షాకింగ్.. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఏడుగురు అథ్లెట్ల అదృశ్యం
ABN , Publish Date - Aug 05 , 2026 | 10:40 AM
కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగిసిన అనంతరం ఏడుగురు అథ్లెట్లు అదృశ్యమైన ఘటన సంచలనం రేపింది. గ్లాస్గోలో పోటీలు ముగిసిన తర్వాత తమ జట్లతో కలిసి స్వదేశాలకు తిరిగి వెళ్లకుండా కొందరు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగిసిన అనంతరం ఏడుగురు అథ్లెట్లు అదృశ్యమైన ఘటన సంచలనం రేపింది. గ్లాస్గోలో పోటీలు ముగిసిన తర్వాత తమ జట్లతో కలిసి స్వదేశాలకు తిరిగి వెళ్లకుండా కొందరు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తొలుత పాకిస్థాన్‌కు చెందిన బాక్సర్ మిస్ అయ్యాడని సమాచారం వచ్చింది. ఆ తర్వాత మరో ఆరుగురు ప్లేయర్లు కూడా అదృశ్యమయ్యారని తెలిసింది. దీనిపై స్కాట్లాండ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో యూకే హోం ఆఫీస్‌తో కలిసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉగాండా మీడియా కథనాల ప్రకారం.. ఆ దేశానికి చెందిన ఆరుగురు బాక్సర్లలో నలుగురు స్వదేశానికి వెళ్లాల్సిన విమానం ఎక్కలేదు. వారిని నుహు బట్టే, ఏంజెల్ కటుషాబే, ఇబ్రహీం కెమిస్, ఎమిలీ నకలేమాగా గుర్తించారు. వారిలో ఒకరు స్కాట్లాండ్‌లో ఆశ్రయం కోరారని, అక్కడే మెరుగైన శిక్షణతో బాక్సింగ్ కెరీర్ కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు స్థానిక మీడియాకు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఉగాండా జట్టు అధికారులు స్పందించేందుకు నిరాకరించారు.
మరోవైపు పాకిస్థాన్ బాక్సర్ ఖుద్రతుల్లా కూడా జట్టు హోటల్ నుంచి అదృశ్యమైనట్లు సమాచారం. స్వదేశానికి బయల్దేరే ముందు అతడు గదిలో లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతడి పాస్‌పోర్ట్ జట్టు మేనేజర్ వద్దే ఉన్నప్పటికీ ఖుద్రతుల్లా కనిపించకుండా పోయాడని పాకిస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి ఘటనలు కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్తేమీ కాదు. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్ సందర్భంగా కూడా పాకిస్థాన్ బాక్సర్లు సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్ అదృశ్యమయ్యారు. అలాగే 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత దాదాపు 50 మంది అథ్లెట్లు, అధికారులు ఆస్ట్రేలియా విడిచి వెళ్లకపోగా, మరో 190 మంది వరకు ఆశ్రయం కోసం దరఖాస్తు చేసినట్లు అప్పట్లో నివేదికలు వెల్లడించాయి. కాగా గ్లాస్గోలో 11 రోజుల పాటు జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 74 దేశాలకు చెందిన 3,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొన్నారు. పోటీలు ముగియడంతో అన్ని బృందాలు స్వదేశాలకు చేరుకుంటున్న నేపథ్యంలో అదృశ్యమైన అథ్లెట్ల కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
అగార్కర్‌పై వేటు?.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ రేసులోకి వీవీఎస్ లక్ష్మణ్!
చివరి బంతికి ఒక్క పరుగు.. ఈ మిస్‌ఫీల్డ్ క్రేజీ రనౌట్‌ను చూడాల్సిందే!