దేశంలోనే తొలిసారి.. ఏపీ హస్తకళలకు ‘క్యూఆర్ కోడ్’
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:21 AM
ఏపీ హస్తకళలకు సాంకేతికతను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచన మేరకు దేశంలో తొలిసారిగా హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
అమరావతి, ఆగస్టు 6: ఏపీ హస్తకళలకు సాంకేతికతను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచన మేరకు దేశంలో తొలిసారిగా హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్(QR Code) విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ‘లేపాక్షి’ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రారంభించారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఆయా కళాఖండానికి సంబంధించిన పూర్తి వివరాలు క్షణాల్లో అందుబాటులోకి రానున్నాయి. కళాఖండం చరిత్ర, సాంస్కృతిక విశిష్ఠత, దానిని రూపొందించిన కళాకారుడి పేరు, నైపుణ్యం, తయారీ విధానం క్యూఆర్ కోడ్‌లో రానున్నాయి.
అలాగే ముడిసరుకు, తయారీ సమయం, వస్తువు కొలతలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జీఐ(Geographical Indication) ట్యాగ్, ‘ఒక జిల్లా - ఒక ఉత్పత్తి’కి సంబంధించిన వివరాలు కూడా క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో రాష్ట్రంలోని ఎనిమిది ఐకానిక్ హస్తకళా ఉత్పత్తులకు ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. బొబ్బిలి వీణ, కలంకారి పెయింటింగ్స్, సవర ఆదివాసి పెయింటింగ్స్ వంటి ప్రముఖ హస్తకళా ఉత్పత్తులకు డిజిటల్ ప్రొఫైల్‌ను రూపొందించారు.
త్వరలోనే అన్ని హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ విధానం ద్వారా నకిలీ హస్తకళా ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ మార్కెట్‌లో ఏపీ హస్తకళలకు మరింత ఆదరణ పెరగడం, కళాకారులకు సరైన గుర్తింపు, మెరుగైన ఆదాయం లభించడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్యూఆర్ కోడ్ విధానంతో రాష్ట్ర హస్తకళలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
ఇవి కూడా చదవండి...
నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్ వాసి బలవన్మరణం
ఏపీ కేబినెట్ ముందుకు 30కి పైగా అజెండా అంశాలు..
Read Latest AP News And Telugu News