మందులు లేని వైద్యం.. కదలికల్లోనే ఆరోగ్యం
ABN , Publish Date - Sep 08 , 2026 | 09:29 AM
పక్షవాతం వచ్చిన బాధితుడు కోలుకోవాలన్నా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నడవాలన్నా, మోకాళ్లు, నడుము, మెడ వంటి సమస్యతో బాధపడుతున్నా ఫిజియోథెరపీ చాలా కీలకం.
ఆధునిక జీవన శైలిలో రోగాలబారిన పడకుండా జాగ్రత్త
నేడు వరల్డ్ ఫిజియోథెరపీ డే
హైదరాబాద్ సిటీ: పక్షవాతం వచ్చిన బాధితుడు కోలుకోవాలన్నా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నడవాలన్నా, మోకాళ్లు, నడుము, మెడ వంటి సమస్యతో బాధపడుతున్నా ఫిజియోథెరపీ చాలా కీలకం. వైద్య చికిత్సలు, సర్జరీ, మందులు ఎంత ముఖ్యమో, చికిత్స తర్వాత రోగి సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఫిజియోథెరపీ అంతే ముఖ్యం. గతంలో ఆస్పత్రుల్లో మాత్రమే ఫిజియోథెరపిస్టులు ఉండగా ప్రస్తుతం విస్తృతంగా ఏర్పడిన సెంటర్ల ద్వారా ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ చేసే వెసులుబాటు అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబరు 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం.
శ్రమ లేకపోవడం
మారుతున్న జీవనశైలితో శారీరక శ్రమ తగ్గడం, ఎక్కువసేపు కూర్చోవడం, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలు గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. వీటి నివారణకు క్రమం తప్పకుండా తగిన శారీరక చలనం, వ్యాయామం అవసరం. చాలా మంది వ్యాయమం చేయడానికి సమయం లేక వాయిదా వేస్తుంటారు. వ్యాయామం విషయంలో ఫిజియోథెరపిస్టులు పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు.
వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, వయస్సు, శారీరక సామర్థ్యాన్ని అంచనా వేసి తగిన వ్యాయామ కార్యక్రమం రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తారు. గుండె సంబంధిత వ్యాధులు లేదా శస్త్రచికిత్సల అనంతరం కార్డియాక్ రిహాబిలిటేషన్ ద్వారా శారీరక సామర్థ్యాన్ని క్రమంగా పెంచేందుకు సహాయపడతారు. ఫిజియోథెరపీలో వ్యాయామాలు, కండరాలను బలోపేతం చేసే శిక్షణ, స్ట్రెచింగ్, మాన్యువల్ థెరపీ, భంగిమ, కదలికల శిక్షణ, అవసరాన్ని బట్టి వేడి, చల్లని చికిత్స ఇతర ఫిజికల్ థెరపీ పద్ధతులున్నాయి.
ఫిజియోథెరపీ నొప్పి నివారణకే కాదు
ఫిజియోథెరపీ అంటే శరీర కదలికలు, కండరాల బలం, నొప్పి, శారీరక పనితీరును మెరుగుపరచడానికి చేసే చికిత్స.గా భావిస్తుంటాం. కానీ ఇది వ్యాధి నివారణ, ఆరోగ్య ప్రోత్సాహం, పునరావాసం, స్వతంత్ర జీవనానికి తోడ్పడే సమగ్ర ఆరోగ్య సేవగా మారింది. ఆరోగ్యంగా ఉండడం, గుండె, మెదడు, శరీర భాగాలకు కొత్త శక్తిని ఇవ్వడానికి ఫిజియో థెరపీ చాలా ముఖ్యం.
జి.నరేంద్రరెడ్డి, సీనియర్ ఫిజియోథెరపిస్టు, అపోలో ఆస్పత్రి
ఈ వార్తలు కూడా చదవండి:
ఒకటే కార్డు.. మెట్రో, బస్సుల్లో రయ్ రయ్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News