పుతిన్‌కు ఆ అవకాశం ఇవ్వొద్దు.. యుద్ధంలో 47 దేశాల వారిని రష్యా వాడుకుంటోంది: జెలెన్‌స్కీ
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:00 PM
భారత్ సహా 47 దేశాల వారిని రష్యా తమపై యుద్ధంలో వాడుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇతర దేశాలను యుద్ధంలోకి లాగేందుకు పుతిన్‌కు అవకాశం ఇవ్వొద్దని కోరారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ సహా 47 దేశాల వారిని రష్యా తమపై యుద్ధంలో వాడుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలను యుద్ధంలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆ అవకాశం ఇవ్వొద్దని ఆయన అభ్యర్థించారు.
వివిధ దేశాల వారు తమకు యుద్ధ రంగంలో చిక్కుతున్నారని జెలెన్‌స్కీ తెలిపారు. ‘ఈ యుద్ధంలో 47 దేశాల వారిని రష్యా వాడుకుంటోందని మాకు తెలుసు. నేపాల్, భారత్, యెమెన్, సుడాన్, దక్షిణాఫ్రికా.. ఇంకా ఎన్నో దేశాల వారు ఉన్నారు. యుద్ధ ఖైదీలను సొంత దేశాలకు పంపించాలని మాకు తరచూ విజ్ఞప్తులు వస్తుంటాయి. యుద్ధ రంగంలోకి వస్తున్న ఇతర దేశాల వారు అక్కడే మరణిస్తున్నారన్న విషయం కూడా మాకు తెలుసు’
‘రష్యన్లు కాని వారు కూడా ఈ యుద్ధం రంగంలో మరణిస్తుండటాన్ని మేము చూస్తున్నాము. మోసాలు, కుట్రల కారణంగా 47 దేశాల వారు రష్యాకు వచ్చి చిక్కుకుపోతున్నారు. మీ ప్రజలతో రష్యా ఏం చేస్తోందో మీకు తెలుసు. వారి జీవితాలను యుద్ధ భూమిలో ముగిసిపోనీయకండి. పుతిన్ మిమ్మల్ని యుద్ధంలో లాగుదామని అనుకుంటున్నారు. ఆ అవకాశం ఇవ్వవద్దు. పుతిన్ ప్రయత్నాలకు, డబ్బుకు, యుద్ధానికి బ్రేకులు వేయండి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయులు పాల్గొంటున్న అంశంపై తాము అత్యున్నత స్థాయిలో రష్యాతో చర్చలు జరుపుతున్నామని విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ గత నెలలో పేర్కొన్నారు. 227 మంది భారతీయులు రష్యా ఆర్మీలో చేరినట్టు తమకు సమాచారం ఉందని చెప్పారు. 139 మంది ఆర్మీ నుంచి బయటకు వచ్చారని, 51 మంది దురదృష్టవశాత్తూ అక్కడే కన్నుమూశారని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికా ఆంక్షలకు సహకరిస్తే మీ విమానాశ్రయాలు పనిచేయవు.. పొరుగు దేశాలకు ఇరాన్ హెచ్చరిక..
ట్రంప్‌నకు కోర్టులో ఎదురుదెబ్బ.. మీడియాపై నిషేధం ఎత్తివేత