Share News

ఐపీఎల్‌కు ముందే కోహ్లీ అరంగేట్రం.. తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు ఆడాడో తెలుసా?

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:40 AM

క్రికెట్ ప్రపంచాన్నే శాసించిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చాడని అందరూ అనుకుంటుంటారు. కానీ కోహ్లీ ఐపీఎల్ కంటే ముందే టీ20 క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

ఐపీఎల్‌కు ముందే కోహ్లీ అరంగేట్రం.. తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు ఆడాడో తెలుసా?
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవ్వరూ టచ్ కూడా చేయలేని ఎన్నో రికార్డులు అతడి పేరు మీద ఉన్నాయి. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అయితే క్రికెట్ ప్రపంచాన్నే శాసించిన కింగ్.. ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చాడని అందరూ అనుకుంటుంటారు. కానీ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కంటే ముందే టీ20 క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఐపీఎల్‌కు ముందు బీసీసీఐ నిర్వహించిన ప్రయోగాత్మక దేశవాళీ టోర్నీలో కోహ్లీ అరంగేట్రం చేశాడు. 18 ఏళ్ల వయసులో ఢిల్లీ తరఫున బరిలోకి దిగి హిమాచల్ ప్రదేశ్‌పై తొలిసారి టీ20 మ్యాచ్ ఆడాడు.


హిమాచల్ ప్రదేశ్‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌కు ప్రేక్షకులు పెద్దగా రాలేదు. అయితే భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌ను శాసించే ఓ ఆటగాడి తొలి టీ20 ఇన్నింగ్స్ అక్కడే ఆవిష్కృతమైంది. కఠినమైన పిచ్‌పై ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయిన వేళ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ 26 బంతుల్లో 35 పరుగులు చేశాడు. భారీ షాట్ల కంటే సింగిల్స్, డబుల్స్‌పై దృష్టి పెట్టి పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాడు. ఆ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 28 బంతుల్లో 38 పరుగులతో ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్‌గా నిలవగా, కోహ్లీ రెండో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. అయితే ఢిల్లీ జట్టు 136 పరుగులకే ఆలౌట్ అయింది. హిమాచల్ బౌలర్ నిశ్చల్ గౌర్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ సందీప్ శర్మ 44 బంతుల్లో 45 పరుగులతో జట్టును గెలిపించాడు.


ఆసక్తికర విషయం ఏమిటంటే.. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ డ్రాఫ్ట్‌లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ తమ సొంత రాష్ట్ర ఆటగాడైన విరాట్ కోహ్లీని ఎంపిక చేయకుండా, అండర్-19 ప్రదర్శనల ఆధారంగా పేసర్ ప్రదీప్ సంగ్వాన్‌ను తీసుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తక్కువ ధరకే కోహ్లీని దక్కించుకుంది. ఆ నిర్ణయం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విలువైన ఎంపికల్లో ఒకటిగా నిలిచింది. 2008 ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కోహ్లీ ఆర్సీబీ తరఫునే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో తొలి ట్రోఫీని ముద్దాడిన బెంగళూరు జట్టు.. 2026లోనూ టైటిల్‌ను నిలబెట్టుకోవడం విశేషం.


ఇవి కూడా చదవండి:

అగార్కర్‌పై వేటు?.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌ రేసులోకి వీవీఎస్ లక్ష్మణ్!

చివరి బంతికి ఒక్క పరుగు.. ఈ మిస్‌ఫీల్డ్ క్రేజీ రనౌట్‌ను చూడాల్సిందే!

Updated Date - Aug 05 , 2026 | 11:40 AM