ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లు ప్రజల ప్రయోజనాలకు హానికరం: ఎంపీ శశిథరూర్
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:30 AM
విదేశీ నిధుల నియంత్రాణ చట్ట సవరణ-2026 బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కొత్త బిల్లు పౌర సమాజంపై ప్రభుత్వ నియంత్రణను మరింత పెంచేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో విదేశీ నిధుల అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు, పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశీ నిధుల నియంత్రాణ చట్టం(FCRA ) సవరణ-2026 బిల్లును తీసుకువచ్చింది. దీనిద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న విదేశీ విరాళాల నియంత్రణ చట్టం మరింత కఠినతరం కానుంది. ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు-2026పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఈ కొత్త బిల్లు దేశంలోని పౌర సమాజంపై ప్రభుత్వ నియంత్రణను మరింత పెంచేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలు.. స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలను సమాజంలో అభివృద్ధి భాగస్వాములుగా కాకుండా, విదేశీ ప్రమేయాలుగా చూపేలా ఉన్నాయని శశిథరూర్ ఆరోపించారు. 'ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ రద్దైనా, గడువు ముగిసినా లేదా సరెండర్ చేసినా.. ఆ సంస్థలకు చెందిన విదేశీ విరాళాలు, ఆస్తుల నిర్వహణను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకునేందుకు ఈ కొత్త బిల్లు వీలు కల్పిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక 'అధికార యంత్రాంగం' ఏర్పాటుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఈ నిబంధన ద్వారా పాలనా పరమైన నిర్ణయాలతోనే స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులు, విద్యాసంస్థలు, భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉంది' అని థరూర్ ఆరోపించారు.
కేరళలో పలు ఛారిటబుల్ ట్రస్ట్‌లు, పాఠశాలలు, ఆస్పత్రులు గత శతాబ్ద కాలంగా కులమతాలకు అతీతంగా పేదలకు వైద్య, విద్యా సేవలు అందిస్తున్నాయని థరూర్ గుర్తుచేశారు. ఈ సంస్థలు స్థానిక విరాళాలతో పాటు విదేశీ నిధుల ద్వారా ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చుకుంటూ పేదలకు అండగా నిలుస్తున్నాయని చెప్పారు. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల పేరుతో ఈ సంస్థలను వేధించడం, ఆస్తులను జప్తు చేయడం వల్ల చివరికి నష్టపోయేది సామాన్య ప్రజలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే కఠినమైన నిబంధనల వల్ల విదేశీ నిధులు 87 శాతం మేర తగ్గిపోయి వేలాది సేవా సంస్థలు మూతపడ్డాయని, ఇప్పుడు తెస్తున్న ఈ కొత్త బిల్లు వాటిని శాశ్వతంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని థరూర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యల వల్ల కోట్లాది మంది పేదలకు అందుతున్న వైద్య, విద్య సేవలు నిలిచిపోతాయని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్ వాసి బలవన్మరణం
ఏపీ కేబినెట్ ముందుకు 30కి పైగా అజెండా అంశాలు..