‘ఉగ్రవాదాన్ని ఆపకపోతే పరిణామాలు తప్పవు’.. పాక్‌కు భారత్ హెచ్చరిక
ABN , Publish Date - Sep 26 , 2026 | 10:27 AM
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగానికి.. దీటుగా బదులిచ్చింది భారత్.
ఇంటర్నెట్ డెస్క్: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగంలో కశ్మీర్ సహా 2025లో భారత్-పాక్ ఘర్షణ, సింధు జలాల ఒప్పందం తదితర అంశాలను ప్రస్తావించారు. బదులుగా భారత్ తన 'రైట్ టు రిప్లై' ద్వారా దీటుగా స్పందించింది. పాక్ ఉగ్రవాదానికి మద్దతిస్తోందని ఆరోపిస్తూనే.. ఆ పరిస్థితులు అలాగే కొనసాగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
ఈ విషయమై భారత రాయబారి పేటల్ గహ్లోత్ మాట్లాడుతూ.. షెహబాజ్ వ్యాఖ్యలు వింతగా ఉన్నాయన్నారు. ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ప్రశ్నించిన ఆమె.. పగలు భద్రత గురించి మాట్లాడుతూనే, రాత్రివేళ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా అల్‌ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్‌లాడెన్ పాక్‌లోనే ఉన్నారన్న విషయాన్నీ ప్రస్తావించింది భారత్. 9/11 దాడుల సూత్రధారి పాక్‌లోని సైనిక అకాడమీకి సమీపంలో నివసించిన విషయాన్ని గుర్తుచేసింది. 'ఉగ్రవాదంపై మాకు ఆత్మరక్షణ హక్కు ఉంది. దానిని వినియోగిస్తాం. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదం కొనసాగితే పరిణామాలు తప్పవు' అని స్పష్టం చేసింది. 2025లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అంశాన్ని కూడా భారత్ ప్రస్తావించింది. ఉగ్రవాదులకు ఎక్కడా దాక్కునేందుకు అవకాశముండదని గతంలోనే చూపామని చెప్పుకొచ్చింది.
ఐరాసలో తన ప్రసంగంలో షెహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. దక్షిణాసియాలో 2025 తరహా ఘర్షణలు పునరావృతం కాకూడదంటే కశ్మీర్ సమస్యకు న్యాయమైన, సముచితమైన పరిష్కారం అవసరమన్నారు. దీనిపై స్పందించిన భారత్.. జమ్మూకశ్మీర్ భారత్‌లోనే అంతర్భాగమని స్పష్టం చేసింది. పీఓకేలో మానవ హక్కుల పరిస్థితిపై దృష్టి సారించాలని కోరింది. అక్కడి ప్రజలను అడిగితే పాక్ ప్రభుత్వ చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి తెలుస్తాయని భారత ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇక ప్రజాస్వామ్యం, మానవ హక్కులపై మాట్లాడిన భారత్.. పాక్‌లో సైన్యానిదే ప్రధాన పాత్ర అని, ప్రభుత్వాలు మారినా కీలక నిర్ణయాల విషయంలో ఆ ప్రభావం కొనసాగుతోందని ఆరోపించింది. ఆ దేశంలో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరును, అక్కడి దైవదూషణ చట్టాలను కూడా ప్రస్తావించింది.
సింధు జలాల ఒప్పందం అంశం ప్రస్తావనకు రాగా.. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని భారత్ చెప్పింది. సరిహద్దు వెలుపల జరిగే ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఉపసంహరించుకునే వరకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని మరోసారి స్పష్టం చేసింది. పాక్ తన విధానాలను ప్రపంచానికి వేరే విధంగా చూపేందుకు ప్రయత్నిస్తోందన్న భారత్.. తప్పుడు విషయాలను మళ్లీ మళ్లీ చేసినంత మాత్రాన అవి నిజాలుగా మారవని ఘాటుగా బదులిచ్చింది.
ఇవీ చదవండి:
ఒక ఉగ్రవాద దేశం నన్నే ప్రశ్నిస్తోందా.. పాక్ జర్నలిస్ట్‌కు జైశంకర్ ఘాటు రిప్లై
హోర్ముజ్ కాదు.. ట్రంప్ జలసంధి.. పేరు మారుస్తూ అమెరికా అధ్యక్షుడి పోస్ట్