శాంసంగ్ కీలక నిర్ణయం.. భారత్‌లో లేఆఫ్స్
ABN , Publish Date - Sep 08 , 2026 | 09:02 AM
శాంసంగ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. టీవీలు, ఇతర గృహోపకరణాలకు డిమాండ్ తగ్గుతుండటంతో పాటు ఖర్చులు కూడా పెరగడంతో ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: శాంసంగ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. టీవీలు, ఇతర గృహోపకరణాలకు డిమాండ్ తగ్గుతుండటంతో పాటు ఖర్చులు కూడా పెరగడంతో ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. భారత్‌లో కార్యకలాపాలను పునర్ వ్యవస్థీకరించే దిశగా ఇప్పటికే దాదాపు 100 మందిని తొలగించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డైరెక్టర్ స్థాయి అధికారులు మొదలు ప్రధాన కార్యాలయంలోని టీమ్ లీడర్లపై తొలగింపుల ప్రభావం ఉన్నట్టు సమాచారం. బ్రాంచ్, ఏరియా మేనేజర్లు కూడా లేఆఫ్స్‌కు గురైనట్టు తెలుస్తోంది. మెమరీ చిప్‌ల ధరల పెరుగుదల, రూపాయి బలహీనంగా ఉండటం, ముడి సరకు ధరలు పెరగడం వంటివి శాంసంగ్ ఇండియా అమ్మకాలు, మార్జిన్లపై ప్రభావం చూపినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
టీవీలు, ఇతర గృహోపకరణాల విభాగానికే ప్రస్తుత తొలగింపులు పరిమితమయ్యాయి. అయితే, లేఆఫ్ విస్తృతి మరింత ఎక్కువగా ఉండవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. శాంసంగ్ సేల్స్, మార్కెటింగ్ విభాగంలోని 25 శాతం మంది సిబ్బందిపై లేఆఫ్స్ ప్రభావం ఉండే అవకాశం ఉందని సమాచారం. రోజూ కొందరికి టర్మినేషన్ లెటర్లు అందుతున్నాయని లేఆఫ్స్‌కు గురైన వ్యక్తి ఒకరు చెప్పటినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నోటీస్ పీరియడ్ అవసరం లేకుండానే పంపించేస్తున్నారని సదరు వ్యక్తి చెప్పినట్టు తెలుస్తోంది. ఇక తొలగింపునకు గురైన వారికి మూడు నెలల శాలరీ ఇవ్వడంతో పాటు సంస్థలో పని చేసిన ప్రతి సంవత్సర కాలానికి గాను ఒక నెల జీతం అదనంగా కూడా పరిహారంగా ఇచ్చినట్టు కథనాలు వెలువడ్డాయి.
ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో కూడా డిమాండ్ తగ్గినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్ అమ్మకాలు 12 శాతం మేర తగ్గాయని చెప్పాయి. ప్రస్తుతం భారత్‌లో శాంసంగ్ ఆదాయంలో దాదాపు 75 శాతం స్మార్ట్ ఫోన్ అమ్మకాల ద్వారా వస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలోని సిబ్బందికి ప్రస్తుతానికి లేఆఫ్స్ ముప్పు తప్పింది. అయితే, దీపావాళి తరువాత మరిన్ని లేఆఫ్స్ ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో రేట్స్ ఎలా ఉన్నాయంటే..