Share News

తెలంగాణ ఉద్యమ శిఖరం.. అన్యాయాలపై పోరాడిన యోధుడు

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:16 AM

ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌.. ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు. చీకట్లు కమ్మిన తెలంగాణలో ప్రత్యేక ఉద్యమాన్ని ప్రజ్వలింప చేసిన జ్వాల.

తెలంగాణ ఉద్యమ శిఖరం.. అన్యాయాలపై పోరాడిన యోధుడు
Professor Jayashankar

  • తెలంగాణ ఏర్పాటు ఆశే శ్వాసగా బతికిన ధన్యజీవి

  • నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ జయంతి

హనుమకొండ: ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌.. ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు. చీకట్లు కమ్మిన తెలంగాణలో ప్రత్యేక ఉద్యమాన్ని ప్రజ్వలింప చేసిన జ్వాల. ఆసమానతల సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు న్యాయం కోసం కొట్లాడిన గొంతు. ఐదు దశాబ్దాలుగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శ నం చేసిన ధృవతార. వామపక్ష భావజాల ఉద్యమాలు, మానవ హక్కుల పోరాటాల్లో మమేకమవుతూనే తెలంగాణ వాదం విని పించిన యోధుడు. నేడు ఆయన జయంతి.


ఉద్యమ శిఖరం

జయశంకర్‌ తెలంగాణ కోసం రాజకీయ ప్రకియ అనివార్యమని ప్రగాఢంగా విశ్వసించారు. కానీ దాని ద్వారానే ప్రత్యేక తెలంగాణ సాధ్యం కాదని జీవితమంతా బోధించారు. తెలంగాణ భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడం ద్వారా పోరాటం సాగించిన ఉద్య మ శిఖరం ఆయన. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు జరిగిన అనేక కుట్రలు, కుతంత్రాల పట్ల జయశంకర్‌ సార్‌ ఎప్పూడూ జాగృతం చేస్తూ ఉండేవారు. ఆయన ఆశ, శ్వాస తెలంగాణే. ప్రజలు కూడా అలాగే ఉండాలని కోరుకునేవారు. నాటి నుంచి నేటి వరకు సాగిన తెలంగాణ పోరాటంలో రాజకీయ విద్రోహాలనుకళ్లారా చూసినవాడు. అందుకే రాజకీయ విద్రోహాలకు మా తరం మోసపోయింది. ఈ తరం మోసపోవద్దు అని పిలుపు నిచ్చేవారు. మోస పోదు అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసేవారు.


సాంస్కృతిక పునరుజ్జీవనం

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ప్రాంత భాష, యాస డింపునకు గురైంది. తెలుగు భాషను భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. మీది తురకల భాష. తౌరక్యాంధ్రం అన్నారంటూ జయశంకర్‌ తరుచూ బాధప డేవారు. సీమాంధ్ర సంస్కృతిని మనమీద రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఆయనతీవ్రంగా వ్యతిరేకించారు. భాషకు మతం ఉండదు. మతానికి భాష ఉండదు. సీమాంధ్రులు రాసిన కవిత్రంలోనూ ఊర్దూ పదాలున్నాయి. సీమాంధ్రులకు వాళ్లు వాడినది ఉర్దూ పదం అనేది వాళ్లకు తెలియదు. అది తెలియదనేది కూడా వాళ్లకు తెలియదు. అందుకే ఎవడి భాష వాడికే ప్రామాణికం అంటూ సహేతుకంగా వాదించేవారు.


విజ్ఞాన సర్వస్వం

జయశంకర్‌ నడిచే విజ్ఞాన సర్వస్వం. పలు అంశాలపైన ఆయనకు పూర్తి సాధికారత ఉండేది. ఏ విషయానైనా సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే రీతిలో విడమరిచి వివరించేవారు. బహుభాషా కోవిదుడు. ఉర్దూలో చదువుకున్నందువల్ల ఆయనకు ఆ భాష అంటే వల్లమాలిన అభిమానం ఉండేది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఆయనకు అపారమైన నైపుణ్యముండేది. ఆయన ఆర్థిక శాస్త్రవేత్త మాత్రమే కాదు. గొప్ప రాజనీతిజ్ఞుడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఒక శాస్త్రీయతను సమకూర్చిన వ్యక్తి తెలంగాణ దార్శనీకతకు ఆయన ఒక పర్యాయపదంగా నిలిచారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తన ప్రసంగాల ద్వారానే కాక రచనల ద్వారా కూడా ప్రజలకు విడమరిచి చెప్పారు. ఇందుకు ఆయన రాసిన పుస్తకాలు, వందలాది వ్యాసాలు తిరుగులేని ఆనవాళ్లకు శిలాశాసనాలు. ఆయన రచనలే తెలంగాణ ఉద్యమ చరిత్రకు బోధనకు పాఠ్యగ్రంథాలయ్యాయి.


hnk1.jpgపలు కార్యక్రమాలు

ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ జయంతిని పురస్కరించుకొని గురువారం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థల్లో ఘనంగా నిర్వహించేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వు లు జారీ చేశారు. ఆచార్య జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు అర్పించాలని కోరారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆచార్య జయశంకర్‌ జయంతి కార్యక్రమాన్ని ఉద యం 11 గంటలకు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎన్‌.రవి కోరారు. హనుమకొండ ఏకశిల పార్క్‌ (జయశంకర్‌ స్మృతి వనం)లోని జయశంకర్‌ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని పార్టీల నాయకులు, ముఖ్యులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.


గ్రామీణ నేపథ్యం

జయశంకర్‌ది గ్రామీణ నేపథ్యం. పల్లె నుంచి అంచెలంచెలుగా పల్లవించిన జీవితం ఆయనది. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎంత శిఖరాగ్రస్థాయికి ఎదిగినా తన మూలాలను విస్మరించలేదు. మట్టివాసనలను మరువలేదు. 1934 ఆగస్టు6న ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి. తండ్రి లక్ష్మీకాంతారావు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు అక్క చెల్లెళ్లు. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్మ బ్రహ్మచారి. అధ్యాపకుడిగా ఆయన ఎంతోమందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరి పోశారు.


పరిపాలనాదక్షుడు

ఎమర్జెన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా, వైస్‌చాన్సలర్‌గా, హైదరాబాద్‌లో సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా, న్యూఢిల్లీలోని ప్రభుత్వ జాతీయ కమిషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్టార్‌ మెంబర్‌గా, కేరళలోని మహాత్మాగాంధీ వర్సిటీ ప్లానింగ్‌ బోర్డు సభ్యుడిగా, సీఫెల్‌, వరంగల్‌లోని ఆర్‌ఈసీలకు బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సభ్యుడిగా వివిధ పదవులను సమర్థవంతంగా నిర్వహించి పాలనాదక్షుడిగా పేరు గడించారు. తెలంగాణ ఆకాంక్షను యాభై ఏళ్లుగా బతికించి శిఖరాగ్రస్థాయికి చేర్చి తాను కలలు కన్న ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్లారా చూడకుండానే 2011 జూన్‌ 21న కన్నుమూశారు. జయశంకర్‌ సార్‌ స్వప్నించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.


ఈ వార్తలు కూడా చదవండి:

మహిళా ట్రైనీ ఐపీఎస్ కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్న ఉమెన్ సేఫ్టీ అధికారులు

హైదరాబాద్‌లో భారీగా ఓట్ల కోత!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 11:16 AM