Share News

ఊరూరా జ్వరం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రబలిన సీజనల్‌ వ్యాధులు

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:54 PM

ఉమ్మడి అనంతపురం జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఏ ఇంటిలో చూసినా తల, ఒళ్లు నొప్పులు, జ్వరాలతో బాధపడేవారు కనిపిస్తున్నారు.

ఊరూరా జ్వరం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రబలిన సీజనల్‌ వ్యాధులు
Viral Fevers, Anantapur

  • ఏ ఇంట చూసినా జ్వర పీడితులే

  • తల, ఒళ్లు నొప్పులతో విలవిల

  • రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఏ ఇంటిలో చూసినా తల, ఒళ్లు నొప్పులు, జ్వరాలతో బాధపడేవారు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటికిటలాడుతున్నాయి.


వాతావరణం ఎఫెక్ట్‌

కొన్ని వారాలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వింత వాతావరణ నెలకొంది. ఒకవైపు ఆకాశం మబ్బుపట్టి చిరుజల్లులు కురుస్తుంటే, మరోవైపు గాలిలో తేమ శాతం పెరిగి ఉక్కపోత వేధిస్తోంది. ఈ వాతావరణ మార్పుల వల్ల మానవ శరీరంలో రోగనిరోధక శక్తి క్షీణించి వైర్‌సలు వేగంగా దాడి చేస్తున్నాయి. నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరిగి డెంగీ, చికున్‌ గున్యా వ్యాప్తికి కారణమౌతున్నాయి. తాగునీరు కలుషితమై టైఫాయిడ్‌ వంటి రోగాలను కలిగిస్తున్నాయి.


viral1.2.jpgఈ నేపథ్యంలో ప్రజలు తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, ఎంతకు తగ్గని తలనొప్పి, ముక్కు కారడం, పొడిదగ్గు, జ్వరంతో కనీసం ఇంటికొకరు చొప్పున బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇదే సమస్యతో డాక్టర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ కనీసం ఇద్దరు, ముగ్గురు జ్వరం బారిన పడుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. పట్టణాల నుంచి నగరం వరకూ ఇదే పరిస్థితి నెలకొందని వైద్యవర్గాలు విశ్లేషిస్తున్నాయి.


పడిగాపులు

‘జ్వరవేడితో ఒళ్లు కాలిపోతోంది. విపరీతమైన నొప్పులతో మనసు కుదటలేకుంది. నీరసించిన నిస్సత్తువతో కూర్చోలేకపోతున్నాం. అయినా పేరు మోసిన డాక్టర్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది’ అని పలువురు బాధితులు వాపోతున్నారు. సమీపంలోని ఆర్‌ఎంపీల వద్దకు వెళ్తే మూడు రోజులు మందులు రాసిస్తున్నారు. తగ్గలేదని మరోసారి సంప్రదిస్తే సెలైన్‌ బాటిల్‌ పెడుతున్నారు. దీంతో పేరు మోసిన డాక్టర్లు, ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోందని రోగులు పేర్కొంటున్నారు. అక్కడ భారీ సంఖ్యలో ఉన్న రోగులతో తమ వంతు కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు.


viral1.jpgఅప్పులు చేసి చికిత్స

సీజనల్‌ వ్యాధుల ప్రబలడం ప్రైవేట్‌ ఆస్పత్రులకు కలిసి వస్తోంది. ఓపీ చూడటానికి రూ.300 నుంచి రూ.500. రక్త పరీక్షలకు రూ.2వేల నుంచి రూ.5వేలు. మందులు, టానిక్‌లకు రూ.1500 నుంచి రూ.3వేలు. ఇలా ఒకసారి డాక్టర్‌తో చూపించుకోవాలంటే కనీసం రూ.5వేలు ఖర్చు అవుతోందని బాధితులు వాపోతున్నారు. కొందరు ప్రైవేట్‌ డాక్టర్లు అనవసర భయాలు కల్పించి ఆస్పత్రిలో అడ్మిట్‌ కావాలని చెబుతున్నారు. ఆస్పత్రిలో చేరితే ఐదారు రోజులకే రూ.50వేల దాకా బిల్లు వేస్తున్నారు. రోజు కూలికి వెళ్తే వచ్చేది రూ.500. అయితే ప్రాణభయంతో అప్పులు చేసి ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.


నివారణ చర్యలేవీ?

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ, మున్సిపల్‌ శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన సమన్వయంతో పనిచేసి సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై పనిచేయాల్సి ఉంది. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో డెంగీకి సంబంధించి ఎలీసా పరీక్షలు, ప్లేట్లెట్‌ కౌంట్‌ పరీక్షలు వేగంగా అందేలా అధికారులు చొరవచూపాలి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ మురికివాడల్లో ప్రతిరోజూ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి మందులు పంపిణీ చేయాలి. ప్రతి వీధిలోనూ దోమల నివారణకు క్రమం తప్పకుండా ఫాగింగ్‌ చేయించాలి. నిల్వ ఉన్న నీటిపై మలాథియాన్‌ ఆయిల్‌ పిచికారీ చేయించాలి. ఇలాంటి ముందస్తు నివారణ చర్యలు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.


ప్రభుత్వ డాక్టర్‌ను సంప్రదించాలి

ఇళ్ల పరిసరాలలో కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, పూల కుండీలలో నీరు నిల్వ ఉండకుండా ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటించాలి. వైరల్‌ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండటానికి కాచి వడపోసిన గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి. రాత్రి వేళల్లో దోమతెరలు వాడటం, శరీరం పూర్తిగా కప్పబడే దస్తులు ధరించడం శ్రేయస్కరం. జ్వరం రాగానే ఆర్‌ఎంపీల దగ్గరకు వెళ్లడం, మెడికల్‌ షాపుల్లో సొంతంగా యాంటీబయాటిక్స్‌ కొనివాడటం ప్రమాదకరం. తక్షణమే ప్రభుత్వ డాక్టర్‌ను సంప్రదించాలి.

  • డాక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి


ఈ వార్తలు కూడా చదవండి:

విజయవాడలో విషాదం.. హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య

కర్నూలు బస్సు ప్రమాదం కేసు.. జిల్లా ఎస్పీకి ఎన్‌హెచ్‌‌ఆర్‌సీ నోటీసులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 12:54 PM