నేహాబోరాకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు
ABN , Publish Date - Oct 19 , 2026 | 03:19 PM
దేశ రాజధాని పోలీసులు తనకు జారీచేసిన నోటీసులను వెంటనే నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరా. ఈ నోటీసులు వెనక్కి తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.
ఢిల్లీ, అక్టోబర్ 19: ఢిల్లీ పోలీసులు తనకు జారీచేసిన నోటీసులను వెంటనే నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరా. ఈ నోటీసులు వెనక్కి తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యాజ్యంపై తక్షణమే విచారణ చేపట్టాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారామె. పోలీసుల నోటీసులు అస్పష్టంగా ఉన్నాయని ఆమె విమర్శించారు. అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21లను అతిక్రమిస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఏఐఎస్ఏ ఓ ప్రకటన విడుదల చేసింది.
బీఎన్ఎస్ఎస్ చట్టంలోని 126, 130 సెక్షన్ల కింద ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు కావాలని నేహా బోరాను ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. విచారణ సమయంలో శాంతి భద్రతలను కాపాడాలని ఆమెకు పోలీసులు స్పష్టం చేశారు. అందుకోసం వ్యక్తిగత పూచికత్తుతోపాటు రూ.10 వేల బాండ్‌పై సంతకం చేయాలని కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేహా బోరా.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమె తరఫు న్యాయవాదుల బృందం ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మరో వైపు అక్టోబర్ 16న పోలీసుల నిర్భంధం నుంచి నేహా బోరా విడుదలయ్యారని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ తెలిపింది. నాటి నుంచి ఆమెను పోలీసులు మఫ్టీలో అనుసరిస్తున్నారని విమర్శించింది. ఇది పోలీసుల నియమావళిలో భాగమా? లేకపోతే ఆమెను భయపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నమా? అని సందేహం వ్యక్తం చేసింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసనలు జరుగుతున్నాయని.. వాటిని ఆణిచివేయడానికే బోరాకు ఈ నోటీసులు జారీ చేశారని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆరోపించింది. సర్‌కు వ్యతిరేకంగా, సీఈసీ రాజీనామాను డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనల్లో ఢిల్లీ పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163ను పదేపదే ప్రయోగించారని ఏఐఎస్ఏ గుర్తు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
‘ఎవరినీ వదిలిపెట్టం’.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్ వార్నింగ్
తూటాలకు తూటాలే సమాధానం: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
For More National News And Telugu News