ఏపీ కేబినెట్ ముందుకు 30కి పైగా అజెండా అంశాలు..
ABN , Publish Date - Aug 06 , 2026 | 10:47 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో 30కి పైగా కీలక అజెండా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అమరావతి, ఆగస్టు 6: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు(గురువారం) సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో 30కి పైగా కీలక అజెండా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ‘అమరావతి ఐ’ ప్రాజెక్టుకు రీ-టెండర్లు పిలవడంతో పాటు, ఈ ప్రాజెక్టు కోసం గరిష్ఠంగా 10 ఎకరాల అదనపు భూమిని లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణ పనులను ఎల్ అండ్ టీ (L&T)కు అప్పగించడంపై చర్చించనున్నారు. రూ.1,002.49 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రుణ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది.
అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్ల కోసం అదనపు కన్సల్టెన్సీ వ్యయంపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని రూ.206.60 కోట్లకు పెంచే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలించనుంది. అమరావతిలో భూ కేటాయింపులపై జీఓఎమ్(GoM) చేసిన సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ల్యాండ్ పూలింగ్ రైతులకు చెల్లించాల్సిన యాన్యుటీ కోసం రూ.300 కోట్ల రుణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. వైకుంఠపురం ఇనాం భూముల వివాద పరిష్కారంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. దేవాదాయ శాఖకు రూ.122.20 కోట్ల చెల్లింపుపై మంత్రివర్గం చర్చించనుంది.
విశాఖపట్నంలోని వెలంపేట స్లమ్ పునరాభివృద్ధికి ప్రత్యేక సడలింపులు కల్పించే ప్రతిపాదనను కేబినెట్ పరిశీలించనుంది. 177 పేద కుటుంబాలకు రూ.28.44 కోట్ల వ్యయంతో గృహ నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. భీమవరం, మార్కాపురం, నంద్యాలలో కొత్త అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల(UDA) ఏర్పాటుతో పాటు పలు యూడీఏల పరిధుల మార్పులు, విలీనాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ‘పాదచారుల భద్రత విధానం–2026’కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, రోడ్ సేఫ్టీ ఆడిట్ల అమలుకు కొత్త విధానంపై చర్చించనున్నారు.
విద్యా, వైద్య సంస్థలకు కేటాయించిన భూముల లీజు గడువును పొడిగించేందుకు అవసరమైన చట్ట సవరణలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. మున్సిపల్ భూముల లీజులను 25 ఏళ్లకు మించి పునరుద్ధరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ దిశా బిల్లు సవరణలపై కేబినెట్ చర్చించనుంది. చేపల, రొయ్యల సాగు ఫారాలకు యూనిట్‌కు రూ.1.50 రాయితీ విద్యుత్ టారిఫ్‌ను 2026 జూన్ 1 నుంచి కొనసాగించే ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
కర్నూలు బస్సు ప్రమాదం కేసు.. జిల్లా ఎస్పీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్ వాసి బలవన్మరణం
Read Latest AP News And Telugu News