వన్డే ప్రపంచ కప్.. రోహిత్ శర్మ జట్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకోడు: మహ్మద్ కైఫ్
ABN , Publish Date - Aug 05 , 2026 | 07:39 AM
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇటీవల జోరుగా సాగిన ఊహాగానాలపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 138 పరుగులతో అదరగొట్టిన రోహిత్.. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇటీవల జోరుగా సాగిన ఊహాగానాలపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 138 పరుగులతో అద్భుత సెంచరీ సాధించిన రోహిత్.. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడని పేర్కొన్నాడు. ఇటీవల వరుసగా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరుతుండటంతో రోహిత్‌ను 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు నుంచి తప్పించే ఆలోచనలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే లార్డ్స్‌లో చెలరేగిన రోహిత్ ఆ ప్రచారాలన్నింటినీ తిప్పికొట్టాడు. ఈ క్రమంలో కైఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘రోహిత్ శర్మ ఒక విషయాన్ని సెలక్టర్లకు, అభిమానులకు, విమర్శలు చేసేవారికి స్పష్టంగా చెప్పేశాడు. ‘నేను బాగా ఆడకపోతే మీరే నిర్ణయం తీసుకోండి.. అవసరమైతే జట్టు నుంచి తప్పించండి. కానీ నేనైతే స్వచ్ఛందంగా తప్పుకోను’ అని క్లియర్ మెసేజ్ ఇచ్చేశాడు. నా ప్రకారం రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా చేసుకునే ప్రదర్శన చేస్తున్నాడు. ఫిట్‌నెస్ సాధించాడు. బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. అతడు జట్టు నుంచి తప్పుకునే పరిస్థితే లేదు. రోహిత్ ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఆడుతున్నాడు. లార్డ్స్ సెంచరీ అతని నిబద్ధతకు నిదర్శనం. సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటారో అది వారి ఇష్టం. కానీ రోహిత్ శర్మ మాత్రం ఇంకా భారత జట్టు కోసం ఆడాలనే లక్ష్యంతో ఉన్నాడనే సంకేతాన్ని ఇచ్చేశాడు’ అని కైఫ్ వెల్లడించాడు.
రోహిత్ శర్మనే కీలకం..
జట్టు యాజమాన్యం రోహిత్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించాలని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ‘రోహిత్ సహజ శైలిలో ఆడేందుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని కోచ్‌లు చెబుతున్నారు. కానీ ‘2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ కీలక భాగం’ అని ఇప్పటివరకు ఎవరూ స్పష్టంగా చెప్పలేదు. అలాంటి ప్రకటన టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి వస్తే అన్ని సందేహాలు తొలగిపోతాయి. వారు చెప్పినా చెప్పకపోయినా రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్‌లో కీలక వ్యక్తి. ఫామ్‌లో హెచ్చుతగ్గులు సహజం. ఒకటి రెండు సిరీస్‌ల్లో విఫలమైనంత మాత్రాన రోహిత్‌పై అనుమానాలు వ్యక్తం చేయకుండా జట్టు యాజమాన్యం అతడికి అండగా నిలవాలి. ప్రస్తుతం బయటి వారికి అనేక సందేహాలు ఉన్నప్పటికీ, రోహిత్ మాత్రం స్వయంగా రిటైర్‌మెంట్ ప్రకటించే ఆలోచనలో లేడని నాకు అనిపిస్తోంది’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు
రహానేకు దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు: సునీల్ గావస్కర్