పోప్ లియోకు క్యాన్సర్.. ఆయన అన్నకు కూడా..
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:24 PM
పోప్ లియో క్యాన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. పోప్‌తో పాటు ఆయన అన్నకూ క్యాన్సర్ సోకినట్లు తేలింది. పోప్ కుడి ఊపిరితిత్తులో ఒక చిన్న కణితిని డాక్టర్లు గుర్తించారు. అడినోకార్సినోమా క్యాన్సర్ బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇంటర్నెట్ డెస్క్: పోప్ లియో క్యాన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. పోప్‌తో పాటు ఆయన అన్నకూ క్యాన్సర్ సోకినట్లు తేలింది. పోప్ కుడి ఊపిరితిత్తులో ఒక చిన్న కణితిని డాక్టర్లు గుర్తించారు. అడినోకార్సినోమా క్యాన్సర్ బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయనకు అత్యవసరంగా చికిత్స నిర్వహించారు. ఈనెల 13న రోమ్ నగరంలోని జెమెల్లి ఆసుపత్రిలో డాక్టర్లు ఆయనకు 90 నిమిషాల పాటు సర్జరీ చేశారు. ప్రస్తుతానికి పోప్ కోలుకున్నారని, ఎలాంటి సమస్యలూ లేవని డాక్టర్లు తెలిపారు. అయితే, పోప్ శరీరంలోని మిగతా భాగాలకూ క్యాన్సర్ సోకిందా లేదా అనేది తెలుసుకునేందుకు ఆయనకు మరిన్ని టెస్టులు చేయాల్సి ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారం పాటు ఆయన ఆసపత్రిలోనే ఉండే అవకాశం ఉంది.
పోప్ అన్నకూ చికిత్స
కాగా.. పోప్ అన్న లూయీ ప్రివోస్త్ కూడా క్యాన్సర్ బారినపడ్డారు. ఆయనకు మల్టిపుల్ మైలోమా అనే క్యాన్సర్ సోకిందని, ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని డాక్టర్లు చెప్పారు. మల్టిపుల్ మైలోమా అంటే ఎముక మూలుగలోని ప్లాస్మా కణాలను దెబ్బతీసే క్యాన్సర్. ఇదిలా ఉండగా.. క్యా్న్సర్ చికిత్స చేయించుకున్న పోప్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆయనకు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం అయిందని తెలిసి ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు. పోప్ ఆయురారోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
క్యాన్సర్ వంశపారంపర్యంగా సంక్రమిస్తుందా?
దాదాపు 5 శాతం నుంచి 10 శాతం క్యాన్సర్లు రోగి నుంచి వచ్చే హానికారక జన్యు మార్పుల వల్ల సంక్రమిస్తాయని యూఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (ఎన్సీఐ) తెలిపింది. మిగతా క్యాన్సర్లు వ్యక్తి జీవితకాలంలో పెంపొందించుకున్న జన్యుపరమైన మార్పులకు సంబంధించినవని ఎన్సీఐ పేర్కొంది. ‘‘క్యాన్సర్ అనేది జన్యుపరమైన వ్యాధి. కణాలు ఎలా పెరుగుతాయి, ఎలా విభజన చెందుతాయి, ఎలా పనిచేస్తాయనే అంశాలపై డీఎన్ఏలో జరిగే మార్పులు ప్రభావం చూపినప్పుడు క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే వయసు పైబడడం, వాతావరణ ప్రభావాలు, కణాలు విడిపోయినపుడు జరిగే లోపాలు వంటి వేర్వేరు కారణాల వల్ల ఈ మార్పులు జరుగుతాయి. వంశపారంపర్యంగా వచ్చిన జన్యుపరమైన మార్పులు (జర్మ్లైన్ వేరియంట్లు) ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఉంటాయి. అవి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తాయి. జర్మ్లైన్ వేరియంట్ల కారణంగా కొన్ని రకాల క్యాన్సర్ల బారినపడే అవకాశం ఉంది. అయితే, జర్మ్లైన్ ఉన్నంతమాత్రాన ఒక వ్యక్తికి కచ్చితంగా క్యాన్సర్ వస్తుందని చెప్పలేం’’ అని ఎన్సీఐ వివరించింది.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి
పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయింది.. దీనికి బాధ్యులెవరు? : రాహుల్ గాంధీ