట్ గ్రూపు హూతీల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సౌదీలో గురువారం మరోసారి అలర్ట్ జారీ అయ్యింది. మక్కాతో పాటు జెడ్డా, యాన్బు, తబుక్ నగరాల్లో సౌదీ సివిల్ డిఫెన్స్ విభాగం అలర్ట్ జారీ చేసింది. ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.
ప్రజలు ఇళ్లల్లో ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని సూచించారు. అలర్టుల జారీ సమయంలో బయట ఉన్న వారు సమీపంలోని భవనాల్లోకి వెళ్లి తలదాచుకోవాలని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడ వద్దని, సభలు సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు.
అయితే, కొంత సేపటి తరువాత అలర్ట్‌లను ఎత్తేశారు. ముప్పు తప్పిందని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటం వంటివి చేయొద్దని కూడా హెచ్చరించారు. అక్కడి దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియలో షేర్ చేయొద్దని చెప్పారు.
గత వారం కూడా సౌదీలో ఇలాంటి అలర్టులు జారీ అయ్యాయి. హూతీల నుంచి ముప్పు పొంచి ఉందని అప్పట్లో అధికారులు హెచ్చరించారు. ఆ తరువాత రెండో రోజులకు మరో ప్రకటన చేశారు. హూతీలు ప్రయోగించిన మిసైల్స్‌ను మార్గమధ్యంలోనే అడ్డుకున్నామని అన్నారు. అయితే, హూతీలు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తాము మక్కాను టార్గెట్ చేయలేదని అన్నారు.
సముద్రమార్గాల్లో రాకపోకలను వీలు లేకుండా సౌదీని అష్టదిగ్బంధనం చేస్తున్నట్టు జులై 20న హూతీలు ప్రకటించారు. సౌదీకి సంబంధించిన నౌకలు, కేంద్రాలపై మిసైల్ దాడులు పేర్కొన్నారు. 2014 నుంచి యెమెన్ రాజధాని సానా హూతీల ఆధీనంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, సౌదీ అరేబియా మాత్రం అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటోంది.
ఈ వార్తలనూ చదవండి:
పుతిన్‌కు ఆ అవకాశం ఇవ్వొద్దు.. యుద్ధంలో 47 దేశాల వారిని రష్యా వాడుకుంటోంది: జెలెన్‌స్కీ
అమెరికా ఆంక్షలకు సహకరిస్తే మీ విమానాశ్రయాలు పనిచేయవు.. పొరుగు దేశాలకు ఇరాన్ హెచ్చరిక..