Share News

ప్రధాని మోదీని దూషిస్తే.. బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసైనా పెట్టారా?

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:34 AM

ప్రధాని నరేంద్రమోదీని, ఆయన తల్లిని సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా దూషించిన ఘటనలపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క కేసైనా నమోదు చేశారా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

ప్రధాని మోదీని దూషిస్తే.. బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసైనా పెట్టారా?

  • తెలంగాణలో మేము కేసు పెట్టాం

  • అధికారుల బదిలీ.. సీఎం విచక్షణాధికారం

  • చట్టానికి లోబడే డీసీపీ బదిలీ జరిగింది

  • పనిలేని నాయకులే విమర్శలు చేస్తున్నారు

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

  • తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపునకు అనుమతులు ఇప్పించండి.. పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదు

  • మహారాష్ట్రతో సమావేశం ఏర్పాటు చేయండి

  • జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు సీఎం వినతి

  • పాలమూరు, సీతమ్మసాగర్‌, డిండికి పర్యావరణ అనుమతులివ్వండి

  • కేంద్ర మంత్రి భూపేందర్‌కు రేవంత్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీని, ఆయన తల్లిని సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా దూషించిన ఘటనలపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క కేసైనా నమోదు చేశారా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కానీ, తెలంగాణలో తాము కేసు పెట్టామని తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ను ఆయన కార్యాలయంలో కలిసి బయటికి వస్తుండగా.. మీడియా అడిగిన ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి బదులిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలో కేసు నమోదు చేసిన డీసీపీని బదిలీ చేయడంపై స్పందిస్తూ.. తమ ప్రభుత్వం చట్టానికి లోబడే ముందుకెళుతోందని చెప్పారు. వచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అధికారులను బదిలీ చేయడమనేది ముఖ్యమంత్రికి ఉన్న విచక్షణాధికారమని, అది రాజ్యాంగం కల్పించిన బాధ్యతల్లో ఒకటని అన్నారు. అయితే, ఈ కేసు వ్యవహారంలో ఒక డీఎస్పీ బదిలీపై ఢిల్లీలో ఉన్న కొందరు పనీపాటా లేని నాయకులు విమర్శలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. విద్యార్థులను, ఇతర పార్టీల నాయకులను బీజేపీ నేతలు అత్యంత అసభ్యకరమైన, పరుష పదజాలంతో దూషిస్తున్నారని తప్పుబట్టారు. మరోవైపు ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బ్యారేజీ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదని తెలిపారు. బుధవారం కేంద్రమంత్రితో ఆయన కార్యాలయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి రేవంత్‌ సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యం, ప్రాజెక్టుకు అనుమతులు కోరుతూ ప్రధానమంత్రికి తాను రాసిన లేఖ, దానికి ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి జలశక్తికి పంపిన లేఖ విషయాన్ని సీఎం ప్రస్తావించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. 148 మీటర్ల నుంచి 152 మీటర్ల వరకు ఎత్తుతో బ్యారేజీ నిర్మించే అంశంపై పుణెలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ సెంటర్‌(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) అధ్యయనం చేసిందని తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం.. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా, 152 మీటర్ల ఎత్తులో నిర్మించినా ముంపులో పెద్దగా తేడా ఉండదని స్పష్టమైనట్లు వివరించారు. పైగా, ముంపులోనూ 50 శాతం నదీ గర్భం (రివర్‌ బెడ్‌)లోనే ఉంటుందన్నారు. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేపడితే.. గ్రావిటీ ద్వారా కావాల్సినంత నీరు సరఫరా చేయలేమని, అందుకే 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్రమంత్రిని కోరారు. దాంతో గ్రావిటీ ద్వారానే నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని, అప్పుడు విద్యుత్‌ వినియోగ భారం కూడా ఉండదని అన్నారు. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ, మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో.. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తమకు లేఖ అందిందని, ఈ అంశంపై తొలుత సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి.. తెలంగాణ, మహారాష్ట్ర స్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని పాటిల్‌ చెప్పారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.


పర్యావరణ అనుమతులు ఇవ్వండి..

పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మసాగర్‌, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి పార్లమెంట్‌లో కేంద్రమంత్రిని రేవంత్‌ కలిశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.3,187 కోట్లు, సీతమ్మ సాగర్‌పై రూ.1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్ల నిధులు వ్యయం చేసినట్లు వివరించారు. అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని, దీంతో ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్‌ రెడ్డి, రఘురాంరెడ్డి, బలరాం నాయక్‌, వంశీకృష్ణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌, కడియం కావ్య, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2026 | 06:06 AM