Share News

సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్‌-కావ్య వివాహ వేడుక.. ఏమిటా పెళ్లి పద్ధతి..

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:45 PM

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్‌ల వివాహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రీస్‌లో నవంబర్ 11న జరిగిన వీరి పెళ్లి కేవలం సెలబ్రిటీ వేడుకగానే కాకుండా.. ప్రత్యేక వివాహ సంప్రదాయంతోనూ అందరి దృష్టిని ఆకర్షించింది.

సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్‌-కావ్య వివాహ వేడుక.. ఏమిటా పెళ్లి పద్ధతి..
Self-Respect Marriage

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్‌ల వివాహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రీస్‌లో నవంబర్ 11న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమం కేవలం సెలబ్రిటీ వేడుకగానే కాకుండా.. ప్రత్యేక వివాహ సంప్రదాయంతోనూ అందరి దృష్టిని ఆకర్షించింది.


సంప్రదాయ హిందూ వివాహాల్లో ఉండే పురోహితులు, విస్తృతమైన మతపరమైన ఆచారాలకు భిన్నంగా వీరు 'స్వాభిమాన వివాహం' (Self-Respect Marriage) పద్ధతిలో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో అనిరుధ్, కావ్య కేవలం ఒకరికొకరు పూలమాలలు మార్చుకున్నారు. అలాగే ఆత్మగౌరవ వివాహానికి చిహ్నంగా ఒకే రకమైన లాకెట్లను ఒకరి మెడలో మరొకరు ధరింపజేసుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సహా తదితర ప్రముఖులు హాజరయ్యారు. కాగా, వీరి వివాహ పద్ధతిపై ఇప్పుడు నెట్టింట పెద్దఎత్తున చర్చ మొదలైంది.


స్వాభిమాన వివాహం అంటే..?

తమిళనాడులో సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి ప్రారంభించిన స్వాభిమాన ఉద్యమం నుంచి ఈ వివాహ సంప్రదాయం పుట్టుకొచ్చింది. కుల వివక్ష, సామాజిక అసమానతలు, పురుషాధిక్య భావజాలానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం పనిచేసింది. వివాహానికి పురోహితుడు లేదా మతపరమైన ఆచారాలు తప్పనిసరి కాదని, ఇద్దరి పరస్పర అంగీకారం, సమానత్వం, వ్యక్తిగత గౌరవమే ముఖ్యమని ఈ విధానం చెబుతుంది. ఈ పద్ధతిలో వధూవరులు ఒకరికొకరు పూలమాలలు, ఉంగరాలు లేదా పెళ్లికి సంబంధించిన ఇతర చిహ్నాలను మార్చుకోవడం ద్వారా తమ వివాహ బంధాన్ని ప్రకటించుకోవచ్చు. సాక్షుల సమక్షంలో జరిగే ఈ వివాహాలకు తమిళనాడులో 1967లో చట్టబద్ధ గుర్తింపు లభించింది. ఇక అనిరుధ్, కావ్యల వివాహ వేడుకలకు కొనసాగింపుగా నవంబర్ 21న చెన్నైలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మిస్ యూనివర్స్‌ కొత్త కిరీటం అదుర్స్.. ఏకంగా 3,150 వజ్రాలతో..

చమురు నౌకపై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం: కేంద్ర మంత్రి సోనోవాల్

Updated Date - Nov 13 , 2026 | 01:58 PM