ఓఐసీ తీర్మానాలను తీవ్రంగా ఖండించిన భారత్
ABN , Publish Date - Oct 19 , 2026 | 07:25 PM
ఇరాక్‌లోని బాగ్దాద్‌లో జరిగిన ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) విదేశీ మంత్రుల మండలి సమావేశంలో జమ్మూ కశ్మీర్‌పై ఆమోదించిన తీర్మానాన్ని భారత్ తీవ్రంగా తిరస్కరించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాక్‌లోని బాగ్దాద్‌లో జరిగిన ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) విదేశీ మంత్రుల మండలి సమావేశంలో జమ్మూ కశ్మీర్‌పై ఆమోదించిన తీర్మానాన్ని భారత్ తీవ్రంగా తిరస్కరించింది. పాకిస్థాన్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓఐసీ వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. ఐఓసీ సంస్థ ద్వారా చేస్తోన్న ప్రకటనలు దురుద్దేశపూరితంగా, పక్షపాత ధోరణితో, పూర్తిగా అవాస్తవంగా ఉన్నాయని కేంద్ర ఎంఈఏ పేర్కొంది.
భారత అంతర్గత విషయాలపై మాట్లాడే ఎలాంటి అర్హత ఓఐసీకి లేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. జమ్మూ కశ్మీర్, లడఖ్‌లు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని, రాజకీయ ప్రేరేపిత ప్రచారాలతో ఈ వాస్తవాన్ని మార్చలేమని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, పర్యాటకం, కనెక్టివిటీ పెరిగి అపూర్వమైన ఆర్థిక వృద్ధి నమోదవుతోందని గుర్తుచేసింది.
మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (పీవోకే) పాక్ ప్రభుత్వం పౌరులపై అణచివేత ధోరణి అవలంబిస్తోందని ఎంఈఏ వెల్లడించింది. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా హింసకు పాల్పడుతూ ప్రాణాలు తీస్తోందని భారత్ మండిపడింది. మీడియాపై ఆంక్షలు విధించి ఈ అక్రమాలను ఎంత కప్పిపుచ్చాలని చూసినా వాస్తవాలు దాగిపోవని పేర్కొంది. పాకిస్థాన్ తన అక్రమ ఆక్రమణలో ఉన్న భూభాగాలను ఖాళీ చేయడం, సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వకుండా ఉండటమే కశ్మీర్‌కు సంబంధించి ఇక మిగిలిన ఏకైక కర్తవ్యమని భారత్ స్పష్టం చేసింది.
ఈ వార్తలూ చదవండి:
విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు.. 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. బయటకొచ్చిన నిందితుల ఫొటో