Share News

అగార్కర్‌పై వేటు?.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌ రేసులోకి వీవీఎస్ లక్ష్మణ్!

ABN , Publish Date - Aug 05 , 2026 | 09:38 AM

రోహిత్ శర్మ భవిష్యత్తుపై నెలకొన్న వివాదం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవిపైనా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. అగార్కర్ స్థానంలో భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.

అగార్కర్‌పై వేటు?.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌ రేసులోకి వీవీఎస్ లక్ష్మణ్!
VVS Laxman

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై నెలకొన్న వివాదం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవిపైనా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. అగార్కర్ స్థానంలో భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. వరుసగా సిరీస్ ఓటముల నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను తప్పించి లక్ష్మణ్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. తాజాగా కోచ్‌గా కాదు.. లక్ష్మణ్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమిస్తారనే కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.


ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం వాస్తవానికి 2026 జూన్‌తో ముగియాల్సి ఉంది. కాగా బీసీసీఐ మూడు నెలల పొడిగింపు ఇచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయనను కొనసాగించే అవకాశం ఉందని భావించినా, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు పరిస్థితిని మార్చినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ రోహిత్ శర్మకు చివరిదని గతంలో ప్రచారం జరిగింది. రోహిత్‌ను తర్వాతి సిరీస్‌ల నుంచి తప్పించే అంశంపై అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్‌తో చర్చించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేకు ముందే అది రోహిత్ చివరి మ్యాచ్ అవుతుందన్న వార్తలు బయటకు రావడం, అదే మ్యాచ్‌లో రోహిత్ అద్భుత సెంచరీతో చెలరేగడం సెలెక్టర్లు, జట్టు యాజమాన్యాన్ని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టిందని సమాచారం.


మరోవైపు, 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ను కొనసాగించాలనే అభిప్రాయంలో జట్టు యాజమాన్యం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో 10 మ్యాచ్‌ల్లో 8 పరాజయాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినప్పటికీ, ఇప్పటివరకు ఆ సమావేశం జరగలేదు. ఇంగ్లండ్ పర్యటన ముగిసినా సమీక్ష లేకుండానే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ శ్రీలంక పర్యటన తర్వాత ప్రధాన కోచ్, చీఫ్ సెలెక్టర్ పదవులతో పాటు రోహిత్ శర్మ వన్డే కెరీర్ భవితవ్యంపైనా కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

వన్డే ప్రపంచ కప్.. రోహిత్ శర్మ జట్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకోడు: మహ్మద్ కైఫ్

జట్టును వీడిన కోచ్‌లు ర్యాన్ టెన్, దిలీప్.. బీసీసీఐ స్పెషల్ మెసేజ్

Updated Date - Aug 05 , 2026 | 09:51 AM