Share News

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: భారత్‌ను ఓడించేందుకు ఆస్ట్రేలియా ప్రత్యేక ప్రణాళికలు

ABN , Publish Date - Aug 05 , 2026 | 01:35 PM

బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఐదు టెస్టుల సిరీస్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: భారత్‌ను ఓడించేందుకు ఆస్ట్రేలియా ప్రత్యేక ప్రణాళికలు
Border Gavaskar Trophy 2027

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఐదు టెస్టుల సిరీస్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆసీస్ జట్టు భారత పర్యటనకు రావడానికి ఐదు నెలల ముందే సన్నాహాలు ప్రారంభించింది. ఈసారి సంప్రదాయ ప్రాక్టీస్ మ్యాచ్‌లకు బదులుగా భారత పరిస్థితులను ప్రతిబింబించే వేదికలో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించాలని ఆసీస్ నిర్ణయించింది. ఈ సందర్భంగా బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసినట్లు ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు.


‘ఈసారి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడే ఆలోచన లేదు. తొలి టెస్టు జరిగే పరిస్థితులకు దగ్గరగా ఉండే వాతావరణంలో శిక్షణ పొందడంపైనే మా దృష్టి ఉంది. అందుకు అనువైన వేదికను ఖరారు చేసే పనిలో ఉన్నాం. గతంలో యూఏఈ, బెంగళూరులోనూ శిక్షణ శిబిరాలు నిర్వహించిన అనుభవం మాకుంది. ఈసారి కూడా అలాంటి అవకాశాలనే పరిశీలిస్తున్నాం’ అని వెల్లడించారు. 2027 జనవరి 21 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాగ్‌పూర్‌లో ఆరంభమై, చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్ వేదికలుగా కొనసాగనుంది.


భారత్‌కు తగ్గ జట్టే ఎంపిక

శిక్షణతో పాటు జట్టు ఎంపికలోనూ ఆస్ట్రేలియా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయనుంది. న్యూజిలాండ్‌తో జరిగే స్వదేశీ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత్‌కు అనువైన నైపుణ్యాలు ఉన్న ఆటగాళ్లను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని భావిస్తోంది. దీంతో న్యూజిలాండ్ సిరీస్ ఆడిన జట్టే భారత్‌కు వస్తుందని చెప్పలేమని మెక్‌డొనాల్డ్ స్పష్టం చేశారు. భారత్ పర్యటనకు ఎంపికయ్యే ఆటగాళ్లు వేరే ఇతర టోర్నీలకు దూరంగా ఉండి రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించనున్నారు. ఎడమచేతి స్పిన్నర్ మాథ్యూ కూనెమన్, ఆఫ్‌స్పిన్నర్ టాడ్ మర్ఫీ, ఆల్‌రౌండర్ కూపర్ కనోలీ, బ్యాటర్లు పీటర్ హ్యాండ్స్‌కాంబ్, మాథ్యూ రెన్‌షా వంటి ఆటగాళ్లు భారత్ పర్యటనకు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.


20 ఏళ్ల నిరీక్షణకు తెర పడుతుందా?

ఆస్ట్రేలియా చివరిసారిగా 2004-05లో భారత్‌లో టెస్టు సిరీస్ గెలిచింది. ఆ తర్వాత ప్రతి పర్యటనలోనూ నిరాశే ఎదురైంది. ఈసారి మాత్రం ప్రాక్టీస్ మ్యాచ్‌ల కంటే భారత పరిస్థితులకు అలవాటు పడటానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ కొత్త వ్యూహంతో బరిలోకి దిగుతోంది. ఈ మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందో లేదో వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తేలనుంది.


ఇవి కూడా చదవండి:

అగార్కర్‌పై వేటు?.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌ రేసులోకి వీవీఎస్ లక్ష్మణ్!

చివరి బంతికి ఒక్క పరుగు.. ఈ మిస్‌ఫీల్డ్ క్రేజీ రనౌట్‌ను చూడాల్సిందే!

Updated Date - Aug 05 , 2026 | 01:39 PM