మహిళా ట్రైనీ ఐపీఎస్ కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్న ఉమెన్ సేఫ్టీ అధికారులు
ABN , Publish Date - Aug 06 , 2026 | 10:18 AM
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రేపు సాయంత్రం ఐదున్నర గంటల వరకు కస్టడీ కొనసాగనుంది.
హైదరాబాద్, ఆగస్టు 6: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రేపు(శుక్రవారం) సాయంత్రం ఐదున్నర గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య నాయక్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీసీపీ .. అత్తాపూర్ పీఎస్‌కు చేరుకున్నారు. కృష్ణారెడ్డిని డీసీపీ పర్యవేక్షణలో సీఐ జ్యోత్స్న విచారిస్తున్నారు. కస్టడీలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. విచారణలో కీలక ఆధారాలు సేకరించే దిశగా పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా మిస్సైన మొబైల్ ఫోన్‌పై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఉదయ్ కృష్ణారెడ్డి రెండో మొబైల్ పైన ఆరా తీస్తున్నారు. మిస్సైన రెండో మొబైల్ దొరికినట్లయితే మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఉదయ్‌కు సంబంధించిన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేసి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు.
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని గత నెల 28న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ అధికారులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. రెండు రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్‌తో పరిచయం, లైంగిక వేధింపులు, తదితర అంశాలపై పోలీసుల విచారణ కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి...
కర్నూలు బస్సు ప్రమాదం కేసు.. జిల్లా ఎస్పీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్ వాసి బలవన్మరణం
Read Latest Telangana News And Telugu News