ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
ABN , Publish Date - Oct 14 , 2026 | 07:26 PM
అమెరికాలో పనిచేస్తున్న వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వలసదారులకు సంబంధించి ట్రంప్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ పర్మిట్‌కు సంబంధించి ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్‌ను రద్దు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో పనిచేస్తున్న వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వలసదారులకు సంబంధించి ట్రంప్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ పర్మిట్‌కు సంబంధించి ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్‌ను రద్దు చేసింది. గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నా.. ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్‌ను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఒక ప్రకటన విడుదల చేసింది. బ్లూమ్‌బెర్గ్ లా కథనం ప్రకారం.. గతంలో అర్హులైన వలసదారులు తమ వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత, పాత పర్మిట్ గడువు ముగిసినా మరో 540 రోజుల వరకు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం ఉండేది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ హయాంలో ఈ సదుపాయాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే, ట్రంప్ ప్రభుత్వం నిరుడు ఈ సదుపాయంపై తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్‌ను పూర్తిగా రద్దు చేస్తూ డీహెచ్ఎస్ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
ఎవరెవరిపై ప్రభావం?
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ నిపుణులతో పాటు విదేశీ ఉద్యోగులపైనా ఈ నిర్ణయంతో ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా హెచ్1బీ వీసా ఉన్నవారి జీవిత భాగస్వాములు, వర్క్ పర్మిట్ ఆధారంగా ఉద్యోగం చేస్తున్నవారు, వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసి, ఆమోదం కోసం ఎదురుచూస్తున్న వలసదారులపై ప్రభావం ఉంటుంది. గతంలో అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం రెన్యువల్ దరఖాస్తులను ఆలస్యంగా పరిశీలించినా, అర్హులైన వారికి ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ద్వారా ఉద్యోగం కొనసాగించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సదుపాయం తొలగిపోవడంతో ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఏర్పడవచ్చు.
కొత్త నిబంధన ఎప్పటి నుంచి అమలంటే?
ఈనెల 30 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఆ తేదీన లేదా ఆ తర్వాత వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ వర్తించదు. అంటే, వారి ప్రస్తుత వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ ఆమోదం వచ్చే వరకు ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఆధారంగా ఉద్యోగం కొనసాగించడానికి వీలు ఉండదు. అమెరికాలో వర్క్ పర్మిట్‌పై ఆధారంగా పనిచేస్తున్న భారతీయులు తమ పర్మిట్ గడువు, రెన్యువల్ దరఖాస్తు తేదీలను జాగ్రత్తగా గమనించాలి. వర్క్ పర్మిట్ గడువు ముగిసేలోపు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసినంతమాత్రాన ఉద్యోగం కొనసాగించే హక్కు ఆటోమేటిక్‌గా లభించదు.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి
పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయింది.. దీనికి బాధ్యులెవరు? : రాహుల్ గాంధీ