వైభవ్.. సచిన్ కంటే ఎక్కువ ప్రభావం చూపుతాడు: రాబిన్ ఉతప్ప
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:05 AM
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ కంటే కూడా వైభవ్ ఎక్కువ ప్రభావం చూపగలడని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన అద్భుతమైన బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాక అతిపిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసి.. ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో అతడిపై తరచూ మాజీ క్రికెటర్ పలు వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఈ చిచ్చర పిడుగుపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ వైట్ బాల్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ కంటే కూడా వైభవ్ మరింత పెద్ద ముద్ర వేయగలడని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ అంశం రాబోయే కొన్నేళ్లపాటు అతడు ఎలా ఆడుతాడు అనే దానిపై ఆధారపడి ఉందని పేర్కొన్నాడు.
ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉతప్ప మాట్లాడుతూ.. వైభవ్‌లో అసాధారణ ప్రతిభ ఉందని, అయితే ఆ ఒక్కటే సరిపోదని స్పష్టం చేశాడు. గతంలో వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా వంటి ఎంతోమంది యువ ఆటగాళ్లు అద్భుతమైన ఆరంభాలను దక్కించుకున్నప్పటికీ, ఆ తర్వాత సరైన మార్గదర్శకత్వం లేక కనుమరుగయ్యారని గుర్తుచేశాడు. వైభవ్ విషయంలోనూ అదే పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు.
వైభవ్‌కు రానున్న రోజుల్లో అసలైన పరీక్ష ఎదురుకానుందని ఉతప్ప పేర్కొన్నాడు. ప్రస్తుతం 15 ఏళ్ల ఈ కుర్రాడు.. తనలో ఉన్న దూకుడు, ఫామ్‌ను మరో ఐదేళ్ల పాటు అలాగే కాపాడుకోగలడా అనేది చూడాలన్నాడు. ప్రస్తుతం వైభవ్ డబ్బు కోసం ఎలాంటి వాణిజ్య ప్రకటనలకు వెళ్లకుండా పూర్తిగా క్రికెట్ మీదే దృష్టి పెట్టడం అభినందనీయమని ఉతప్ప ప్రశంసించాడు. భవిష్యత్తులో కీర్తి ప్రతిష్ఠలు, ఇతరత్రా వ్యాపకాలు, ఆకర్షణలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని, ఆ సమయంలో సరైన మార్గదర్శకం చేసే తోడు అతనికి ఉండాలని అభిప్రాయపడ్డాడు. వైభవ్ ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడంలో సరైన కోచ్‌లు, మెంటార్లు కీలక పాత్ర పోషించాలని తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే
ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ