Share News

టైగర్‌ ష్రాఫ్‌పై హత్యాయత్నం

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:33 AM

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై హత్యాయత్నం జరిగింది. టైగర్‌ ష్రాఫ్‌ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు.

టైగర్‌ ష్రాఫ్‌పై హత్యాయత్నం

  • బాలీవుడ్‌ నటుడు ప్రయాణిస్తున్న కారుపై దుండగుల కాల్పులు

  • టైగర్‌ సురక్షితం, అతని డ్రైవర్‌, మరొకరికి గాయాలు

  • దాడి తమ పనేనని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటన

  • సల్మాన్‌తో పనిచేసిన వాళ్లని వదలబోమని హెచ్చరిక

ముంబై, అక్టోబరు 18 : బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై హత్యాయత్నం జరిగింది. టైగర్‌ ష్రాఫ్‌ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ముంబైలోని జుహు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దాడి నుంచి టైగర్‌ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, టైగర్‌ ష్రాఫ్‌ కారు డ్రైవర్‌, మరో ఆటో డ్రైవర్‌ గాయపడ్డారు. అయితే, ష్రాఫ్‌పై దాడి తమ పనేనని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవ్వగా వివరాలిలా ఉన్నాయి. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ కుమారుడు, యాక్షన్‌ హీరోగా పేరొందిన టైగర్‌ ష్రాఫ్‌.. జుహు పోలీసుస్టేషన్‌ పరిధిలోని పుష్పా పార్కులో ఆదివారం సాయంత్రం ఫుట్‌బాల్‌ ఆడాడు. అనంతరం తన స్నేహితునితో కలిసి కారులో తిరుగు ప్రయాణమైన ష్రాఫ్‌ను చూసేందుకు ఆ పార్కు ద్వారం వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. జనం మధ్యలో నుంచి కారు నెమ్మదిగా కదులుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ష్రాఫ్‌ లక్ష్యంగా కారుపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆపై ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు పరారయ్యారు. ఈ దాడిలో టైగర్‌ ష్రాఫ్‌కు ఎలాంటి గాయాలవ్వలేదు కానీ ఆయన కారు డ్రైవర్‌తోపాటు రోడ్డుపై ఉన్న ఓ ఆటో డ్రైవర్‌ గాయపడ్డారు. దాడి అనంతరం టైగర్‌ ష్రాఫ్‌ డ్రైవింగ్‌ సీటులోకి మారి అదే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.


గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టైగర్‌ ష్రాఫ్‌ సురక్షితంగా ఉన్నారని ఆయన తండ్రి జాకీ ష్రాఫ్‌ కూడా ప్రకటించారు. కాగా దాడి విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులకు పాల్పడిన దుండుగలను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు. మరోపక్క, టైగర్‌పై దాడి తమ పనేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. సల్మాన్‌ ఖాన్‌తో పని చేసిన ఏ ఒక్కరిని విడిచిపెట్టమని, ఏదో ఒక రోజు ప్రతిఒక్కరి వంతు వస్తుందనే అర్థంతో బిష్ణోయ్‌ ముఠాకి చెందిన అనిల్‌ పండిట్‌ ఓ పోస్టు చేశాడు. అయితే, దాడికి పాల్పడింది ఎవరు ? అనే దానిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.

Updated Date - Oct 19 , 2026 | 06:35 AM