రహానేకు దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు: సునీల్ గవాస్కర్
ABN , Publish Date - Aug 04 , 2026 | 06:14 PM
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రహానే గురించి దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రహానే గురించి దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌లా రహానేకు గుర్తింపు దక్కలేదని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
'కెప్టెన్‌గా రహానే రికార్డు అసాధారణమైనది. ఆరు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, ఒక్క ఓటమి కూడా లేదు. తన కెప్టెన్సీలో కొన్ని అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ, రాహుల్ ద్రవిడ్‌కు దక్కాల్సిన గుర్తింపు ఎలాగైతే దక్కలేదో, అలాగే రహానేకు కూడా గుర్తింపు రాలేదు. అతడికి దక్కాల్సిన ప్రశంసలు చాలా అరుదుగా లభించాయి. జట్టు గెలిచినప్పుడు, బ్యాటర్లు, బౌలర్లు ఇలా వ్యక్తిగతంగా రాణించిన వారికే ప్రశంసలన్నీ దక్కుతాయి. కానీ జట్టు ఓడిపోయినప్పుడు నిందలన్నీ కెప్టెన్, కోచ్‌పై పడతాయి. ఇది భారత క్రికెట్‌లో సర్వసాధారణం' అని గావస్కర్ పేర్కొన్నాడు.
'2021లో ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లోని మొదటి టెస్టులో భారత జట్టు 36 పరుగులకే ఆలౌటై... చిత్తుగా ఓడింది. ఈ క్రమంలోనే రవిశాస్త్రితో కలిసి రహానే జట్టును గట్టెక్కించాడు. మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓడ పగ్గాలు చేపట్టిన రహానే, దానిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాడు. అంతేకాక ఆస్ట్రేలియా కంచుకోట అయిన 'ది గబ్బా'లో భారత్‌కు అపూర్వమైన తొలి విజయాన్ని అందించాడు. దానితో పాటు 2-1 తేడాతో సిరీస్ విజయాన్ని కూడా అందించాడు' అని గావస్కర్ తెలిపాడు.
'నిజానికి, ఆస్ట్రేలియా సిరీస్‌లోని చివరి టెస్టులో చాలా మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు గాయాల కారణంగా అందుబాటులో లేరు. అలాంటి స్థితిలో భారత జట్టు టెస్ట్ క్రికెట్‌లో తన గొప్ప విజయాల్లో ఒకటి సాధించింది. ఈ ఆటలో ఎవరూ అనవసరం కాదని, ఒకవేళ ఎప్పుడైనా నిరూపించాల్సి వస్తే.. ఈ సిరీసే ఉదాహరణ. రహానే నిస్వార్థమైన ఆట తీరుకు అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆటలో ఒక్క శత్రువు కూడా లేని క్రికెటర్లు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో రహానే ఒకడు' అని గావస్కర్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
పీసీబీ కీలక నిర్ణయం..పాక్ బ్యాటింగ్ కోచ్‌గా స్మిత్
యూఏఈ వేదికగా మహిళల టీ20 ఆసియా కప్ 2026..!