రెండు లక్షల మెజారిటీతో రాధా విజయం ఖాయం: ఎంపీ కేశినేని చిన్ని
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:48 PM
విజయవాడ రాజకీయాల్లో కూటమి నేతల ఐక్యతపై మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా స్పష్టతనిచ్చారు. కూటమి నేతలంతా ఒకే టీమ్‌గా పనిచేస్తున్నామని, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని రాధా స్పష్టం చేశారు.
విజయవాడ, అక్టోబర్ 19: విజయవాడలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఎంపీ కేశినేని చిన్ని, వంగవీటి రాధాకృష్ణ, బుద్దా వెంకన్న, పట్టాభి తదితరులు భేటీ అయి.. రాబోయే ఎన్నికల ప్రణాళికపై చర్చించారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాను ప్రకటించడం కూటమి శ్రేణుల్లో అపారమైన ఉత్సాహాన్ని నింపిందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. రాధా సుమారు రెండు లక్షల భారీ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షించారు. రేపటి నుంచి వార్డుల వారీగా తిరిగి కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రచారం చేస్తామని, 100% స్ట్రైక్ రేట్ సాధించేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. కూటమిలో ఎక్కడా రెబల్స్ సమస్య ఉండదని, సీటు ఆశించని వారితో మాట్లాడి సమన్వయం చేసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడుతూ.. కూటమి నేతలంతా ఒకే టీమ్‌గా పనిచేస్తున్నామని, మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామని, ప్రజలు కూటమికి సంపూర్ణ మద్దతునిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా ప్రజానాడీ తెలిసిన నాయకుడు రాధా అని కొనియాడారు. విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాధా భారీ మెజారిటీతో గెలుపొందడం తథ్యమని, ప్రతి కార్యకర్త ఆయన గెలుపు కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత
‘హింస అనేది వాళ్ల డీఎన్ఏలోనే ఉంది’.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
అమలాపురంలో ఉద్రిక్తత.. చలాన్ల వివాదంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట