Share News

సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:13 PM

టెస్టు క్రికెట్ జట్టులో యువ ఆటగాళ్ల కంటే సీనియర్‌ ప్లేయర్లు ఎక్కువ మంది ఉండాలని టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ పూర్వ వైభవం పొందాలంటే ప్రస్తుతం ఉన్న సీనియర్‌ ఆటగాళ్లను జట్టులో కొనసాగించాలన్నాడు.

సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే
Ajinkya Rahane

స్పోర్ట్ డెస్క్: ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్య రహానే.. తాను ఆడే రోజుల్లో మాటలతో పెద్దగా రచ్చ చేయలేదు. కానీ, క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తొలిసారిగా టెస్ట్ క్రికెట్‌లో భారత్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. టెస్టు క్రికెట్ జట్టులో యువ ఆటగాళ్ల కంటే సీనియర్ ప్లేయర్లు ఎక్కువ మంది ఉంటే మంచిదని రహానే అభిప్రాయపడ్డాడు.


ఓ పాడ్‌కాస్ట్‌లో రహానే మాట్లాడుతూ.. ' టెస్టు ఫార్మాట్‌లో భారత్‌కు పూర్వ వైభవం రావాలంటే.. ప్రస్తుతం ఉన్న సీనియర్ ఆటగాళ్లను జట్టులోనే కొనసాగించాలి. సీనియర్లు ఒకేసారి ఆటకు దూరమవుతుండటం టీమిండియాకు సమస్యగా మారింది. గత రెండేళ్లుగా నేను టెస్టు క్రికెట్ ఆడకపోవడంతో ఇంట్లోనే కూర్చొని మ్యాచ్‌లు వీక్షించా. టీమిండియా స్వదేశంలో కూడా మ్యాచ్‌లు ఓడిపోవడం చూశా. టెస్టు క్రికెట్ ఆడాలంటే పట్టుదల, నిబద్ధత ఉండాలి. ఈ రెండిటిని భారత్ ప్లేయర్లు పెంపొందించుకుని పోటీ తత్వంతో కూడిన ఆటను ప్రదర్శించాలి' అని రహానే పేర్కొన్నాడు.


'గత రెండేళ్లలో భారత టెస్టు జట్టులోకి కొత్త ఆటగాళ్లు వచ్చారు. వారి విషయం పక్కన పెడితే.. టెస్టు జట్టులో 7-8 మంది సీనియర్లు, ఇద్దరు లేదా ముగ్గురు యువ ఆటగాళ్లు ఉంటే మంచిదని నా అభిప్రాయం. కానీ, ప్రస్తుత జట్టును చూస్తే.. అలా లేదు.. కొత్త వాళ్లతో నిండిపోతోంది. దాదాపు సీనియర్ ప్లేయర్లంతా రిటైర్ అయ్యారు. ఇప్పటికైనా జట్టులో ఉన్న మిగిలిన సీనియర్ ఆటగాళ్లను గౌరవించడం, వారిని కాపాడుకోవడం చాలా అవసరం' అని రహానే పరోక్షంగా హెడ్‌కోచ్ గంభీర్‌కు సందేశం ఇచ్చాడు.


గతేడాది రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా వంటి సీనియర్ ఆటగాళ్లు వివిధ ఫార్మట్లలో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా రహానే కూడా రిటైర్‌మెంట్ ప్రకటించడంతో జట్టులో సీనియర్ల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం భారత జట్టులో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే 50 కంటే ఎక్కువ టెస్టులు ఆడారు.


ఇవి కూడా చదవండి:

ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ

సౌతాఫ్రికా టీ20 లీగ్: కీరన్‌ పొలార్డ్‌‌ను పక్కన పెట్టిన ఎంఐ

Updated Date - Aug 05 , 2026 | 05:59 PM