విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు.. 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:23 PM
శరన్నవరాత్రుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు, కృష్ణానదీ తీరాన విజయవాడ ఉత్సవ్ వైభవంగా జరుగుతున్నాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మంగళవారంతో ఈ రెండు ఉత్సవాలు ముగింపు ఘట్టానికి చేరుకున్నాయని చెప్పారు.
విజయవాడ, అక్టోబర్19: శరన్నవరాత్రుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు, కృష్ణానదీ తీరాన విజయవాడ ఉత్సవ్ వైభవంగా జరుగుతున్నాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మంగళవారంతో ఈ రెండు ఉత్సవాలు ముగింపు ఘట్టానికి చేరుకుంటాయని చెప్పారు. సోమవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకలు, ఉత్సవాలకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారని వివరించారు.
మంగళవారం ముగింపు ఉత్సవాల సందర్భంగా మరిన్ని హంగులతో కార్నివాల్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది కంటే భిన్నంగా, గొప్పగా ఈ కార్నివాల్ ఉంటుందని వివరించారు. ఈ దసరా సమయంలో వివిధ వేషధారణలు, కళా ప్రదర్శనలు చూస్తుంటామని అన్నారు. అటువంటి వారిని ఓ చోటకు చేర్చి ఈ కార్నివాల్ నిర్వహిస్తున్నామని వివరించారు. దీనికి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు వస్తున్నారని పేర్కొన్నారు.
ఏలూరు రోడ్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద మంగళవారం జరిగే కార్నివాల్‌కు సీఎం చంద్రబాబు హాజరవుతారని చెప్పారు. అమ్మవారి అలంకారాలు, ప్రత్యేకంగా సిద్దం చేసిన రథం, నలభై మంది కళాబృందాలతో ఈ కార్నివాల్ ఉంటుందని తెలిపారు. ఇది ఎస్.ఆర్.ఆర్ కళాశాల నుంచి విశాలాంధ్ర మీదగా ఇందిరాగాంధీ స్టేడియం వరకు సాగుతుందని అన్నారు. బీఎస్ఎన్‌ఎల్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సీఎం చంద్రబాబుతోపాటు ఇతర అతిథులు పాల్గొంటారని పేర్కొన్నారు.
ఇక కళాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అమ్మవారి భక్తులతోపాటు ప్రజలకు ఆహ్వానం పలుకుతున్నామని వివరించారు. పక్క జల్లాల నుంచి కూడా ప్రజలు తరలి వచ్చి ఈ అద్భుతమైన ప్రదర్శనలు తిలకించాలని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విజ్ఞప్తి చేశారు.
విజయవాడ అంటే గుర్తు వచ్చేది కనకదుర్గమ్మ..
గత ఏడాది కంటే ఈ సారి కార్నివాల్ ఇంకా గొప్పగా ఉంటుందని ఏపీ స్టేట్ క్రియేటివిటీ కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ పొడపాటి తేజస్వి తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలను విజయవాడ ఉత్సవ్ మరింత ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు. విజయవాడ అంటే గుర్తు వచ్చేది కనకదుర్గమ్మ అని పేర్కొన్నారు. మనకు ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా ఉన్న కళా ప్రదర్శనలు ఈ విజయవాడ ఉత్సవ్ వేదికపై ప్రదర్శించారని వివరించారు.
ఈ ఉత్సవాలు ముగింపు ఘట్టం మరింత అద్భుతంగా ఉండాలని ఆలోచన చేశారని అన్నారు. మంగళవారం సాయంత్రం రెండు వేల మంది కళాకారులు చేసే ప్రదర్శనలు అందరినీ అలరిస్తాయని పొడపాటి తేజస్వినీ అన్నారు. 38 కళారూపాలు, అమ్మవారి అలంకారాలతో రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్నివాల్‌ను తిలకించేందుకు తరలి రావాలని ప్రజలకు తేజస్వినీ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రైవేట్ టెండర్లతో సంస్థ మనుగడకు ముప్పు: ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ
నేహాబోరాకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు
For More AP News And Telugu News