213 అడుగుల నుంచి కారుతో బంజీ జంప్..
ABN , Publish Date - Sep 08 , 2026 | 07:58 AM
2024లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగర శివార్లలో నిస్సాన్ ఫ్రాన్స్ సంస్థ 'కాష్కాయ్ ఈ-పవర్' మోడల్ కారుతో 65 మీటర్ల ఎత్తు నుంచి బంజీ జంప్ నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తాజాగా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. కారుతో బంజీ జంప్ చేస్తున్న వీడియో అది. 2024లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగర శివార్లలో నిస్సాన్ ఫ్రాన్స్ సంస్థ 'కాష్కాయ్ ఈ-పవర్' మోడల్ కారుతో 65 మీటర్ల ఎత్తు నుంచి బంజీ జంప్ నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆ డేర్ డెవిల్ పని కోసం ఫ్రెంచ్ ప్రొఫెషనల్ రేస్ డ్రైవర్ లారెంట్ లాస్కో రంగంలోకి దిగారు. ఏమాత్రం భయపడకుండా కారులో ఉండి బంజీ జంప్ చేశారు.
ఆ స్టంట్ చేయటం కోసం కొన్ని నెలల పాటు నిస్సాన్ కంపెనీ, లారెంట్ టీమ్ కష్టపడ్డారు. ఇందుకోసం అత్యంత కచ్చితమైన భద్రతా ప్రమాణాలను పాటించారు. ఏకంగా ఆరు తాళ్లను బంజీ జంప్ కోసం వినియోగించారు. క్రేన్ సాయంతో లారెంట్ ఎంతో నేర్పుతో కారుతో పాటు కిందకు దూకారు. స్టంట్ విజయవంతంగా పూర్తయింది. గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం అయింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘స్టంట్ అద్భుతంగా ఉంది’..‘కారులో డ్రైవర్ పనేంటి? నాకు అర్థం కావటం లేదు’..‘అయ్యో.. నా కాళ్లు, చేతులు వణుకుతున్నాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఒకటే కార్డు.. మెట్రో, బస్సుల్లో రయ్ రయ్!
కాకినాడ జిల్లాలో వైసీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సీనియర్లు