Share News

పీసీబీ కీలక నిర్ణయం..పాక్ బ్యాటింగ్ కోచ్‌గా స్మిత్

ABN , Publish Date - Aug 04 , 2026 | 04:11 PM

పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మైకేల్ స్మిత్ నియమితులయ్యాడు. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

పీసీబీ కీలక నిర్ణయం..పాక్ బ్యాటింగ్ కోచ్‌గా స్మిత్
Michael Smith

స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మైకేల్ స్మిత్ నియమితులయ్యాడు. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. స్మిత్ ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనుండగా.. టెస్టులు, వన్డేలు, టీ20లతో సహా మూడు ఫార్మాట్లలోనూ పాక్ బ్యాటర్లకు శిక్షణ అందించనున్నాడు. ఈ నెల19 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్‌కు ముందే స్మిత్ జట్టుతో చేరనున్నాడు.


గత కొంతకాలంగా పాక్ బ్యాటర్లు విదేశీ గడ్డపై ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుండటంతో బోర్డు తీవ్ర ఆందోళన చెందింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో వెనుకబడటం, నిలకడలేని బ్యాటింగ్ తీరు జట్టు పతనాన్ని శాసిస్తుండటంతో ఈ లోపాలను సరిదిద్ది పటిష్ఠమైన టాప్, మిడిల్ ఆర్డర్‌ను తీర్చిదిద్దే బాధ్యతను పీసీబీ.. స్మిత్‌కు అప్పగించింది. 2003 నుండి 2013 మధ్య కాలంలో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిన మైకేల్ స్మిత్, 89 ఫస్ట్ క్లాస్, 72 లిస్ట్-ఎ, 16 టీ20 మ్యాచ్‌లలో మొత్తంగా 7,029 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు, 40 అర్ధసెంచరీలు ఉన్నాయి.


ఆటగాడిగా వీడ్కోలు పలికిన అనంతరం లెవెల్ 4 కోచింగ్ డిగ్రీ పూర్తి చేసిన స్మిత్, శిక్షకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. పీఎస్‌ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్) లో ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్ వంటి ప్రముఖ ఫ్రాంచైజీల్లో పని చేశాడు. ఇది పాక్ ఆటగాళ్లకు కలసివచ్చే అంశం. ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్, టాస్మేనియా జట్లకు కూడా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. స్మిత్ రాకతోనైనా పాకిస్థాన్ బ్యాటింగ్ విభాగం మళ్లీ గాడిలో పడుతుందో లేదో చూడాలి.


ఇవి కూడా చదవండి:

యూఏఈ వేదికగా మహిళల టీ20 ఆసియా కప్ 2026..!

విషాదం..గుండెపోటుతో బ్రెజిల్ ప్లేయర్ మృతి

Updated Date - Aug 04 , 2026 | 04:11 PM