ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ
ABN , Publish Date - Aug 05 , 2026 | 04:00 PM
కొన్నేళ్లుగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులపై ఎట్టకేలకు స్పందించాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ. బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో డేటింగ్‌లో ఉన్నట్లు వచ్చిన పుకార్లపై స్పష్టతనిచ్చాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ, తన వ్యక్తిగత జీవితంపై కొన్నేళ్లుగా వస్తున్న వదంతులపై ఎట్టకేలకు స్పందించాడు. బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహా యజమాని ప్రీతి జింటాతో డేటింగ్‌లో ఉన్నట్లు వచ్చిన పుకార్లపై అతడు స్పష్టతనిచ్చాడు.
ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008)లో బ్రెట్ లీ పంజాబ్ జట్టు తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రీతి జింటా, బ్రెట్ లీ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ అనేక వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనిపై ఏళ్లపాటు మౌనంగా ఉన్న బ్రెట్ లీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చాడు.
'నేను ఏ రోజు కూడా ఏ బాలీవుడ్ నటితోనూ డేటింగ్ చేయలేదు. ప్రీతి జింటాతో నాకు ఎలాంటి రొమాంటిక్ సంబంధం లేదు. మేమిద్దరం అప్పట్లోనూ, ఇప్పటికీ మంచి స్నేహితులమే. ఆమె ఆనాడు మా పంజాబ్ జట్టుకు ఓనర్‌గా వ్యవహరించారు. ప్రీతి జింటా ఎంతో తెలివైన వ్యక్తి.. ఆమెపై నాకు ఎంతో గౌరవం ఉంది. మా ఇద్దరి మధ్య స్నేహబంధం తప్పా.. ఏ ఇతర బంధం లేదు' అని బ్రెట్ లీ స్పష్టం చేశాడు. ఈ రకమైన వదంతులు తనను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని, నిజం ఏమిటో తనకు తెలుసునని అతడు తేల్చి చెప్పాడు.
కాగా, ఈ రూమర్లపై 2010లోనే ప్రీతి జింటా స్పందిస్తూ.. ఏటా బ్రెట్ లీతో తనకు సంబంధాలు కలిపి వార్తలు రాయడం పాతబడిపోయిందని, తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని కుండబద్దలు కొట్టింది. ఇక బ్రెట్ లీ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఆయన 2006లో ఎలిజబెత్ కెంప్‌ను వివాహం చేసుకున్నాడు. మనస్పర్థల కారణంగా 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2014లో లానా అండర్సన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు.
ప్రీతి జింటా విషయానికొస్తే.. ఆమె అమెరికాకు చెందిన జెన్ గుడెనఫ్ (Gene Goodenough)ను ఫిబ్రవరి 29, 2016న వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2021లో సరోగసి ద్వారా కవల పిల్లలు జన్మించారు. ప్రీతి జింటా గత కొన్నేళ్ళ నుంచి బాలీవుడ్‌లో అంత చురుకుగా లేరు. అయితే ప్రస్తుతం సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బత్వారా 1947' సినిమా షూటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
సౌతాఫ్రికా టీ20 లీగ్: కీరన్ పొలార్డ్‌ను పక్కన పెట్టిన ఎంఐ
భారత్‌ను ఓడించేందుకు ఆస్ట్రేలియా ప్రత్యేక ప్రణాళికలు